
ఇరువర్గాలపై కేసు నమోదు
కలికిరి : స్థానిక మార్కెట్ యార్డులో గురువారం ఉదయం కూలీల మధ్య చోటు చేసుకున్న చిన్నపాటి తగాదా చిలికి చిలికి గాలివానగా మారి రెండు ఊర్ల మధ్య ఘర్షణకు దారితీసింది. పోలీసులు జోక్యం చేసుకుని గురువారం సాయంత్రం ఇరువర్గాల వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి బైండోవర్ చేసుకోవడానికి ప్రయత్నించినా తిరిగి అక్కడ ఇరువర్గాల వారు ఘర్షణ పడ్డారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో గురువారం రాత్రి ఇరువర్గాలకు చెందిన 12 మందిపై కేసు నమోదు చేశారు. మార్కెట్ సమీపంలోని గిరిజన కాలనికి చెందిన శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదుపై కలికిరి మాదిగపల్లికి చెందిన పవన్, వెంకటేష్, బాలాజీ, చరణ్, సాయి, సమరలపై, అలాగే కలికిరి మాదిగపల్లికి చెందిన బాలాజీ పిర్యాదు మేరకు గిరిజనకాలనీకి చెందిన శ్రీనివాసులు, బన్ని, సత్య, కౌశిక్, సతీష్, రఘులపై కేసు నమోదు చేసినట్లు సీఐ రెడ్డి శేఖర్‌రెడ్డి తెలిపారు. అలాగే మార్కెట్ యార్డులో ఇకపై ఎలాంటి తగాదాలు చోటు చేసుకోకుండా ఉదయం 4 గంటల నుంచి పోలీసు నిఘా ఏర్పాటు చేసినట్లు సీఐ తెలిపారు.
ద్విచక్ర వాహనాల
దొంగ అరెస్టు
రైల్వేకోడూరు అర్బన్ : మండలంలోని పలు వాహనాలను చోరీ చేసిన నిందితుడిని సీఐ హేమసుందర్ రావు ఆధ్వర్యంలో శుక్రవారం అరెస్టు చేశారు. అతడి నుంచి ట్రాక్టర్, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. సీఐ మాట్లాడుతూ నిందితుడు గతంలో పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడని, అనంతపురం జిల్లాలో 12 కేసులు అతడిపై నమోదైనట్లు తెలిపారు.
పోలీస్ జాగిలం మృతి తీరనిలోటు
కలకడ : దొంగలను పట్టుకోవడంతో సేవలు అందించి గోల్డ్‌మెడల్ అవార్డు పొందిన జాకీ మృతి పోలీస్ వ్యవస్థకు తీరని లోటు అని రిజర్వ్ ఇన్‌స్పెక్టర్(ఆర్‌ఐ) పెద్దయ్య, ఇన్‌చార్జ్ సీఐ ప్రసాద్‌బాబు అన్నారు. పులివెందుల వెటర్నిటీ ఆసుపత్రిలో అనారోగ్యంతో మృతి చెందిన జాకీ అంత్యక్రియలు కలకడ పోలీస్ స్టేషన్ పరేడ్ గ్రౌండ్ ఆవరణలో శుక్రవారం నిర్వహించారు. నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి గౌరవ వందనంతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్బంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ ఎర్రచందనం దొంగలను పట్టుకోవడంలోనూ, చోరీ కేసులు చేధిచడంలోనూ జాకీ 9 ఏళ్లు సేవలందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలకడ, వాల్మీకిపురం, రిజర్వ్‌పోలీసులు పాల్గొన్నారు.

ఇరువర్గాలపై కేసు నమోదు