
యువత పోరును విజయవంతం చేయండి
రాయచోటి టౌన్ : యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్.రమేష్ కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం రాయచోటి వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో యువత పోరు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు నాయుడు అనేక రకాల హామీలు ఇచ్చారన్నారు. వాటిలో ప్రధానంగా ఆరు పథకాలకు సూపర్ సిక్స్ అని పేరు పెట్టి అమలు చేస్తానని నమ్మించారన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని మరిచారని విమర్శించారు. అమ్మకు వందనం పేరుతో తల్లులకు కూడా మోసం చేస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్రంలో 80 లక్షలకు పైగా అర్హత కలిగిన వారు ఉంటే ప్రభుత్వం మాత్రం 50 లక్షల మందికి మాత్రమే ఇస్తోందన్నారు. ఇక యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ మాటే ఎత్తడం లేదన్నారు. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి రూ.3000 ఇస్తానని చెప్పారని కానీ ఏడాది పూర్తి అవుతున్నా ఆ విషయం పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు చేసిన మోసాలను ఎండగట్టేందుకు ఈ నెల 23వ తేదీ రాయచోటిలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట యువత పోరు కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి శిబ్యాల విజయభాస్కర్, మైనార్టీ నాయకుడు కొలిమి హరూన్ బాషా, యువజన విభాగం అధ్యక్షుడు శివప్రసాద్ రెడ్డి, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు కిశోర్ దాస్ రెడ్డి, పరుశురాం నాయుడు, రెడ్డికుమార్, అజ్మత్ బాషా తదితరులు పాల్గొన్నారు.