
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి
ప్రభుత్వ పథకాలను
అందిపుచ్చుకోవాలి
బాపట్ల: ప్రభుత్వం అందించే వివిధ పథకాల ప్రయోజనాలను లబ్ధిదారులు అందిపుచ్చుకొని వారి స్థితిగతులను మెరుగుపరుచుకోవాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో వివిధ పథకాల ద్వారా లబ్ధిదారులకు యంత్రాలు, చెక్కులు పంపిణీ చేశారు. ప్రజల జీవనోపాధి మెరుగుపరచుకోవడానికి మెప్మా ద్వారా చీరాల మండలంలో 2, బాపట్ల మండలంలో ఇద్దరు లబ్ధిదారులకు ఎలక్ట్రికల్ ఆటోలను జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మరాజు అందజేశారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా 646 మంది సభ్యులకు బ్యాంకు లింకేజీ పథకం ద్వారా, 3686 మందికి శ్రీనిధి పథకం ద్వారా, 384 మందికి లక్ పతి దిది ద్వారా, 14 మంది సభ్యులకు ఉన్నతి పథకం ద్వారా 53 కోట్ల 42 లక్షల రూపాయల చెక్కును, మెప్మా శాఖ ద్వారా 340 మంది స్వయం సహాయక గ్రూపు సభ్యులకు వివిధ బ్యాంకుల ద్వారా సూక్ష్మ చిన్న, మధ్య తరహా రుణం క్రింద రూ.5 కోట్ల 20 లక్షల చెక్కులను అందజేశారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, డీఆర్డిఏ పీడీ శ్రీనివాసరావు, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రాజ్ దేబోరా, బీసీ సంక్షేమ శాఖ అధికారి శివలీల, వ్యవసాయ శాఖ జేడీ రామకృష్ణ, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, బాపట్ల ఆర్డీఓ గ్లోరియా, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, సమగ్ర శిక్ష అభియాన్ జిల్లా ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ ఎం జ్యోత్స్న పాల్గొన్నారు.
ప్రతి ఏటా జీడీపీలో 15శాతం వృద్ధి రేటు పెరిగేలా చూడాలి
బాపట్ల జిల్లా జీడీపీలో ప్రతిఏటా 15 శాతం వృద్ధి రేటు పెరిగేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. బాపట్ల జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్‌పై శనివారం స్థానిక కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి వర్చువల్ విధానంలో హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ బాపట్ల జిల్లా అన్ని రంగాలలో వృద్ధి సాధించాలంటే అందుబాటులో ఉండే వనరులను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. అధికారులంతా సమగ్ర ప్రణాళిక రూపొందించుకుని చిత్తశుద్ధితో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. బ్లాక్ బర్లీ పొగాకు రైతుల పరిస్థితి పునరావృతం గాకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించాలన్నారు. ఆక్వా రంగంలోనూ లాభసాటి సాగు జరిగేలా రైతులకు సూచనలు ఇవ్వాలన్నారు. ప్రజల తలసరి ఆదాయం పెంచడమే లక్ష్యంగా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు.