
సంక్షేమ పథకాలు వర్తింపచేయాలి
రాయచోటి: అంగన్వాడీలందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాయచోటిలోని కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్ వాడీ ఉద్యోగులు పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు.ధర్నా అనంతరం కలెక్టరేట్ డీఆర్‌ఓ మధుసూదన్ రావుకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం జిల్లా అధ్యక్షురాలు శ్రీలక్ష్మీ, కార్యదర్శి రాజేశ్వరీ, వర్కింగ్ ప్రెసిడెంట్ భాగ్యలక్ష్మీలు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం దాటినా అంగన్‌వాడీల జీవితాల్లో మార్పు రాలేదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేయడం తగదన్నారు. ముఖ్యంగా సమ్మె కాలపు హామీలు అమలు చేయలేదన్నారు. తక్కువ వేతనంతో జీవనం సాగిస్తున్న వర్కర్లకు సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం దారుణమన్నారు. ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్ రద్దు చేసి పనిభారం తగ్గించాలని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
హామీలు తప్ప అమలు లేదు..
ఎన్నికల సమయంలో అంగన్‌వాడీ వర్కర్లకు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజన్–2047 పేరుతో ఆంధ్ర ప్రదేశ్‌ను స్వర్ణాంధ్ర ప్రదేశ్‌గా మారుస్తానని చెబుతున్న మాటలు బూటకంగా మారాయన్నారు. అంగన్ వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు.లక్కిరెడ్డిపల్లి డివిజన్ పరిధిలో సిబ్బందికి జీతాలు రాలేదన్నారు.సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ రామాంజులు మాట్లాడుతూ గ్రాట్యుటీ అమలు,కనీస వేతనం రూ. 26 వేల కోసం జూలై 9న జరిగే దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం డీఆర్‌ఓ సమక్షంలో పీడితో జరిగిన సమీక్షా సమావేశంలో అంగన్ వాడీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సుకుమారి, మధురవాణి, ఈశ్వరమ్మ, విజయ, భూకై లేశ్వరీ, ఓబుళమ్మ, కుమారి, చంద్రావతి, ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.
కల్టెరేట్ ఎదుట అంగన్వాడీల ధర్నా