
గొడవ పడొద్దన్నందుకు కత్తితో దాడి
మదనపల్లె రూరల్ : తోడికోడళ్ల మధ్య సమస్య ఏర్పడి గొడవ జరిగితే, పుట్టింటి వారు వచ్చి గొడవ ఎందుకని ప్రశ్నిస్తే కత్తితో దాడి చేసిన ఘటన గురువారం మదనపల్లెలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు.. సత్యసాయి జిల్లా కదిరి పట్టణం రాజీవ్ నగర్‌కు చెందిన అమృత ను, మదనపల్లె పట్టణం కుమారపురంలో ఉన్న మున్సిపల్ ఉద్యోగి శ్రీనివాసులుకు ఇచ్చి 15 సంవత్సరాల క్రితం వివాహం చేశారు. శ్రీనివాసులు తన ఇద్దరు అన్నదమ్ములైన శంకర, గోవిందుతో కలిసి ఒకే కాంపౌండ్‌లో వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. గురువారం ఉదయం శ్రీనివాసులు ఇంటి వద్ద లేని సమయంలో అమృతకు తోడికోడళ్లయిన మంగమ్మ, అనసూయమ్మతో వివాదం ఏర్పడి, ఘర్షణ చోటు చేసుకోగా, వారందరు కుటుంబ సభ్యులతో కలిసి అమృతపై దాడి చేసి కొట్టారు. ఈ విషయం ఆమె పుట్టింటి వారికి చెప్పడంతో, వారు పది మందితో కలిసి కుమారపురానికి వచ్చారు. గొడవెందుకని మాట్లాడే ప్రయత్నం చేస్తుండగానే, అనసూయమ్మ కుమార్తె భారతి ఇంట్లో ఉన్న సత్తూర్ ( కత్తి)తో అమృత ఆడపడుచు అయిన శివకుమార్ భార్య సురేఖ (30)పై దాడి చేసింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. మిగతా వారైనా శంకర, గోవిందు, భువనేశ్వరి, మంగమ్మ అనసూయమ్మలు కదిరి నుంచి వచ్చిన అమృత బంధువులపై దాడి చేశారు. దాడిలో కళ్యాణ్ కుమార్ (30), రాజ్యలక్ష్మి(27) గాయపడ్డారు. స్థానికులు బాధితులను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై వన్ టౌన్ పోలీసులు విచారణ చేస్తున్నారు.