
ఎవరికీ చెప్పుకోలేఖ!
● చదువుకోలేక పోతున్నందుకు చావే శరణ్యమంటూ నిర్ణయం
● ఫీజు విషయమై కాలేజీ యాజమాన్యం అవమానించారని ఆవేదన
● లేఖ రాసి ఇంటినుంచి అదృశ్యమైన ఫార్మసీ విద్యార్థిని
● పోలీసులను ఆశ్రయించిన తల్లిదండ్రులు
● తిరుపతిలో దొరికిన ఆచూకీ
మదనపల్లె: ‘అమ్మా..నాన్నలకు.. నేను ఈ ఒత్తిడి చదువు చదవలేకపోతున్నా, మీకు చాలాసార్లు ఈ విషయం చెప్పాను. అయినా నావల్ల కావడం లేదు. నేను సున్నితం అని మీకు తెలుసు కద నాన్నా.. అందుకే చచ్చిపోవాలని నిర్ణయం తీసుకున్నా..’ అంటూ మదనపల్లె రూరల్ మండలం సీటీఎం గ్రామంలోని ఓ ప్రైవేటు కళాశాలలో మూడో ఏడాది ఫార్మసీ కోర్సు చదువుతున్న విద్యార్థిని శ్వేతశ్రీ చంద్ర (21) రెండు పేజీల లేఖ రాసి శుక్రవారం ఇంటినుంచి అదృశ్యమైన ఉదంతం సంచలనం కలిగిస్తోంది. లేఖలో ఫీజు విషయంగా ప్రస్తావించి అవమానపడినట్టు ఆవేదనకు గురైంది. విద్యార్థిని విషయంలో కళాశాల యాజమాన్యం కఠినంగా వ్యవహరించడం ప్రధాన కారణమా అన్న చర్చ సాగుతోంది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబీకులు మదనపల్లె రూరల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి వివరాలు..
● పెద్దతిప్పసముద్రం మండలం పట్టెంవాండ్లపల్లెకు చెందిన సూర్యనారాయణ కుటుంబం కుమార్తె శ్వేతశ్రీచంద్ర చదువుకోసం సీటీఎం నేతాజీ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఇక్కడి ప్రైవేటు ఫార్మసీ కళాశాలలో చదివిస్తున్నారు. అయితే చదువు విషయంలో తనకు ఇబ్బందులున్నాయని లేఖ ద్వారా తల్లిదండ్రులకు చెప్పుకున్నా వెలుగులోకి రాని కారణాలేమైనా ఉన్నాయా అన్న కోణంలో విచారణ సాగాల్సి ఉంది. తల్లిదండ్రులపేరుతో విద్యార్థిని శ్వేతశ్రీచంద్రరాసిన లేఖలో ‘అమ్మా..నాన్నలకు.. నన్ను ఇక్కడ చదివించాలని అనుకుంటున్నారు. కాని నేను చదవలేను. నాకు ఈ ఒత్తిడి భరించడం, బాధపడటం నా వల్ల కావడం లేదు. ఈ కళాశాలలో నేను చదవలేను. మీరు ఎన్ని చెప్పినా వినను. నేను మానసికంగా చాలా ఒత్తిడి భరిస్తున్నాను. ఇంకా చెప్పాలంటే నా మెంటల్ కండిషన్ ఏమీ బాగలేదు. నాకు చచ్చిపోవడం తప్ప వేరే మార్గం దొరకడం లేదు. నేను చెప్పి చెప్పి అలసిపోయాను. అందుకే చచ్చిపోవాలని డిసైడ్ అయిపోయా. ఇక్కడ చదువుతూ అవమానపడటం నావల్ల కాదు. నాకు మీతో చెప్పే ధైర్యం లేదు. బతకడానికి ధైర్యం సరిపోవడం లేదు. అందుకే దూరంగా వెళ్లి చచ్చిపోతున్నా. నేను సున్నితం అని తెలుసు కదా, అందుకే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. ప్రతిసారీ ఈ కాలేజీలో వాళ్లు ఫీజు కోసం అవమానపర్చడం, నేను ఫీజు కట్టకుండా అవమానంగా ఒకదాన్నే తలదించుకుని ఉండటం నావల్లకాదు డాడీ. మళ్లీ మళ్లీ మీకు చెప్పి ఇబ్బంది పెట్టలేను. అందుకే నేను చచ్చిపోవాలని ఫిక్స్ అయిపోయా డాడీ. అయామ్ వేరీ’ అంటూ చాలా విషయాలను రాసింది. ఈ రెండు పేజీల లేఖలో ఒకచోట ఈనెల రెండో తేదీన రాసినట్టు తేది, సంతకం చేసింది. తర్వాత అదేపేజిలో రాసిన విషయాల కింద మూడో తేదీ వేసింది. ఇంకో పేజీలో ఐయామ్ సారీ, గుడ్‌బై అంటూ పలుచోట్ల రాసింది. అంటే ఈ లేఖను రెండు రోజుల్లో రాసినట్టుంది.
ఫిర్యాదుపై కేసు నమోదు
ఇంటినుంచి అదృశ్యమైన కుమార్తె శ్వేతశ్రీచంద్ర లేఖ చూడగానే తల్లిదండ్రులు, బందువులు మదనపల్లె తాలూకా పోలీస్‌స్టేషన్ చేరుకుని పోలీసుల దృష్టికి తీసుకెళ్లి శనివారం ఫిర్యాదు చేశారు. తండ్రి సి.సూర్యనారాయణ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ గాయత్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మహతి ఫార్మసీ కళాశాలలో చదువుతున్న శ్వేతశ్రీచంద్ర శుక్రవారం ఉదయం కళాశాలకు బయలుదేరగా తర్వాత అదృశ్యమైంది. తర్వాత పలుచోట్ల ఆచూకీ కోసం వెతికినా కనిపించకపోవడంతో శనివారం తమకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టినట్టు చెప్పారు. శ్వేతశ్రీచంద్ర శుక్రవారం ఉదయం 11.30–12 గంటల మధ్య ఇంటినుంచి వెళ్లినట్టు గుర్తించామని, ప్రస్తుతం ఎక్కడుందో కనిపెట్టేందుకు సాంకేతిక సహకారంతో చర్యలు చేపట్టినట్టు చెప్పారు.
● శ్వేతశ్రీచంద్ర తిరుపతిలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది.దీంతో పోలీసులు తిరుపతికి బయలుదేరి వెళ్లారు.
నిన్ను వదిలి ఉండలేం తల్లీ వచ్చేయి
కన్నీటిపర్యంతమైన శ్వేతశ్రీ తల్లిదండ్రులు
తమబిడ్డ ఫీజు కట్టలేదని కళాశాలలో ఫోటో తీసి కళాశాల యాజమాన్యం అవమానించిందని విద్యార్థి శ్వేతశ్రీ చంద్ర (21) తల్లిదండ్రులు సూర్యనారాయణ, సుజాత కన్నీటిపర్యంతమయ్యారు. శ్వేతశ్రీ అదృశ్యంపై ఫిర్యాదు చేశాక శనివారం సాయంత్రం వారు మీడియాతో మాట్లాడుతూ ఆవేదన చెందారు. తమబిడ్డ మహాతి ఫార్మసీ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతోందని చెప్పారు. మొదటి, రెండో సంవత్సర ఫీజులు చెల్లించామని, మూడో ఏడాదికి చెందిన ఫీజులో కొంత మొత్తం గత శనివారం కట్టాం, మిగిలింది ఈ శనివారం చెల్లించేందుకు సిద్దమైనట్టు చెప్పారు. ఈ విషయమై కళాశాలకు వెళ్లి తమబిడ్డను చదువుకోనివ్వాలని వేడుకోగా ప్రిన్సిపాల్ బాబు అవమానకరంగా మాట్లాడారని అన్నారు. తర్వాత కళాశాలకు వెళ్లిన శ్వేతశ్రీ చంద్రను ఫీజు కట్టలేదని ఫోటో తీసి అవమానించారని విలపించారు. నా బిడ్డను కాపాడండి ఆమె లేకుండా ఉండలేం.. ఆమె డాడి అసలే బతకలేడు అంటూ సుజాత విలపించింది. కాగా కళాశాలలో శ్వేతశ్రీని ఎవరూ అవమానించలేదని, రెండు సంవత్సరాల ఫీజు పెండింగ్‌లో ఉందని, ఇంకా కట్టలేదని మహాతి కళాశాల కరెస్పాండెంట్ అమరనాథరెడ్డి చెప్పారు.

ఎవరికీ చెప్పుకోలేఖ!

ఎవరికీ చెప్పుకోలేఖ!