కౌలుకోలేని దెబ్బ | - | Sakshi
Sakshi News home page

కౌలుకోలేని దెబ్బ

Jul 7 2025 6:24 AM | Updated on Jul 7 2025 2:19 PM

కౌలుక

కౌలుకోలేని దెబ్బ

గిట్టుబాటు ధర లేక కౌలు రైతులు నష్టపోతున్నారు

రాష్ట్ర ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప వ్యవసాయ రంగంలో వృద్ధి లేనేలేదు. ఉత్పత్తి వ్యయం కన్నా మద్దతు ధరలు 20 శాతం తక్కువ ఉన్నాయి. దీంతో పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు రానందున రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం కౌలుదారులకు సకాలంలో రుణ అర్హత పత్రాలు ఇచ్చి బ్యాంకర్ల ద్వారా వాస్తవ సాగుదారులకు రుణాలు మంజూరు చేయాలి.

– బత్తుల హనుమంతురావు, రైతు సంఘం జిల్లా కార్యవర్గ సభ్యుడు

సరైన గిట్టుబాటు ధరలు లేవు

నాకు 4 ఎకరాల సొంత భూమి ఉంది. దీనికి తోడు మరో 24 ఎకరాలు పొలం కౌలుకు తీసుకొని మిరప, పొగాకు, శనగ వంటి పంటలు సాగు చేశా. పండించిన పంటకు గిట్టుబాటు ధర అటుంచి కొనే నాథుడే కరువయ్యాడు. గత సంవత్సరం ఒక ఎకరం పొలం 28 నుంచి 32 వేల వరకు కౌలు చెల్లించా. ఈఏడాది అంత కౌలు చెల్లించి సాగుచేసే పరిస్థితి లేదు.

– గనిపిశెట్టి రమేష్‌, చిమటవారిపాలెం

యద్దనపూడి: వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో పడింది. పది మందికి పట్టెడన్నం పెట్టే అన్నదాత అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి ఆరుగాలం కష్టపడినా గిట్టుబాటు ధర లేకపోవటంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక కౌలు రైతుల పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. గత ప్రభుత్వంలో రైతు భరోసా ఇచ్చి రైతులను ఆదుకోగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం సీజన్‌ ప్రారంభమవుతున్నా కూడా అన్నదాత సుఖీభవ ఇస్తామంటూ ఒక్కరూపాయి కూడా ఇవ్వని దుస్థితి నెలకొంది. ముఖ్యంగా సొసైటీలు, బ్యాంకుల్లో అప్పు చెల్లించలేదంటూ బంగారం వేలం వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో క్రాప్‌ హాలిడే ప్రకటించేందుకు కౌలు రైతులు సమాయత్తమవుతున్నారు.

కౌలు రైతులే అధికం

జిల్లాలో 3.87 లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా 1.87 లక్షల మంది రైతులున్నారు. వీరిలో 70 శాతానికి పైగా కౌలు రైతులే ఉన్నారు. గత ఏడాది ప్రభుత్వం లక్ష మంది కౌలు రైతులకు సీసీఆర్‌ కార్డులు మంజూరు చేయగా 22 వేల మందికి మాత్రమే బ్యాంకుల ద్వారా కౌలు రైతులు రుణ సదుపాయం పొందారు. ఈ ఏడాది లక్ష మంది కౌలు రైతులకు సీసీఆర్‌ కార్డులు మంజూరు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 17,867 మందికి మాత్రమే కౌలు కార్డులు మంజూరు చేశారు. పర్చూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల పరిధిలో గత ఏడాది 9089 మంది సీసీఆర్‌ కార్డులు మంజూరు చేయగా ఈ ఏడాది 1156 మందికి మాత్రమే కౌలు కార్డులు మంజూరు చేశారు.

సాగు సమయం ఆసన్నమవుతున్నా..

వాస్తవానికి ప్రతి ఏడాది రోహిణికార్తె నుంచి కౌలు వ్యవహారాలు సాగుతుంటాయి. ఈ ఏడాది జూలై నెల ప్రారంభమైనప్పటికీ కౌలు లావాదేవీలు అరకొరగానే కొనసాగుతున్నాయి. జిల్లాలో సొంత భూమి సాగు చేసే రైతులకంటే 60 శాతానికి పైగా భూమి కౌలు రైతుల చేతుల్లోనే ఉంటుంది. భూ యజమానులు, కౌలుదారుల మధ్య ఓ మాట ప్రకారం ఆ తంతు సాగిపోతోంది. కానీ ఈ ఏడాది వరుస నష్టాలతో కౌలు సాగుకు కర్షకులు అంతగా అసక్తి చూపటం లేదు. కౌలు ధర తరువాత నిర్ణయించుకుందామని తొలుత సాగు చేయమని భూ యజమానులు కోరుతున్నా కౌలుదారుల నుంచి ఆశించిన స్పందన రావటం లేదు. గత ఏడాది పర్చూరు, యద్దనపూడి, ఇంకొల్లు, మార్టూరు తదితర మండలాల్లో గత ఏడాది ఎకరా రూ.30 వేల నుంచి రూ.38వేల వరకు పొగాకు, మిర్చి పంటలకు కౌలుకు తీసుకోగా, అదే ఎకరా ఈ ఏడాది రూ.18 వేల నుంచి రూ.22 వేల వరకు పడిపోయింది.

మద్దతు ధర లేక.. సాగు సాయం రాక తీవ్ర నష్టాలు ఈ ఖరీఫ్‌ సాగుకు ముందుకు రాని కౌలు రైతులు గతంలో మహర్దశ .. నేడు దుర్దశ జిల్లాలో కౌలు ధరలు ఢమాల్‌ ఈ ఏడాది క్రాప్‌ హాలిడే ప్రకటిస్తామంటున్న రైతన్నలు గిట్టుబాటు ధరలు లేకపోవటమే ప్రధాన కారణం రుణాలు ఇచ్చేవారు కరువు చోద్యం చూస్తున్న ప్రభుత్వం

కౌలుకోలేని దెబ్బ1
1/1

కౌలుకోలేని దెబ్బ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement