
ఆర్టీసీలో పదివేల ఉద్యోగాలు ఖాళీ
రాయచోటి టౌన్ : ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులకు వెంటనే అనుమతులు ఇవ్వాలని ఏపీ పీటీడీ(ఎంప్లాయీస్ యూనియన్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ.నరసయ్య డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఎంప్లాయీస్ నాయకులతో కలిసి నల్లబ్యాడ్జీలు ధరించి శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 30 రకాల డిమాండ్లతో జులై 4, 5వ తేదీలలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావడంతోపాటు టీ/ భోజన విరామ సమయంలో ధర్నా, గేట్ మీటింగ్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2020లో గత ప్రభుత్వ విలీనం చేసిన తరువాత వివిధ కారణాలతో ఆరేళ్లుగా పదోన్నతులు లేకుండా పదవీ విరమణ చేశారని చెప్పారు. 3000 మందికి సంబంధించిన ఫైల్ ప్రస్తుతం అన్ని అనుమతులు పొంది ముఖ్యమంత్రి ఆదేశాల కోసం పెండింగ్‌లో ఉందన్నారు. 11వ పీఆర్‌సీ, పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీలో రిటైడ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యూటీ చెల్లించలేదన్నారు. హెల్త్‌కార్డుల ద్వారా సరైన వైద్య సౌకర్యాలు అందపోవడంతో ఏటా 350 మంది చనిపోతున్నారని అన్నారు. డబుల్ డ్యూటీ చేస్తున్న సిబ్బందికి ప్రస్తుతం ఇస్తున్న దానికంటే వేతనం పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్‌పీ.బాబు, జిల్లా గౌరవాధ్యక్షుడు పి.నాగభూషణంరెడ్డి, జిల్లా అధ్యక్షుడు సి.ఆనందబాబు, జిల్లా కోశాధికారి కొండా ఈశ్వర్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు పి.శరత్‌బాబు, రాయచోటి డిపో అధ్యక్షుడు ఎస్‌ఏ.సమద్, కార్యదర్శి జిఎం.రెడ్డి, గ్యారేజీ కార్యదర్శి మనోజ్ పాల్గొన్నారు.