
ఎల్లో రియల్టర్లకు కరెంటోళ్లు దాసోహం!
రాజంపేట : రైతులు, వినియోగదారుల ప్రయోజనాల కంటే ఎల్లో రియల్టర్ల ప్రయోజనాలే విద్యుత్ అధికారులకు ఎక్కువయ్యాయి. వెంచర్లకు విద్యుత్ స్తంభాల సరఫరా వ్యవహారమే ఇందుకు నిదర్శనం. రాజంపేట–రాయచోటి రోడ్డులోని జగనన్నకాలనీకి ఎదురుగా ఉన్న స్థలంలో ఏర్పాటు చేసిన వెంచర్‌లో ఏపీఎస్పీడీసీఎల్ విద్యుత్ స్తంభాలు వేసుకున్నారని ఆరోపణలు ఆ శాఖను రోడ్డుపైకి తీసుకొచ్చాయి. కరెంటు స్తంభాలపై ఉన్న ఏపీఎస్పీడీసీఎల్ గుర్తులు చెరిపివేశారు. లేఔట్‌కు కరెంటు పోల్స్ తరలింపు వ్యవహారం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. కరెంటు స్తంభాల కోసం రైతులు, ప్రజలు కరెంటోళ్ల చుట్టూ తిరుగుతున్న పరిస్థితులు అనేకం ఉన్నాయి.
దొడ్డిదారిన కరెంట్ పోల్స్ తరలింపు ఇలా..
అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాల ఉద్ద ఉన్న తాళ్లపాక సబ్ సెంటర్‌కు ఈనెల 17న 9 మీటర్ల విద్యుత్ స్తంభాలు, 11 మీటర్ల విద్యుత్ స్తంభాలు 26 వచ్చాయి. ఈనెల 6న నార్త్ ఏఈ శ్రీనివాసులు చెప్పారని 9 మీటర్లకు సంబంధించి 8 కరెంటు పోల్స్‌ను కాంట్రాక్టర్ రవి, జె.వెంకటసుబ్బయ్య తీసుకెళ్లినట్లుగా రిజిస్టర్‌లో నమోదు అయింది. ఈ విషయాన్ని ఏఈ ధ్రువీకరిస్తున్నారు.
రూరల్ ఏఈ వద్దకు రియల్టర్లు..
రూరల్ ఏఈ ఈశ్వరరాజు వద్దకు ముందుగా లేఔట్‌దారులు (టీడీపీ నేతలు) వచ్చారు. కరెంట్‌ఫోల్స్ కావాలని అడిగారు. లేఔట్ అప్రూవల్ ఉంటేనే కరెంటు స్తంభాలకు ప్రతిపాదనలు పంపుతామని చెప్పారు. ఆ తర్వాత ఆ నేతలు ఏఈని సంప్రందించలేదు. ఈ విషయంపై ఏఈ మాట్లాడుతూ వెంచర్‌లో తమ శాఖకు సంబంధించిన కరెంటు స్తంభాలు ఉన్నట్లుగా గుర్తించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. వెంచర్ ఉన్న స్థలం మౌలా పేరుతో ఉందన్నారు. అయితే పేరు వేరొకరిదైనా, వెంచర్ వేసున్నది టీడీపీ నేతలేనని తెలుస్తోంది.
ఉన్నతాధికారి ఒకరికి చేయితడిపారంటా..
ఎల్లో రియల్టర్ వెంచర్‌లో కరెంటు స్తంభాలు తరలింపు వెనుక ఏపీఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారి ఒకరికి చేయి తడిపారనే ఆరోపణలు ఉన్నాయి. అడ్డు చెబుతాడనే కారణంతో కరెంటు స్తంభాల తరలింపు వ్యవహారం కోసం మరో డివిజన్ స్థాయి ఉన్నతాధికారిని శిక్షణ పేరుతో వారం రోజుల పాటు రాయచోటికి పంపినట్లు తెలిసింది. ఈ వారంలోపు 14 కరెంటు స్తంభాలు వెంచర్‌లో ఏర్పాటు చేసుకున్నారు. స్తంభాలపై ఉన్న ఏపీఎస్పీడీసీఎల్ పేర్లు, సీరియల్ నెంబర్లు చెరిపివేశారు.
విజిలెన్స్ అధికారుల విచారణ..
బ్రాహ్మణపల్లె సమీపంలో టీడీపీ నేతలు వేసుకున్న వెంచర్‌లో స్తంభాలను విజిలెన్స్ అధికారులు పరిశీలించారు. ఈ స్తంభాలు ఎక్కడి నుంచి వచ్చాయి?ఎవరు తీసుకొచ్చారు, ఎవరు ఈ విద్యుత్ స్తంభాలను నాటారన్న కోణంలో ఆరా తీసినట్లు తెలిసింది. విచారణ అనంతరం ఉన్నతాధికారులకు నివేదికలు వెళ్లనున్నాయి. టీడీపీ నేతల తీరుపై విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు అందడంతో కరెంటు స్తంభాల తరలింపు వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
వెంచర్‌కు ఏపీఎస్పీడీసీఎల్
స్తంభాలు సరఫరా
స్తంభాలపై ఆనవాళ్లు లేకుండా
చేసిన వైనం
ఆరా తీస్తున్న ఏపీఎస్పీడీసీఎల్ విజిలెన్స్ విభాగం

ఎల్లో రియల్టర్లకు కరెంటోళ్లు దాసోహం!