
బాబూ.. ఇదేం సుపరిపాలన
సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
కడప సెవెన్‌రోడ్స్: ఎన్నికల సమయంలో ప్రజలకు అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వాటిని అమలు చేయకుండా, తగుదునమ్మా అంటూ ‘సుపరిపాలనకు తొలి అడుగు–ఇంటింటికి మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని చేపట్టడం సిగ్గుచేటని వైఎస్సార్ సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ కడప జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి అధ్యక్షతన గురువారం కడపలో జరిగిన ఆ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి పెద్దిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పోలీసు భద్రత లేకుండా వెళితే సుపరిపాలన గురించి ప్రజలే చెబుతారన్నారు. చంద్రబాబు మోసాలను గ్రామగ్రామాన ఎండగడతామని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం గడిచిపోయినా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాక కిలో రూ. 2 బియ్యాన్ని రూ. 5.25కు, పెంచారని, మద్యనిషేధం ఎత్తేశారని, విద్యుత్ చార్జీలు ఐదుసార్లు పెంచారని వివరించారు. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు సైతం నెరవేర్చలేదన్నారు. గత ఎన్నికల్లో బాబు మోసపూరిత మాటలు నమ్మి ప్రజలు అధికారం కట్టబెట్టగా హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసగించారని ఆరోపించారు. సంపద సృష్టిస్తానని చెప్పి విపరీతంగా అప్పులు చేస్తున్నారని, అయినా సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. సాంకేతిక కారణాల పేరిట తల్లికి వందనం పథకంలో భారీగా కోతలు విధిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 50 ఏళ్లకు పైబడిన ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు 69 లక్షల మంది ఉండగా, ఎంతమంది మహిళలకు నెలకు రూ. 1500 ఇచ్చారంటూ నిలదీశారు. కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా త్రికరణ శుద్ధితో సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేకున్నా కరోనా సమయంలో సైతం జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామిలన్నీ నెరవేర్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రజలను మభ్య పెట్టేందుకు చంద్రబాబు పీ4 అంటున్నారని విమర్శించారు.
బాబు, రేవంత్‌వి డైవర్షన్ పాలిటిక్స్
పోలవరం–బనకచర్ల విషయంలో గురు శిష్యులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఈ సందర్భంగా అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానంగా అన్నారు. ప్రజల్లో తమ పాలన పట్ల ఉన్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు బనకచర్ల అంశాన్ని ఇరువురు వాడుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు బనకచర్ల ప్రాజెక్టు పూర్తి చేయాలన్న ఆలోచనే లేదన్నారు. 2014లో గోదావరి జలాలను పెన్నాకు తరలించే బృహత్తర కార్యక్రమాన్ని చేపడతామని హామీ ఇచ్చి మోసగించడమే ఇందుకు నిదర్శనమన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే చిత్తశుద్ధి ఉందన్నారు.
ఎన్నికల హామీలు తుంగలో
అప్పులు తేవడం తప్ప సంక్షేమం లేదు
బనకచర్లపై బాబు, రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్
వైఎస్సార్ సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి