రూ.10 కోట్ల అడ్వాన్స్‌? | - | Sakshi
Sakshi News home page

రూ.10 కోట్ల అడ్వాన్స్‌?

Jul 6 2025 6:49 AM | Updated on Jul 6 2025 6:49 AM

రూ.10

రూ.10 కోట్ల అడ్వాన్స్‌?

మదనపల్లె: ఏదైనా అభివృద్ధి పని జరిగితే పూర్తి స్థాయిలో బిల్లులు చెల్లించడం ఉండదు. అందులోనూ నాణ్యతా ప్రమాణాలు పాటించారా లేదా అని ఒకటికి రెండుసార్లు పర్యవేక్షించి, పరిశీలించాక..క్వాలిటీ కంట్రోల్‌ అధికారుల ధృవీకరణ ఇచ్చాక బిల్లులు పెడతారు. ఇందులోనూ జరిగిన మొత్తం పనికి బిల్లు పెట్టడం ఎక్కడా ఉండదు. కొంత బిల్లు తగ్గిస్తారు. అయితే హంద్రీ–నీవా ప్రాజెక్టు రెండోదశ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పెద్దగా పట్టించుకోని అధికారులు స్వామిభక్తిని చాటుకుంటున్నారు. అందుకు నిదర్శనం పుంగనూరు ఉపకాలువ (పీబీసీ), కుప్పం ఉపకాలువ (కేబీసీ) పనులే. ఈ పనులకు సంబంధించి ఇంకా పూర్తిస్థాయిలో నాణ్యత ప్రమాణాలపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో అంచనాకు రాకముందే బిల్లులన్నీ చెల్లించేందుకు సిద్ధమై అందుకు చర్యలన్నీ పూర్తి చేశారు.

పనులు విలువ రూ.536 కోట్లు

పీబీసీలో 117.767 కిలోమీటర్ల లైనింగ్‌, షార్ట్‌ క్రీటింగ్‌ పనులను ప్రభుత్వం నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి రూ.480.22 కోట్లతో నామినేషన్‌ పద్ధతిలో కట్టబెట్టింది. తర్వాత ఈ పనుల విలువను రూ.366 కోట్లకు కుదించి కాంట్రాక్టు సంస్థతో ఒప్పందం చేసుకుంది. కేబీసీకి సంబంధించి రెండు రీచ్‌లుగా పనులకు టెండర్లు నిర్వహించగా సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌ సంస్థ ఎక్సెస్‌తో పనులు దక్కించుకుంది. ఒకటో రీచ్‌ను రూ.81,43,61,130తో టెండర్‌ పలవగా రూ.85,46,72,008 కోట్లకు, రెండో రీచ్‌ను రూ.80,35,99,740 కోట్లతో టెండర్‌ పిలవగా రూ.84,33,77,923 కోట్లతో రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌ పనులు దక్కించుకుంది. ఈ మేరకు ఏప్రిల్‌లో కాలువల పనులు మొదలయ్యాయి.

చకచకా రూ.150 కోట్ల బిల్లులు

రెండు ఉప కాలువలకు సంబంధించి జరిగిన పనులపై ప్రాజెక్టు అధికారులు వెంటనే బిల్లులకు సిద్ధమయ్యారు. కుప్పం కాలువ పనులు సీఎం చంద్రబాబు సన్నిహితుడైన ఎంపీ సీఎం రమేష్‌ సంస్థ కావడంతో పనులు చాలా వేగంగా జరిగాయని, వాటికి అంచనా కట్టిన అధికారులు బిల్లుల మంజూరుకు ఆగమేఘాల మీద రికార్డులు సిద్ధం చేశారు. మొదటి రీచ్‌కు రూ.42,58,17,772, రెండో రీచ్‌కు రూ.44,81,98,813, పుంగనూరు కాలువకు రూ.60 నుంచి 63 కోట్లలోపు బిల్లులను సిద్ధం చేసి కాంట్రాక్టు సంస్థలకు చెల్లింపులు జరిగేలా చిత్తూరు పే అంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ కార్యాలయానికి నివేదించారు. ఈ స్థాయిలో ఒకేసారి బిల్లులు పెట్టడం అరుదైన విషయమని ప్రాజెక్టు అధికారుల్లోనే చర్చ జరుగుతోంది. దీనికి ముఖ్యంగా అధికారుల్లో చోటుచేసుకున్న స్వామిభక్తే కారణమని అంటున్నారు. 90 కిలోమీటర్ల కుప్పం కాలువ పనుల పర్యవేక్షణ బాధ్యత కేవలం ఒక ఈఈ, ఒక డీఈకే అప్పగించారు. పుంగనూరు కాలువకు సంబంధించి కూడా ఒకరిద్దరు డీఈలకే ఎక్కువ కిలోమీటర్ల పనులు అప్పగించారు. వీరి పర్యవేక్షణ పరిధిలోని పనులకే ఎక్కువ మొత్తంలో బిల్లులు పెట్టినట్టు తెలుస్తోంది. వీరికి కాలువ పనుల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో ఇలా బిల్లుల రూపంలో భక్తి ప్రదర్శిస్తున్నట్టు స్పష్టం అవుతోంది.

