
లేబర్ కోడ్లు రద్దు కోరుతూ జులై 9న దేశవ్యాప్త సమ్మె
రాయచోటి : కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం తీసుకువచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.ఓబులు డిమాండ్ చేశారు. ఇందుకోసం జులై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. శనివారం రాయచోటిలోని సీఐటీయూ కార్యాలయంలో కౌలు రైతు సంఘం నాయకులు రమేష్‌బాబు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎస్.రామచంద్ర, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ చంద్రశేఖర్‌ల అధ్యక్షతన జరిగిన జిల్లా విస్తృత స్థాయి సదస్సులో ఆయన మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మెప్పు కోసమే ప్రధాని మోడీ కార్మికవర్గం మీద భారాలు వేస్తూ లేబర్ కోడ్లను తెచ్చారన్నారు. విశాఖ ఉక్కు లాంటి సంస్థలో కార్మికులను తొలగించి ప్రైవేటీకరణ చేయడానికి పూనుకుంటే రాష్ట్రంలో టీడీపీ, జనసేన పార్టీలు నోరు మెదపకపోవడం దారుణమన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.శ్రీనివాసులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న విజన్ 2047 బూటకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ ఆఫీస్ బేరర్స్ రవికుమార్, భాగ్యలక్ష్మీ, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.