
వాటర్ ట్యాంకుపైకి ఎక్కి నిరసన
మదనపల్లె : స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలోని రక్షిత మంచినీటి పథకం ట్యాంకుపైకి ఎక్కిన మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ఆదివారం నిరసన తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను తీర్చాలంటూ కార్మికులు 26 రోజులుగా దీక్షలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో కార్మికులు ట్యాంకుపైకి వెళ్లి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డెప్ప, గోపాలకృష్ణ, సజాద్, నాగరాజు, బాబు, కన్నయ్య, రాజేశ్వరి పాల్గొన్నారు.
మొహర్రం ఉత్సవాలు ప్రారంభం
చిన్నమండెం : మొహర్రం ఉత్సవాలలో జిల్లాలోనే ప్రసిద్ధి గాంచిన చిన్నమండెం పీర్లమకాన్‌లో ఆదివారం పీర్లను నిర్వాహకులు కొలువుదీర్చారు. ఈ సందర్భంగా పలు పూజాదిక్రతువులను నిర్వహించారు. జులై 5న పీర్ల పండుగ మహోత్సవంలో భాగంగా గంధపు పీరుకు పలు కార్యక్రమాలను నిర్వహించనుండగా కడప పెద్ద దర్గా పీఠాధిపతి హజరత్ ఖ్వాజా సయ్యద్ షా ఆరీఫుల్లా హుస్సేని పాల్గొననున్నారు.
108 వాహనంలో ప్రసవం
ఒంటిమిట్ట : పురిటి నొప్పులతో బాధ పడుతున్న మహిళ శనివారం అర్థరాత్రి 108 వాహనంలోనే ప్రసవించింది. అంబులెన్స్ టెక్నీషియన్ నాగబాబు వివరాల మేరకు ఒంటిమిట్ట మండలం మంటపంపల్లి పంచాయతీ మారయ్య గారి పల్లెకు చెందిన జరీనా తన మూడవ కాన్పుకు పురిటి నొప్పులు మొదలు కావడంతో స్థానిక పీహెచ్‌సీకి ఓ ప్రైవేటు వాహనంలో వచ్చారు. అక్కడ ఉన్న స్టాఫ్‌నర్స్ కడప రిమ్స్‌కు తీసుకెళ్లాలని రెఫర్ చేయడంతో అక్కడి నుంచి జరీనాను 108 వాహనంలో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కానీ మార్గమధ్యంలో భాకరాపేట గ్రామ సమీపంలో జరీనాకు ప్రసవం నొప్పులు ఎక్కువ కావడంతో 108 అంబులెన్స్‌లో ఉన్న టెక్నీషియన్ నాగబాబు డెలివరీ చేశారు. జరీనా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. 108 వాహనం పైలెట్ భాస్కర్ కూడా సహకరించారు.

వాటర్ ట్యాంకుపైకి ఎక్కి నిరసన

వాటర్ ట్యాంకుపైకి ఎక్కి నిరసన