సీఈ నివేదికలోగా జరిగిపోవాలి

ఈస్ట్‌కోస్ట్‌ క్వాలిటీ కంట్రోల్‌ సీఈ శేషుబాబు ఈ రెండు కాలువల్లో జరుగుతున్న పనులను పూర్తిగా పరిశీలించారు. గతంలో ఏ అధికారి కూడా పనుల నాణ్యతపై కాలువల్లో జరిగిన పని మొత్తాన్ని పరిశీలించిన దాఖలాలేవు. అయితే శేషుబాబు మొత్తం పరిశీలించి వెళ్లగా, దీనిపై నివేదికను ప్రభుత్వానికి అందించనున్నారు. పరిశీలన ముగిసి ఒకరోజు మాత్రమే గడవడంతో ఆ నివేదికలో ప్రతికూల అంశాలను ప్రస్తావిస్తే బిల్లుల చెల్లింపుపై ప్రభావం చూపుతుందని అధికారులు పీఏఓ కార్యాలయ అధికారులపై ఒత్తిడి తెస్తూ బిల్లులకు ఆమోదం తెలిపి మంజూరు చేయాలని కోరుతున్నట్టు తెలిసింది. నివేదిక ప్రభుత్వ పరిశీలనలోకి వెళ్లాక బిల్లులకు బ్రేక్‌ పడే అవకాశం ఉండొచ్చని అధికారులు భావిస్తున్న తరుణంలో ఒత్తిళ్లతో ఒకట్రెండోజుల్లో మొత్తం బిల్లులు మంజూరయ్యే అవకాశం ఉందని ప్రాజెక్టు అధికారులే చెబుతుండటం విశేషం.

పర్యవేక్షణ లేదనే సీఈ రాక

రెండు ఉపకాలువల లైనింగ్‌, షార్ట్‌ క్రీటింగ్‌ పనుల విషయంలో తిరుపతి క్వాలిటీ కంట్రోల్‌, మదనపల్లె ఉన్నతాధికారుల పర్యవేక్షణ నామమాత్రం కావడంవల్లే క్వాలిటీ కంట్రోల్‌ సీఈ శేషుబాబు విచారణకు వచ్చినట్టు చెబుతున్నారు. సీఈ పరిశీలనతో ఇక్కడి క్వాలిటీ కంట్రోల్‌ అధికారుల పనితీరు ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడి అధికారులు కాంట్రాక్టు సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి. ఈ పరిస్థితుల్లో జరిగే పనులపై క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు ఎలా వ్యవహరిస్తారో చూడాలి.

రూ.150 కోట్ల బిల్లులు చెల్లింపునకు సిద్ధం

పీఏఓ నుంచి నేడో రేపో మంజూరు

పీబీసీలో రూ.10 కోట్ల మేర అడ్వాన్స్‌ల చెల్లింపు?

స్వామిభక్తి చాటుకుంటున్నహంద్రీ–నీవా అధికారులు

పుంగనూరు ఉపకాలువకు సంబంధించిన పనుల విషయంలో డీఈ వెంకట ప్రతాప్‌ కాంట్రాక్టు సంస్థ పనులు చేయకనే అడ్వాన్స్‌ రూపంలో రూ.10 కోట్లకుపైగా మంజూరు చేశారని సమాచారం. ఈ అడ్వాన్స్‌, జరిగిన పని కలుపుకుని తాజాగా బిల్లులు పెట్టారని తెలిసింది. పని జరక్కనే అడ్వాన్స్‌ రూపంలో బిల్లులు ఇవ్వడం జరగదు. అయినప్పటికీ ఇచ్చారని చెబుతున్నారు. దీనిపై డీఈ వెంకట ప్రతాప్‌ వివరణ కోరగా అడ్వాన్స్‌ నిధులు మంజూరు చేయలేదని స్పష్టం చేశారు.

రూ.10 కోట్ల అడ్వాన్స్‌? 1
1/3

రూ.10 కోట్ల అడ్వాన్స్‌?

రూ.10 కోట్ల అడ్వాన్స్‌? 2
2/3

రూ.10 కోట్ల అడ్వాన్స్‌?

రూ.10 కోట్ల అడ్వాన్స్‌? 3
3/3

రూ.10 కోట్ల అడ్వాన్స్‌?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement