
బాపట్ల జిల్లా ప్రథమం
పీ–4 అమలులో
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళికి
సీఎం అభినందనలు
బాపట్ల: పీ–4 అమలులో బాపట్ల జిల్లా కలెక్టర్ ప్రణాళిక, అధికారుల సమష్టి పనితీరు చాలా బాగుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అభినందించారు. పీ–4 అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో శుక్రవారం రాజధాని అమరావతి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వీడియో సమావేశం నిర్వహించారు. బాపట్ల జిల్లాలో 62,388 బంగారు కుటుంబాలు ఉంటే 44,920 కుటుంబాలను 3,528 మంది మార్గదర్శిలకు దత్తత ఇవ్వడంతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచారని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రశంసించారు. బంగారు కుటుంబాలను 72శాతం అనుసంధానించడం అభినందనీయమన్నారు. మిగిలిన 17వేల కుటుంబాలను మార్గదర్శిలకు దత్తత ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు బాపట్లను స్ఫూర్తిగా తీసుకోవాలని సీఎం సూచించారు. పీ–4 విధానంలో బంగారు కుటుంబాలకు చేయూతనందిస్తున్నామని జిల్లా కలెక్టర్ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సమావేశానికి జిల్లా నుంచి సీపీఓ షాలేమ్ రాజు, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసరావు, ఆర్డీఓ గ్లోరియా, తదితరులు హాజరయ్యారు.
నేడు నృసింహుని
హుండీ కానుకల లెక్కింపు
మంగళగిరి టౌన్: స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం హుండీ లెక్కింపు శనివారం నిర్వహించనున్నట్లు కార్యనిర్వహణాధికారి సునీల్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఎగువ, దిగువ సన్నిధిలోను, శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడుల హుండీలను ఉదయం 9 గంటలకు లెక్కించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల భక్తులు పాల్గొనవచ్చని ఆయన తెలియజేశారు.