
టీడీపీలో కులాల కుంపటి.!
రాజంపేట : వర్గ విభేదాలకు నిలయమైన రాజంపేట తెలుగుదేశం పార్టీలో అధికారపెత్తనం కోసం కులాల కుంపటి రాజుకుంటోంది. ఆదివారం నియోజకవర్గ కేంద్రమైన రాజంపేటలోని తోట కళ్యాణ మండపంలో నియోజకవర్గ వ్యాప్తంగా బలిజల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమావేశం ప్రధానంగా టీడీపీలో బలిజలకు అన్యాయం జరిగిందనే విధంగా కొనసాగినట్లుగా అధిష్టానానికి నివేదికలు వెళ్లినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నియోజకవర్గంలోని రాజంపేట టౌన్, రాజంపేట రూరల్, నందలూరు, ఒంటిమిట్ట, సుండుపల్లె, వీరబల్లి మండలాలకు చెందిన బలిజ సామాజికవర్గానికి చెందిన గ్రామ, మండల స్థాయి నేతలు తరలి వచ్చారు. 500 మంది వచ్చినట్లుగా లెక్కలు వేసుకుంటున్నారు. అయితే టీడీపీకి చెందిన బలిజ సామాజిక వర్గంలో పేరొందిన సీనియర్లు , ముఖ్యనేతలు పాల్గొనకపోవడం గమనార్హం
ఇన్‌చార్జి పదవి తమకే ఇవ్వాలనే అల్టిమేటం..
టీడీపీ ఇన్‌చార్జి పదవి తమకే ఇవ్వాలనే అల్టిమేటం ఆత్మీయ సమావేశం ద్వారా అధిష్టానానికి ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే టీడీపీలో పసుపులేటి బ్రహ్మయ్య, బత్యాల చెంగల్రాయుడు, సుగవాసి బాలసుబ్రమణ్యం లాంటి బలిజ నేతలకు అన్యాయం జరిగిందనే భావన సమావేశంలో నేతలు వ్యక్తం చేసుకున్నారు. సమావేశంలో కడపలో ఉంటున్న హరిప్రసాద్, మోదుగల కళావతమ్మ ఇంజినీరింగ్ కళాశాల అధినేత పెంచలయ్య సోదరులు, కుప్పాల వెంకటసుబ్బయ్య, ప్రముఖ న్యాయవాది కృష్ణకుమార్, బండారు బాలయ్య, పూల భాస్కర్, వెంకటసుబ్బయ్యతోపాటు వివిధ మండలాలకు చెందిన బలిజ నేతలు, రాజంపేట పట్టణానికి చెందిన నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశం ద్వారా టీడీపీ ఇన్‌చార్జి పదవి హరిప్రసాద్‌కు ఇవ్వాలనే డిమాండ్ పరోక్షంగా బలిజనేతలు తెరపైకి తీసుకొచ్చారు. ఈయన కడపకే పరిమితమైన నాయకుడిగా చెలామణి అవుతున్నా ఇప్పుడు తాను ఒంటిమిట్ట మండలానికి చెందిన వ్యక్తిననే భావనతో ఇన్‌చార్జి రేసులోకి వచ్చారు.
బలిజలకు అధిష్టానం అనుకూలమా..
ప్రతికూలమా..
టీడీపీ ఇన్‌చార్జి పదవి బలిజేతరుల నేతలకు ఇవ్వడానికి అధిష్టానం దృష్టి సారించినట్లుగా పార్టీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. అందువల్లనే బలిజ సామాజిక వర్గానికి చెందిన వారు తరచూ ఆత్మీయ సమావేశాలు పెట్టుకొని టీడీపీ కుర్చీని దక్కించుకోవాలనే దిశగా అడుగులు వేస్తున్నారు. వీరికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుకూలమా, ప్రతికూలమా అనేది ఇంకా బహిర్గతం కాలేదు. ప్రస్తుతానికి ఇన్‌చార్జిని ప్రకటించే విషయంలో అధిష్టానం వెనకడుగుపై అనేక ఆలోచనలు, అనుమానాలు పుట్టుకొస్తున్నాయి.
బలిజేతరుల వైపు చూపు..!
ఇప్పటికే క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన, రాజు విద్యాసంస్ధల అధినేత చమర్తి జగన్‌మోహన్‌రాజు, రెడ్డి సామాజికవర్గం నుంచి మేడా విజయశేఖర్‌రెడ్డిలు ఇన్‌చార్జి పదవిని ఆశిస్తున్నారు. బలిజ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు, రాయచోటికి చెందిన సుగవాసి బాలసుబ్రమణ్యంను అధిష్టానం గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేయించింది. వారి ఓటమి తర్వాత ఆ సామాజికవర్గం దిశగా ఇప్పుడు అధిష్టానం ఆలోచన చేయడం లేదన్న వాదన పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. కానీ బలిజలు రాజంపేట తమదే.. టీడీపీ కుర్చీ తమకే అన్నట్లుగా భీష్మించుకొని కూర్చున్నారు. అధిష్టానం ఎటువైపు మొగ్గుచూపుతుందో వేచి చూడాల్సిందే.
ఇన్‌చార్జి కుర్చీకోసం బలిజల సిగపట్లు
బలిజేతర నేతలపై అధిష్టానం దృష్టి ?
తాజాగా తెరపైకి కడపకు చెందిన బలిజ నేత

టీడీపీలో కులాల కుంపటి.!