
డ్రగ్స్ మహమ్మారి అణుబాంబు కంటే ప్రమాదకరం
డ్రగ్స్‌రహిత జిల్లాగా
మారుద్దాం: కలెక్టర్
కలెక్టర్ చామకూరి శ్రీధర్ మాట్లాడుతూ డ్రగ్స్‌రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని అన్నారు. మాదక ద్రవ్యాలను ఉపయోగించడం వల్ల సమాజానికి, మనకు, మన భవిష్యత్తు తరాల వారికి ఎంత ప్రమాదకరమో తెలియజేసేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. జిల్లాలోని వివిధ శాఖలు, విద్యాసంస్థలు మాదక ద్రవ్యాల వ్యతిరేక ర్యాలీలో పెద్దఎత్తున పాల్గొన్నట్లు చెప్పారు. మదనపల్లిలో ఆరువేల మందితో, రాజంపేటలో రెండువేల మందితో, ఇలా ప్రతి మండలాలలో 500 మందితో మాదక ద్రవ్యాల వ్యతిరేక ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
రాయచోటి: డ్రగ్స్ మహమ్మారి అణుబాంబు కంటే ప్రమాదకరమని, దాని నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా, అంతర్జాతీయ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం మంత్రి రాంప్రసాద్ రెఢ్డి, జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్, ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు తదితరులు రాయచోటి పట్టణం శివాలయం సర్కిల్ నుంచి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ డ్రగ్స్ మహమ్మారి భారతదేశమే కాదు యావత్ ప్రపంచాన్ని వణికిస్తోందన్నారు. దీనిని మొక్కగా ఉన్నప్పుడే తుంచివేసే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
● జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ సమాజంలో విద్యార్థులు, యువత మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా చేయడం ద్వారా కేసులు పడి తద్వారా ఉద్యోగాలకు అర్హత సాధించక వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.మాదక ద్రవ్యాలు వినియోగించినా, అమ్మినా, నిల్వ ఉంచినా, రవాణా చేసినా నేరంగా పరిగణిస్తారన్నారు. దీనికి ఏడు సంవత్సరాలు జైలుశిక్ష విధించే అవకాశం ఉంటుందన్నారు. అలాగే ఎవరైనా వినియోగించి చనిపోయినా అమ్మినవారిపై కఠినమైన చర్యలు తీసుకుంటమని తెలిపారు. అనంతరం జిల్లా ఎస్పీ మాదక ద్రవ్యాల దుర్వినియోగ నివారణపై అందరిచేత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో రాయచోటి ఆర్డీ, డీఈఓ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి