
గాయపడిన వ్యక్తి మృతి
కలకడ : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి చెందినట్లు హెడ్ కానిస్టేబుల్ రమేష్ తెలిపారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కలకడ మండలం, కె.బాటవారిపల్లె పంచాయతీ కలకడ మాదిగపల్లెకు చెందిన వెంకట్రమణ(70) తన ద్విచక్రవాహనం లో 17వతేదీన కలకడనుంచి స్వగ్రామానికి చేరుకుంటున్న చేరుకుంటున్న సమయంలో కలకడ జగనన్న కాలనీ వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడటంతో రక్తగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వెంకట్రమణను 108 వాహనంలో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు మృతుని చిన్న భార్య రెడ్డెమ్మ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు హెడ్‌కానిస్టేబుల్ రమేష్ కేసు నమోదు చేశారు. మృతుడికి ఇద్దరు భార్యలు, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
మహిళ మెడలో గొలుసు చోరీ
మదనపల్లె రూరల్ : ఆటో కోసం వేచి చూస్తున్న మహిళ మెడలోని గొలుసును గుర్తుతెలియని వ్యక్తి చోరీచేసిన ఘటన సోమవారం మదనపల్లెలో జరిగింది. బీటీ కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా పనిచేసి పదవీ విరమణ పొందిన నరసింహారెడ్డి భార్య సత్య (65) పట్టణంలోని సొసైటీకాలనీలో నివసిస్తోంది. సోమవారం వ్యక్తిగత అవసరాల నిమిత్తం షాపింగ్‌కు వెళ్లేందుకు స్థానిక రామాలయం వద్దకు వచ్చి ఆటో కోసం వేచి చూస్తుండగా, ద్విచక్రవాహనంలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కుని క్షణాల్లో పరారయ్యాడు. ఆమె తేరుకునేలోపు కనిపించకుండా పోయాడు. దీంతో బాధితురాలు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో బంగారు గొలుసు చోరీపై ఫిర్యాదు చేసింది. గొలుసు 32 గ్రాముల బరువు కలిగి సుమారు రూ.2లక్షలు విలువ ఉంటుందని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఎరీషావలీ తెలిపారు.