
జిల్లా అభివృద్ధికి రూ.10వేల కోట్లు ఇవ్వాలి
మదనపల్లె : అన్నమయ్య జిల్లా సమగ్రాభివృద్దికి ప్రభుత్వం రూ.10వేల కోట్ల నిధులు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జి.ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ఎస్టీయూ కార్యాలయంలో మదనపల్లెలో నిర్వహించే జిల్లా రెండవ మహాసభలపై నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగు, తాగునీటి సమస్యలు, ప్రాజెక్టుల పూర్తిపై దృష్టి పెట్టని ప్రభుత్వం రాందేవ్ బాబాకు హార్సిలీహిల్స్‌ను కట్టబెట్టేందుకు ఎందుకంత తొందరని ప్రశ్నించారు. బాబాకు హార్సిలీహిల్స్‌పై అడుగు స్థలం ఇచ్చినా ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కడప–బెంగళూరు రైల్వేమార్గం పనులు పూర్తి చేయించాలని కోరారు. బీటీ కళాశాలను విశ్వవిద్యాలయం చేయాలన్నారు. యోగా ప్రచారం కోసం రూ.300 కోట్లు ఖర్చుపెట్టిన ప్రభుత్వానికి సమస్యలు పట్టకపోయినా మదనపల్లెకు విమానాశ్రయం కట్టిస్తానని ప్రకటించడం హస్యాస్పదమని అన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే మదనపల్లె ప్రాంత రైతాంగ సమస్యలను పరిష్కరించాలన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి నరసింహులు, మహేష్, కృష్ణప్ప, సాంబశివ, మనోహర్‌రెడ్డి, సుమిత్రమ్మ, మురళి, చిన్నయ్య, శీను పాల్గొన్నారు.