
భవనం మీద నుంచి కింద పడి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మృతి
కడప కోటిరెడ్డి సర్కిల్ : అన్నమయ్య జిల్లాలోని పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో ఏ ఆర్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రాయపాటి ఖాజావలీ (50) ప్రమాదవశాత్తు భవనం మీద నుంచి కిందపడి మృతి చెందినట్లు చిన్నచౌక్ ఎస్‌ఐ రాజరాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆయన వివరాల మేరకు గురువారం సాయంత్రం కడప అశోక్ నగర్ లోని తమ ఇంటి సిమెంటు రేకులపై వర్షం నీళ్లు పడకుండా ప్లాస్టిక్ పట్ట కప్పేందుకు తన భార్యతో కలిసి పైకి ఎక్కారు. ఇద్దరూ పట్ట కప్పుతుండగా ఖాజావలీ నిలుచున్న ప్రదేశంలో ప్రమాదవశాత్తు సిమెంటు రేకులు విరగడంతో పైనుంచి కింద పడ్డాడు. తల వెనుక భాగంలో రక్త గాయమై ముక్కు నుంచి రక్తం కారుతూ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే అతని భార్య బంధువులతో కలిసి నగరంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతను మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఇతనికి భార్య మాబున్నీ, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.