
అనారోగ్యం భరించలేక ఆత్మహత్య
గాలివీడు : అనారోగ్యంతో మనస్తాపం చెందిన కలపల గోవిందాచారి(59) విషద్రావణం తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో జరిగింది. ఎస్‌ఐ రామకృష్ణ కథనం మేరకు కొర్లకుంట గ్రామం కుమ్మరపల్లెకు చెందిన గోవిందాచారి కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈక్రమంలో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఈనెల 19 వ తేదీన విష ద్రావణం తాగాడు. కొన ఊపిరితో ఉన్న అతన్ని కుటుంబ సభ్యులు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
బస్సు ఎక్కుతుండగా
బంగారు నగలు చోరీ
జమ్మలమడుగు రూరల్ : పట్టణంలోని పాతబస్టాండ్‌లో ప్రయాణికురాలి బ్యాగ్ నుంచి 6 తులాల బంగారు చోరీ జరిగినట్లు ఎస్‌ఐ హైమావతి తెలిపారు. కొండాపురం మండలం తాళ్ల ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన ప్రవళ్లిక తన భర్తతో కలసి స్వగ్రామమైన పెద్దముడియం మండలం జంగాలపల్లె గ్రామానికి వెళ్లేందుకు జమ్మలమడుగు బస్టాండ్‌కు వచ్చింది. కొద్ది సేపటికి బస్సు రావడంతో హ్యాండ్ బ్యాగ్ తీసుకుని భర్తతో కలసి బస్సు ఎక్కింది. కాసేపటి తర్వాత బ్యాగ్ చూసుకోగా అందులో బంగారు నగలు ఉన్న చిన్న బ్యాగ్ కనిపించలేదు. వెంటనే భర్తతో కలసి జమ్మలమడుగు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.