
ఆధునికీకరించని లాకులు...అన్నదాతకు కష్టాలు
బాపట్ల: నీటి ప్రవాహాన్ని నియంత్రించేందుకు కొమ్మమూరు కాలువపై నరసాయపాలెం వద్ద ఏర్పాటు చేసిన లాకులు..షెట్టర్లు శిథిలావస్థకు చేరాయి. బ్రిటిష్‌కాలం నాటి 15 షెట్టర్లకు తోడు మరో 10 షెట్టర్లు నిర్మించారు.
ఆ తర్వాత వాటి గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. కనీసం వచ్చే నీటికి అడ్డుకట్ట వేయలేకపోవటంతో ఎగువ ప్రాంతాలకు నీరు సక్రమంగా పారుదల లేకపోవటంతో రైతులు అల్లాడిపోతున్నారు. గత ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే కోన రఘుపతి తాత్కాలికంగా తన సొంత ఖర్చులతో లాకులకు మరమ్మతులు చేయించారు. రైతులకు కొంత ఉపశమనం కలిగించాయి. ఈ ఏడాది మరమ్మతులకు అవకాశం లేకపోవటంతో రైతులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.
నల్లమడ లాకుల ఏర్పాటు ఇలా...
కృష్ణాపశ్చిమ డెల్టా నుంచి 69.545 కిలో మీటర్లు మేరకు కొమ్మమూరు కాలువ నరసాయపాలెం వద్ద ఉన్న నల్లమడ లాకుల వద్దకు చేరుకుంటుంది. కొమ్మమూరు కాలువ మొత్తం ఆయకట్టు 2.15 లక్షల ఎకరాలు కాగా అనధికారిక సాగు మరో 50 వేల ఎకరాలు ఉంటుంది. ఈ మేరకు దుగ్గిరాల వద్ద 3600 క్యూసెక్కులు వదిలినప్పటికి బాపట్ల చానల్, పీటీ చానల్‌లకు పోగా నల్లమడ లాకుల వద్దకు 1100 క్యూసెక్కులు వస్తోంది. ఇక్కడ నుంచి 70,599 ఎకరాల ఆయకట్టు ఉండగా ఎగువ కాలువ మట్టం(లోతు)11.92 అడుగులు ఉండగా దిగువ ఆయకట్టు 8.92 అడుగులు ఉంటుంది. వెడల్పు ఎగువ ప్రాంతంలో 64.0 అడుగులు ఉండగా దిగువ ప్రాంతంలో 48.0 అడుగులు ఉంటుంది. ఈ ప్రాంతం నుంచి నరసాయపాలెం, వెదుళ్లపల్లి, చెరుకుపల్లి ట్యాంకు కాలువ, పెద్దగంజాం వరకు ఈ లాకుల నుంచే నీరు వెళుతుంది. ఈ లాకుల వద్ద కనీసం ఆరు అడుగులు లోతులో నీటి నిల్వ ఉంటే గానీ బాపట్ల, పీటీ చానల్‌కు నీటి పారుదల ఉండే అవకాశం లేదు.
శిథిలావస్థలో లాకులు...షెట్టర్లు
బ్రిటిష్‌కాలంలో ఏర్పాటు చేసిన లాకులు, షెట్టర్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. నల్లమడ వద్ద లాకులు, ఉప్పరపాలెం వద్ద ఉన్న షెట్టర్లు శిథిలావస్థకు చేరాయి. ఉప్పరపాలెం వద్ద ఉన్న 15 షెట్టర్లు బ్రిటిష్ కాలం నాటివి కాగా 10 షెట్టర్లు 15 ఏళ్ల కిందట ఏర్పాటు చేశారు. కాలువ మరమ్మతులు చేయకుండా షెట్టర్లు ఏర్పాటు చేయటం వలన ఆవి కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో ఆ కాలంగా కురిసే వర్షపు నీటికి తోడు పంట కాలువలో ఉండే నీటితో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లాకులు, షెట్టర్లు దెబ్బతిని పోవటంతో కీలకమైన సమయంలో నీటి నిల్వలకు ఇబ్బందికరంగా మారిపోవటంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అధికారులు మాత్రం ఆధునికీకరణ నిధులు వస్తే పూర్తిస్థాయిలో లాకులు, షట్టర్లు మరమ్మతులు చేసే అవకాశం ఉందని
చెబుతున్నారు.
శిథిలావస్థలో నల్లమడ షట్టర్లు
ప్రతి ఏడాదీ మరమ్మతుల కోసం ఎదురుచూపులు పట్టించుకోని అధికారగణం ఆందోళనలో దిగువ ప్రాంత రైతులు

ఆధునికీకరించని లాకులు...అన్నదాతకు కష్టాలు

ఆధునికీకరించని లాకులు...అన్నదాతకు కష్టాలు