
25న వైఎస్సార్‌సీపీలో చేరుతున్నా
జెడ్పీ మాజీ చైర్మన్ సుబ్రమణ్యం
రాయచోటి: వైఎస్సార్‌సీపీ నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఈనెల 25వ తేదీన వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్లు జెడ్పీ మాజీ చైర్మన్ సుగవాసి సుబ్రమణ్యం ప్రకటించారు. సోమవారం ఈ విషయాన్ని రాయచోటిలో విలేకరులకు వెల్లడించారు. రాజంపేట మాజీ ఎంపీ, రాయచోటి మాజీ ఎమ్మెల్యే దివంగత నేత సుగవాసి పాలకొండ్రాయుడు పెద్ద కుమారుడు సుగవాసి సుబ్రమణ్యం 20 రోజుల కిందట టీడీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 2024 ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా ఈయన పోటీలో ఉన్నారు. ఈ సందర్భంగా మీడి యాతో సుబ్రమణ్యం మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీలో చేరిక విషయం ఈ రోజు తీసుకున్న నిర్ణయం కాదన్నారు. గత పది సంవత్సరాలుగా ఎన్నో సందర్భాల్లో తన తండ్రితో చర్చించడం జరిగిందన్నారు. ప్రజా సంక్షేమం కోసం తన తండ్రిబాటలో నడిచి, భవిష్యత్తులో వారి సేవా భావానికి అనుగుణంగా తాను వేసి ప్రతి అడుగు ఉంటుందన్నారు. పార్టీలో చేరడానికి గల కారణాలు, జరిగిన పర్యావసనాలన్నీ ప్రతి ఒక్కరిని నేరుగా కలిసి వివరిస్తానని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కార్యకర్తలను, నాయకులను ఇబ్బందులకు గురి చేయడం మంచిది కాదని భావించానన్నారు. అందువల్లనే తాను ఒక్కన్నే వెళ్లి పార్టీలో చేరిన అనంతరం ప్రతి ఒక్కరినీ నేరుగా కలుసుకొని అంతా వివరిస్తానని ఉధ్ఘాటించారు.