నిబంధనలు గాలికి.. | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు గాలికి..

Jun 30 2025 4:08 AM | Updated on Jun 30 2025 4:08 AM

నిబంధనలు గాలికి..

నిబంధనలు గాలికి..

కడప అగ్రికల్చర్‌: కడప కలెక్టరేట్‌ ఆవరణలోని ఉద్యాన, వ్యవసాయశాఖ కార్యాలయంలో రెండోరోజు ఉమ్మడి కడపజిల్లా సచివాలయ ఉద్యాన, వ్యవసాయ సహాయకులు బదిలీ కౌన్సెలింగ్‌ కొనసాగింది. రెండోరోజు కూడా అధికారులు ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కారు. ఎమ్మెల్యేల సిఫార్సులకే ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిసింది. కూటమి నేతలు ఇచ్చిన లెటర్లతోపాటు వారి ఫోన్లకే ప్రాధాన్యత కల్పించినట్లు పలువురు ఉద్యోగులు ఆరోపించారు. కూటమి నేతలు చెప్పిన వాళ్లకే మంచి స్థానాలను కేటాయించారని చర్చించుకున్నారు. వ్యవసాయ సహాయకులకు సంబంధించి 94 మందికి ఆదివారం కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఇందులో కూడా స్పౌజ్‌, మెడికల్‌ కేసులను ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదని వాపోయారు. ప్రభుత్వ నిబంధనలను పరిగణలోకి తీసుకోకుండా తమకు అన్యాయం చేశారని పలువురు బాధితులు ఆవేదనను వ్యక్తం చేశారు. ఒక డిజేబుల్‌ అమ్మాయిని లక్కిరెడ్డిపల్లె నుంచి రాజుపాలెం మండలానికి బదిలీ చేసినట్లు, మరో మెడికల్‌ గ్రౌండ్‌ ఉన్న అబ్బాయిని పెద్దముడియం నుంచి వీఎన్‌పల్లెకు బదిలీ చేసినట్లు తెలిసింది. ఈ విషయంలో తమకు అన్యాయం జరిగిందని మెరపెట్టుకున్నా అధికారులు పెడచెవిన పెట్టారని తెలిసింది. అలా ఒకరిద్దరికి కాకుండా చాలా మందికి అన్యాయం జరిగినట్లు తెలిసింది. కౌన్సెలింగ్‌కు వచ్చిన అభ్యర్థులను ర్యాంకుల వారీగా పిలిపించి వారికి వచ్చిన స్థానాలను కేటాయించారు. అయితే ఈ స్థానాలను తరువాత ఇచ్చే అర్డర్‌లో కనపరుస్తారా లేక అధికార పార్టీ నేతలు చెప్పిన వాళ్లకు కట్టుబెడతారా అనే ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బదిలీల్లో అన్యాయం జరిగిన వ్యవసాయ సహాయకులంతా ధర్నాకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. రెండవ రోజు కూడా సరైన వసతులు లేక వ్యవసాయ సహాయకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే ఉద్యానశాఖ సహాయకులకు సంబంధించి రెండోరోజు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఉద్యాన, వ్యవసాయ సహాయలకు బదిలీలకు సంబంధించి డీఏఓ చంద్రనాయక్‌ డీహెచ్‌ఓ రవిచంద్రబాబులు మాట్లాడుతూ రెండో రోజు బదిలీల కౌన్సిలింగ్‌ను కూడా సిఫారస్సులకు తావు లేకుండా నిర్వహించామని తెలిపారు.

● రైతు సేవా కేంద్రాలకు వచ్చిన ఎరువులును విక్రయించగా వచ్చిన డబ్బులను ప్రభుత్వానికి చెల్లించకుండా గతంలో కొందరు వ్యవసాయ సహాయకులు సొంతానికి వాడుకున్నారు. ప్రస్తుత బదిలీల్లో డబ్బులు వాడుకున్న వారికి ఈ వ్యవహారం గుదిబండగా మారింది. బకాయి డబ్బులను చెల్లిస్తేనే బదిలీకి అనుమతి ఇస్తామని, లేకుంటే లేదని అధికారులు వారికి సూచించినట్లు తెలిసింది. దీంతో బకాయిలు ఉన్న కొంతమంది డబ్బులు చెల్లించగా అధిక మొత్తంలో బకాయిలు ఉన్న వారు మాత్రం చెల్లించలేకపోయినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో అధికారులు వారితో ఒప్పందం తీసుకుని బదిలీలో చోటు కల్పించినట్లు తెలిసింది.

రెండోరోజు మెడికల్‌ గ్రౌండ్‌, స్పౌజ్‌ కేసులకు అన్యాయం

అధికారి పార్టీ నేతల సిఫార్సులకే పెద్దపీట

అన్యాయం జరిగిందని ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement