
యోగా.. ఒంటికి మంచిదేగా..
ఇంటిని ఎలా శ్రద్ధగా నిర్మించుకుంటారో.. ఒంటిని(బాడీ) అలానే బాగు చేసుకోవాలి. డబ్బు లేని ఇల్లు ఉందేమో కానీ.. నేటి రోజుల్లో జబ్బు లేని ఇల్లు అరుదుగా కనిపిస్తుంది. ప్రపంచానికి దేశం అందించిన గొప్ప వరం యోగా. ఆరోగ్యంగా ఉండాలంటే యోగ సాధన ప్రధానం అని నిపుణులు చెబుతున్నారు. ఆసనాలతో ఆసుపత్రులు, మందులు, ఆపరేషన్లకు దూరంగా ఉండవచ్చునని అవగాహన కల్పిస్తున్నారు. నేడు అంతర్జాతీయ యోగ దినోత్సవం కావడంతో వేలాది మంది యోగ సాధనకు సిద్ధమవుతున్నారు.
కురబలకోట : మారిన జీవన శైలి ప్రజారోగ్యంపై ప్రభావాన్ని చూపుతుంది. శారీకర శ్రమ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిందని ముచ్చటపడుతున్నా.. వ్యాధులు కూడా అదే స్థాయిలో విజృంభిస్తుండడం కలవరం కలిగిస్తోంది. అనారోగ్యానికి గురైనప్పుడు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారేగానీ.. ఆరోగ్య సాధనకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయనే సంగతిని విస్మరిస్తున్నారు. దేశంలో పూర్వీకులు అందించిన యోగా ఎన్నో రోగాలను నియంత్రణలో ఉంచుతుంది. పూర్వం రుషులు, యోగులు, మునులు, సిద్ధులు, సాధువులు యోగాతో ఆరోగ్యాన్ని నిక్షేపంగా ఉంచుకున్నారు. రోజూ అర గంట యోగ చేస్తే ఎలాంటి రోగమైనా కుదుటపడుతుందని అనుభవజ్ఞులు చెబుతున్నారు. మనిషి జీవన విధానం. వ్యక్తిగత, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శ్వాస క్రియ ద్వారా కణజాలానికి ఆక్సిజన్ అందడంతో క్రమేణా రోగాలు దూరమవుతాయి. ఆరోగ్యానికి వాకింగ్, ఎక్సర్ సైజ్, ధ్యానం, జిమ్‌లు తోడ్పడతాయి. తగినంత వెలుతురు, గాలి ఉంటే చాలు ఉన్న చోటునే కాదు ఎక్కడైనా ఆసనాలు చేసుకోవచ్చు. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి తర్వాత ఆరోగ్యంపై అంతా దృష్టి సారిస్తున్నారు. శనివారం అంతర్జాతీయ యోగ దినోత్సవం రోజునైనా ఆసనాలు ప్రారంభించి ఆరోగ్య సాధనకు కృషి చేద్దామని పలువురు తమ అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నారు.
ముఖ్య ఆసనాలు
భుజంగాసనం, పద్మాసనం, వజ్రాసనం, హలాసనం, సర్వాంగాసనం, శీర్షాసనం, శవాసనం, మయూరాసనం, వృక్షాసనం, పశ్చిమోత్తాసనం, చతురంగ దండాసనం, వీరభధ్ర ఆసనం, ధనురాసనం, నౌకాసనం, బలాసనం, చక్రాసనం, ఉష్ట్రాసనం, తాడాసనం, శలభాసనం, భ్రమరి, ప్రాణాయామం, సూర్య నమస్కారం లాంటివి ముఖ్యమైనవి.
ఆసనాలతో ఆరోగ్యానికి రక్షణ
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం