బీచ్‌కు పోదాం.. పదా.. పదా

Sea water is rich in micronutrients and minerals - Sakshi

సముద్ర నీటిలో సూక్ష్మపోషకాలు, మినరల్స్‌ పుష్కలం 

చర్మ వ్యాధులకు ఉప్పు నీటితో ఉపశమనం 

బీచ్‌ల సందర్శనతోమానసిక ఆనందం  

తీరాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి..

జలకాలాటలలో గలగల పాటలలో ఏమి హాయిలే అలా..  అనుకుంటూ బీచ్‌లో అలలపై తేలియాడుతుంటే భలే ఉంటుంది కదూ! సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో ఆ అంబుధి చెంత నిలబడి.. భానుడి వర్ణాలను చూస్తుంటే కళ్లు తిప్పుకోలేం కదూ! కడలి అందాలకు, మనలోని భావోద్వేగానికి తరతరాల అనుబంధం అది. సముద్రానికి, భారతీయ సంప్రదాయాలకు కూడా అవినాభావ సంబంధం ఉంది.

సముద్ర స్నానం వల్ల మానసిక ఆనందంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న అపార వనరుల్లో సుదీర్ఘ సముద్ర తీరం ఒకటి. ఇక్కడి మన బీచ్‌లు ఎంతో ప్రఖ్యాతి పొందాయి. రుషికొండ బీచ్‌ ప్రపంచ గుర్తింపు సాధిస్తూ బ్లూఫ్లాగ్‌ను కూడా సొంతం చేసుకుంది.  – శ్రీపాద బాలసుబ్రహ్మణ్యం, ఏపీ సెంట్రల్‌ డెస్క్‌        

జోరుగా.. హుషారుగా.. 
అద్భుతమైన, 975 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌ సొంతం. ఇక్కడ ఎన్నో అందమైన బీచ్‌లు ఉన్నాయి. వీకెండ్‌ వచ్చిందంటే చాలు జనాలతో ఆ బీచ్‌లు పోటెత్తుతున్నాయి. సూర్యలంక, మైపాడు, పేరుపాలెం, మంగినపూడి తదితర బీచ్‌లకు ఆదివారాల్లో 50 వేల మందికి పైగా వచ్చి సెలవు రోజును ఎంజాయ్‌ చేస్తున్నారు. విశాఖ, కాకినాడ లాంటి నగరాల బీచ్‌లకు పర్యాటకుల సందడి చెప్పనక్కర్లేదు. రోజు రోజుకు పెరుగుతున్న బీచ్‌ పర్యాటకంతో స్థానిక ప్రజలు ఉపాధి పొందుతున్నారు. దీనికి తగ్గట్లే ప్రభుత్వం కూడా బీచ్‌ల అభివృద్ధికి నిధులు కేటాయిస్తోంది. రిసార్ట్స్‌ నిర్మిస్తూ.. రోడ్లు వేస్తూ ఈ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తోంది.   

ఆరోగ్య రహస్యాలు ఎన్నో..  
సముద్రం నీటిలో సూక్ష్మపోషకాలు, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఆ నీరులో ఉండే మెగ్నిషియం, సోడియం, కాల్షియం, క్లోరైడ్, సల్ఫేట్‌ వంటి సూక్ష్మధాతువులు చర్మానికి సహజ సౌందర్యాన్ని ఇస్తాయి. సొరియాసిస్, ఎగ్జిమా వంటి చర్మవ్యాధులతో బాధ పడేవారికి ఈ ఉప్పునీరు ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. సముద్రనీటిలో ఉండే మెగ్నిషియంమన శరీరంలోని కార్టిసోల్‌ స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే నాడీవ్యవస్థను కంట్రోల్‌ చేసి మనలోని మానసిక ఒత్తిడిని నియంత్రిస్తుంది.  

ఉప్పునీటి స్నానం శరీరంలోని యాంటీఆక్సిడెంట్స్‌ ప్రక్రియ సక్రమంగా ఉండేలా నియంత్రిస్తుంది. గుండె జబ్బులు, క్యాన్సర్‌ల ముప్పును తగ్గించేందుకు సహకరిస్తుంది. సీ వాటర్‌లో మెగ్నిషియం ఎక్కువగా ఉండటం వల్ల మజిల్స్‌ రిలాక్స్‌ అయ్యి.. మంచి నిద్ర పడుతుంది.  
 ట్రేస్‌ఎలిమెంట్స్, సూక్ష్మజీవులతో పాటు యాంటీబ్యాక్టీరియల్‌గా ఉండేవి సముద్రంలో చాలా ఉంటాయి. వీటిని చర్మం గ్రహించడం ద్వారా సహజ యాంటీబయాటిక్స్‌లా ఉపయోగపడతాయి.   
♦ సముద్రంలోని ఉప్పునీరు సైనస్‌ ఇబ్బందులను తొలగిస్తుంది. సహజ సెలైన్‌ సొల్యూషన్‌గా పనిచేసి సైనస్‌లో పేరుకున్న మ్యూకస్‌ను క్లియర్‌ చేస్తుంది.  
♦ రెగ్యులర్‌గా సముద్ర స్నానం చేస్తూ ఈత కొట్టడం వల్ల సహజంగా బరువు తగ్గుతారని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.   

