
ఏకపక్ష వైఖరికి కత్తెర పడేనా?
గుంటూరు ఎడ్యుకేషన్ : ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శుక్రవారం జరగనుంది. ఉదయం 10.30 గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో జరగనున్న ఈ సమావేశానికి ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని ప్రజా ప్రతినిధులు, జెడ్పీటీసీలు, అధికారులకు జెడ్పీ నుంచి ముందస్తుగా సమాచారాన్ని పంపారు. గత మార్చి 15న కోరం లేకపోవడంతో వాయిదా పడిన సమావేశం మరలా ఇప్పటి వరకూ జరగలేదు.
చైర్‌పర్సన్ ఏకపక్ష ధోరణిపై వ్యతిరేకత
ప్రజల ఓట్లతో గెలిచిన జెడ్పీటీసీలకు సముచిత గౌరవాన్ని ఇవ్వకపోవడంతోపాటు ముందస్తు అనుమతుల పేరుతోనూ జెడ్పీ చైర్‌పర్సన్ నేరుగా సంతకాలు చేసి పనులు చేస్తున్న ధోరణికి వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీలు మార్చి 15న ఏర్పాటు చేసిన బడ్జెట్ సమావేశాన్ని బహిష్కరించారు. టీడీపీ ఎమ్మెల్యేల సిఫార్సులతో, అత్యవసర పనుల పేరుతో రూ.కోట్ల విలువైన పనులకు ముందస్తు అనుమతులు ఇస్తున్న తీరును ఖండించారు. వాటిలో కమీషన్లు, పర్సంటేజీ తీసుకుని అవినీతి, అక్రమాలతో జెడ్పీని నడుపుతున్నారని ఆరోపణాస్త్రాలు సంధించారు. మార్చిలో ఏర్పాటు చేసిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆర్థిక సంవత్సర బడ్జెట్‌న ఆమోదించాల్సి ఉండటంతోపాటు రూ.12 కోట్ల విలువైన పనులకు చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా ముందస్తు అనుమతులను ఇచ్చేయడంతో సమావేశానికి హాజరైన పక్షంలో సభ్యులు అంగీకారం తెలిపినట్లవుతుందనే కోణంలో గైర్హాజరయ్యారు. తద్వారా జెడ్పీటీసీలు తమ హక్కులను పరిరక్షించుకోవడంలో సఫలీకృతమయ్యారు.
అజెండాలో ‘రూ.22 కోట్ల విలువైన పనులు’
చైర్‌పర్సన్ వైఖరితో జెడ్పీటీసీలు ఉత్సవ విగ్రహాలుగా మారుతున్నారు. తాము గెలిచీ ప్రయోజనమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. చైర్‌పర్సన్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మార్చి 15న బడ్జెట్ సమావేశానికి గైర్హాజరు కావడంతో, అనుమతుల కోసం ప్రభుత్వానికి పంపి ఆమోదింపజేసుకున్న పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో జెడ్పీటీసీలకు తెలియకుండా ముందస్తు అనుమతుల పేరుతో రూ.12 కోట్ల విలువైన పనులకు అనుమతులు ఇచ్చేశారు. తాజా సమావేశంలో మరో రూ.10 కోట్ల మేరకు ముందస్తు అనుమతులు ఇచ్చారు. మొత్తం రూ.22 కోట్ల పనులను ఆమోదం కోసం శుక్రవారం జరగనున్న సర్వసభ్య సమావేశపు అజెండాలో పొందుపర్చారు.
చైర్‌పర్సన్ ‘నిధుల మంజూరు’ ధోరణిపై వైఎస్సార్ సీపీ సభ్యుల తీవ్ర అసంతృప్తి ఆమోదం కోసం నేటి సర్వసభ్య సమావేశం అజెండాలో పొందుపరిచిన అధికారులు

ఏకపక్ష వైఖరికి కత్తెర పడేనా?