
పారిశుధ్య పనులపై దృష్టి సారించాలి: కలెక్టర్
సంబేపల్లె: మండల పరిధిలోని నారాయణరెడ్డిపల్లె పంచాయతీలో గురువారం జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాల్లో పారిశుధ్య పనులపై దృష్టి సారించాలని పంచాయతీ అధికారులు, పారిశుధ్య సిబ్బందికి సూచించారు. నారాయణరెడ్డిపల్లె గ్రామంలో ఎన్ని నివాసాలు ఉన్నాయి, రోజుకు ఎంత చెత్త వస్తుంది అనే విషయంపై ఆరాతీశారు.అనంతరం పొన్నేళ్ళవాండ్లపల్లెలో ప్రజలతో కలెక్టర్ ముఖా ముఖి నిర్వహించారు. చెత్త సేకరణకార్యక్రమం సక్రమంగా జరుగుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీపీఓ రాధమ్మ, ఎంపీడీఓ రామచంద్ర ,పంచాయతీ కార్యదర్శి రవీంద్ర తదితరలు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ కార్డు రోగులకు
ఉచిత వైద్యం అందివ్వాలి
రాయచోటి: ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ కార్డు ఉన్న రోగుల దగ్గర నుంచి ఆసుపత్రుల యాజమాన్యం ఎటువంటి నగదు తీసుకోకుండా ఉచిత వైద్యం అందివ్వాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ ఆదేశించారు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ప్రొటోకాల్‌ను ట్రస్టుతో ఎంప్యానల్ అయిన ఆసుపత్రులన్నీ పక్కాగా పాటించాలని కలెక్టర్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో కలెక్టర్ అధ్యక్షతన ఆరోగ్యశ్రీ క్రమశిక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఆరోగ్యశ్రీ సమన్వయకర్త లోకవర్ధన్ జిల్లాలోని వివిధ ఆసుపత్రుల యాజమాన్యం పైన వచ్చిన ఫిర్యాదులను జిల్లా కలెక్టర్‌కు వివరించారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా అమరావతి హాస్పిటల్స్ యాజమాన్యం రూ.2500 తీసుకున్నారని, బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో రూ.16 వేలు, దేశాయ్ హాస్పిటల్స్‌లో తీసుకున్న నగదు తదితర అంశాలను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టుతో ఎంప్యానల్ అయిన ఆసుపత్రులన్నీ ఈ పథకాన్ని పక్కాగా అమలు చేయాలన్నారు. ఈ పథకంలో ఆసుపత్రుల యాజమాన్యం రక్తపరీక్ష, సీటీ స్కాన్ తదితర సేవలకు ఎటువంటి నగదును తీసుకోరాదన్నారు. కీళ్ల సమస్యల గురించి వచ్చే వారిని తప్పుదారి పట్టించరాదన్నారు. రోగులను మానవతా దృక్పథంతో చూడాలన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో జిల్లాలోని వివిధ రోగుల దగ్గర నుంచి అందిన ఫిర్యాదుపలై సమీక్షిస్తూ ఆసుపత్రుల యాజమాన్యం తీసుకున్న నగదును తిరిగి రోగులకు ఇచ్చేశారా లేదా అని అడగ్గా ఇచ్చేశామని సమాధానం ఇచ్చారు. అనంతరం ఆసుపత్రుల యాజమాన్యం తీసుకున్న నగదులో 50 శాతం జరిమానా వేస్తూ ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, జిల్లా ఆరోగ్యశ్రీ సమన్వయకర్త లోకవర్ధన్, జిల్లాలోని వివిధ ఆసుపత్రుల నిర్వాహకులు, ఫిర్యాదుదారులు తదితరులు పాల్గొన్నారు.
విజన్ ప్రణాళికల రూపకల్పనకు కృషి చేయాలి
జిల్లా, నియోజకవర్గ విజన్ ప్రణాళికల రూపకల్పనకు కమిటీలతో పటిష్టమైన సమావేశాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం విజయవాడ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో పలు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.వీసీలో కలెక్టర్ శ్రీధర్, జేసీ ఆదర్శ రాజేంద్రన్, డీఆర్‌ఓ మధుసూదన్‌రావు పాల్గొన్నారు.