బ్లూఫ్లాగ్‌ కోసం..  
పరిశుభ్రమైన బీచ్‌లకు బ్లూఫ్లాగ్‌ సర్టిఫికెట్‌ లభిస్తుంది. ఈ గుర్తింపును ఫౌండేషన్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ (ఎఫ్‌ఈఈ) అనే అంతర్జాతీయ సంస్థ ఇస్తుంది. 77 దేశాల్లో ఈ సంస్థ కార్యక్రమాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించేలా బ్లూఫ్లాగ్‌ గుర్తింపు రావాలంటే.. ఆబీచ్‌ పరిసరాలు పరిశుభ్రంగా, పర్యావరణ హితంగా ఉండాలి. 33 అంశాల్లో బీచ్‌ను అభివృద్ధి చేస్తే దానికి బ్లూఫ్లాగ్‌ వస్తుంది. మొత్తం 50 దేశాల్లో 4,831 బీచ్‌లకు ఈ సర్టిఫికెట్‌ లభించింది. మన దేశంలో 12 బీచ్‌లకు ఆ సర్టిఫికేషన్‌ లభించగా.. మన రాష్ట్రంలో రుషికొండ (విశాఖ) బీచ్‌ ఈ ఘనత సాధించింది. మరిన్ని బీచ్‌లకు కూడా బ్లూఫ్లాగ్‌ సాధించాలని రాష్ట్ర పర్యాటక శాఖ కృతనిశ్చయంతో ఉంది.    

మైపాడు బీచ్‌కు తరచూ వెళ్తాం 
నేను ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి బీచ్‌లకు వెళ్లడం, అక్కడ స్నానం చేయడం అంటే ఎంటో ఇష్టం. సెలవు రోజుల్లో నెల్లూరు జిల్లాలోని మైపాడు బీచ్‌కు ఫ్యామిలీతో పాటు వెళ్తుంటాను. మా పిల్లలు బీచ్‌లో స్నానాన్ని ఎంతో ఎంజాయ్‌ చేస్తారు. తగిన జాగ్రత్తలతో వారితో పాటు నేను కూడా ఇక్కడ స్నానం చేస్తాను. పని ఒత్తిడితో ఇక్కడికి వస్తే చాలా రిలాక్సింగ్‌ అనిపిస్తుంది. సముద్ర స్నానం చేస్తే మంచిదని మా పెద్దలు కూడా చెబుతుండేవారు.      – కేఎన్‌వీ కుమార్, తిరుపతి 

మూడ్‌ మారుతుంది 
♦ మానసిక ఆరోగ్యానికి బీచ్‌ల సందర్శనం ఎంతో ఉపయోగపడుతుందని స్విమ్‌ ఇంగ్లాండ్‌ సంస్థ అధ్యయనం చెబుతోంది. సముద్రంలో ఈత కొట్టడం వల్ల ఫీల్‌ గుడ్‌ మాలిక్యూల్స్‌ పిలిచే బీటా ఎండార్ఫిన్స్‌ శరీరంలో పెరుగుతాయని, రెగ్యులర్‌గా ఈతకొట్టే వాళ్లు అతి తక్కువ సార్లు మానసిక వైద్యుల్ని సంప్రదిస్తున్నారని ఆ సంస్థ నివేదికలు పేర్కొంటున్నాయి. హైడ్రోథెరపీగా కూడా బీచ్‌బాత్‌ ఉపయోగపడుతుందని చెబుతున్నారు.   
సముద్రంపై నుంచి వచ్చే గాలి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. బీచ్‌ వద్దకు వెళితే హ్యాపీ హార్మోన్‌గా పిలిచే సెరిటోనిన్‌ మన శరీరంలో పెరిగి, మనం రిలాక్స్‌ అవుతామని, సముద్ర హోరు, ఆ అనంత జలరాశి దృశ్యం మన మూడ్‌ను మారుస్తుందని ఆ అధ్యయనాలు పేర్కొన్నాయి.  

తీసుకోవాల్సిన జాగ్రత్తలు 
మద్యం సేవించి సముద్రంలో స్నానం చేయకూడదు 
తీవ్రమైన గాయాలు ఉన్నపుడు బీచ్‌లో స్నానం చేయకుండా ఉంటేనే మంచిది.   
ఈతలో నైపుణ్యం ఉంటే తప్ప తీరంనుంచి దూరంగా లోపలికి వెళ్లకూడదు.   
సముద్రంలో పెద్ద రాళ్లు ఉంటే జాగ్రత్తగా ఉండాలి. అలల తాకిడికి తల రాళ్లకు కొట్టుకునే ప్రమాదం ఉంటుంది. అలాంటి ప్రాంతాల్లో తలకిందులుగా డైవ్‌ చేయడం కూడా ప్రమాదం.  
అలలు ఎక్కువగా ఉన్నపుడు జాగ్రత్త వహించాలి. బలమైన అలల మధ్య ఇరుకైన ప్రవాహాన్ని రిప్‌ కరెంట్‌ అంటారు. ఇవి మనిíÙని ఒక్కసారిగా లోతైన ప్రవాహంలోకి లాగేస్తాయి.     
ఉరుములు, మెరుపులు ఉన్న సమయంలో సముద్రంలో ఉండటం ప్రమాదం. వెంటనే సురక్షిత ప్రదేశానికి వెళ్లిపోవాలి.  

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమైన బీచ్‌లు  
రామకృష్ణ బీచ్, రుషికొండ, భీమిలి (విశాఖ)  
మంగినపూడి (కృష్ణా జిల్లా)  
పేరుపాలెం (పశ్చిమ గోదావరి)   
♦ అంతర్వేది (అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా) 
♦ కాకినాడ (కాకినాడ జిల్లా)    
♦  మైపాడు (నెల్లూరు జిల్లా)   
♦ సూర్యలంక, రామాపురం (బాపట్ల జిల్లా)   
♦  కళింగపట్నం, భావనపాడు (శ్రీకాకుళం జిల్లా) 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top