
మట్టిమాఫియా బరితెగింపు
రాయచోటి: జిల్లా కేంద్రం రాయచోటి నియోజకవర్గ పరిధిలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. మట్టి తవ్వకాలకు అనుమతులు లేకున్నా తెలుగు తమ్ముళ్లు పోటాపోటీగా చెరువులను చెరబడుతున్నారు. చెరువుల్లో ఎండలకు నీరు తగ్గిపోవడం అవకాశంగా తీసుకున్న తమ్ముళ్లు, వారితో కలిసి వ్యాపారం సాగిస్తున్న దళారులు ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులకు అధినేతల నుంచి ఒత్తిళ్లు, అవసరమైన మేర మామూళ్ల ఎర చూపడంతో వారు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో అడ్డూ అదుపు లేకుండా మట్టి రవాణా సాగిస్తున్నారు. ప్రభుత్వానికి రూపాయి చెల్లించకుండానే వేల రూపాయల మట్టిని మార్కెట్లో అమ్ముతూ కోట్లాది రూపాయలను ఆర్జిస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్న తమ్ముళ్లు, దళారులు అధికారులకు కాసుల వర్షం కురిపిస్తూ అక్రమదందా యథేచ్ఛగా సాగిస్తున్నారు.
● మట్టి మాఫియా రాయచోటి, చిన్నమండెం, రామాపురం, సంబేపల్లి మండలాల్లో పెట్రేగిపోతుంది. ఖాకీలను సైతం లెక్కచేయకుండా దందా సాగిస్తున్నారు. అధికారుల కనుసన్నల్లో సాగుతున్న దందా కావడంతో నిరాటంకంగా మట్టి రవాణా జరుగుతుందనే విమర్శలు వ్యక్త మవుతున్నాయి.
చెరువులను పంచుకున్న తమ్ముళ్లు
చిన్నమండెం మండలంలోని శ్రీనివాసపురం నాగిరెడ్డి రిజర్వాయర్, కేశాపురం రెడ్డివారిపల్లె గ్రామంలోని పెద్దచెరువు, రాయచోటి సమీపంలోని కంచాలమ్మ గండిచెరువు, ఇనాయత్ ఖాన్ చెరువు, సిబ్యాల చెరువు, సంబేపల్లి మండలంలోని సంబేపల్లి, దుద్యాల గ్రామాల సమీపంలోని చెరువులను టార్గెట్‌గా మట్టి మాఫియా అక్రమ మట్టి దందా సాగిస్తోంది. మట్టి తవ్వి టిప్పర్లకు ఎత్తిపోసేందుకు జేసీబీలు హిటాచీలను వాడుతున్నారు.వీటివాడకం వల్ల చెరువుల్లో భారీగా గోతులు ఏర్పడి రాబోయే రోజులలో వీటి రూపురేఖలు మారిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. చిన్నమండెం మండలంలోని రెడ్డివారిపల్లి పెద్దచెరువును ఒకసారి పరిశీలిస్తే మట్టి తరలింపుతో దీని రూపురేఖలు ఎలా ఉన్నాయో అర్థం అవుతుందని ఆయకట్టు రైతులు చెబుతున్నారు. ఈ చెరువులపై తెలుగు తమ్ముళ్లు ఒక ఏరియాలో ఒక్కొక్కరుగా కేటాయింపు చేసుకొని దందాలు సాగిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పాలకుల పర్యవేక్షణ లోపించడంతో అడిగే వారు ఎవరు అన్నట్టుగా చెరువుల్లో మట్టిని తోడేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు
ఇష్టానుసారంగా చెరువుల్లోని మట్టిని తోడేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో మట్టి మాఫియా పగలూ రాత్రి తేడా లేకుండా భారీ యంత్రాలతో చెరువు మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కొంత మంది తెలుగు తమ్ముళ్లు, దళారులు కలుసుకొని పంట పొలాలకు మట్టి అవసరం అని రైతుల పేరిట అనుమతులు తీసుకుంటూ కమర్షియల్ అవసరాలకు మార్కెట్లో విక్రయిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే మట్టి అక్రమ తవ్వకాలను నిలిపివేసి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
చెరువులే టార్గెట్‌గా అక్రమ దందా
ఇష్టారాజ్యంగా తవ్వకాలు
చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు
రైతులు తీసుకెళ్తే ఫైన్
అధికారపార్టీ నాయకులు, అధికారుల అనుమతి లేకుండా చెరువుల్లో మట్టి తరలించిన రైతులపై చర్యలు తప్పడం లేదు. వారిపై పోలీసు కేసులు, రెవెన్యూ అధికారుల దాడులు తప్పడం లేదు. తమ పొలాలకు మాత్రమే అని చెప్పినా వినకుండా రైతులపై అపరాధ రుసుములతో వేధింపులకు గురిచేస్తున్నారు. అధికారుల కళ్లెదుటే అధికార పార్టీ నాయకుల టిప్పర్లు రయ్ రయ్ రయ్‌మంటూ పరుగులు తీస్తున్నా పట్టించుకున్న పాపానపోలేదు.

మట్టిమాఫియా బరితెగింపు