
బి.కొత్తకోటలో తమ్ముళ్ల రచ్చ!
బి.కొత్తకోట : టీడీపీ వర్గపోరు మరోసారి భగ్గుమంది. ఆదివారం స్థానిక షాదీమహల్‌లో బి.కొత్తకోట పట్టణ టీడీపీ కమిటీ ఎన్నిక కోసం పార్టీ శ్రేణులు సమావేశమయ్యారు. పోటీలో ఉండాలనుకున్న నాయకుల పేర్లను సిద్ధం చేసుకుంటున్న స్థానిక నాయకులను కొందరు మా పేర్లు రాసుకోండి అంటూ డిమాండ్ చేశారు. దీంతో మొదలైన గొడవ తోపులాటకు దారితీసింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డి వ్యతిరేక వర్గీయులు కమిటీ ఎంపిక ప్రక్రియలో పాల్గొన్నారు. పట్టణంలోని సీనియర్లు, పదవులను కోరుతున్న నాయకులతో అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఇంతలో కొండ్రెడ్డి వర్గంతోపాటు జయచంద్రారెడ్డి వర్గీయులు సమావేశానికి హాజరయ్యారు. పార్టీలో ఉంటున్న సీనియర్లు, కష్టపడిన వారికి కమిటీల్లో చోటు కల్పించాలని జయచంద్రారెడ్డి వర్గ నాయకులు డిమాండ్ చేశారు. దీనికి అందరూ బరిలో నిలబడవచ్చని వ్యతిరేక వర్గం సూచించింది. దీంతో ఒకరిపై ఒకరు ఆగ్రహావేశాలు వ్యక్తం చేసుకొంటూ తోసుకున్నారు. కుర్చీలతో కొట్టుకునేందుకు సిద్ధమయ్యారు. సవాళ్లు విసురుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఏఎస్‌ఐ భాస్కర్‌నాయక్, పోలీసులు షాదీమహల్ చేరుకున్నారు. వివాదం వద్దంటూ పోలీసులు వారించారు. ఈ వివాదంతో కమిటీ ఎన్నిక జరగకుండానే సమావేశం ముగిసింది.
టీడీపీ పట్టణ కమిటీ ఎన్నికలో ఉద్రిక్తత