
అధిక ఫీజులు చెల్లించలేమంటున్న తల్లిదండ్రులు (అంతర చిత్రంలో) అన్నాగౌరీ మెడికల్ కాలేజీ
అన్నాగౌరీ మెడికల్ కాలేజీలో బాదుడే బాదుడు
అన్ని కళాశాలల్లో కన్వినర్ కోటా ఫీజు రూ.1.70 లక్షలు కాగా ఇక్కడ రూ.5.36 లక్షలు
ప్రభుత్వం ఆదుకోవాలంటున్న తల్లిదండ్రులు
పుత్తూరు: తిరుపతి జిల్లా పుత్తూరులోని అన్నాగౌరీ మెడికల్ కళాశాల యాజమాన్యం ఫీజుల బాదుడుకు విద్యార్థులు, తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పైవేటు వైద్య కళాశాలలు కన్వినర్ కోటా కింద ఒక్కో సీటుకు ఫీజు రూ.1.70 లక్షల వరకు వసూలుచేస్తుండగా అన్నాగౌరీ కళాశాల యాజమాన్యం మాత్రం హాస్టల్ విత్ ఏసీ అయితే రూ.5.36 లక్షలు, నాన్ ఏసీ అయితే రూ.4.56 లక్షలు కట్టాల్సిందేనంటున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. కళాశాల కమిటీ నిర్ణయం ఇదేనని.. మీకు ఇష్టముంటే చేరండి లేదంటే వెళ్లండంటూ సీఈఓ నిర్లక్ష్యంగా చెబుతున్నారంటూ కన్వినర్ కోటా కింద సీట్లు పొందిన 50 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వారు కోరుతున్నారు.
మానసికంగా కుంగిపోయా..
అన్నాగౌరీ కళాశాలలో ఫీజులు వినగానే మానసికంగా కుంగిపోయాను. మాది వైట్‌కార్డ్ హోల్డర్‌కు చెందిన పేద కుటుంబం. మా అబ్బాయిని కష్టపడి చదివించుకున్నాం. అన్ని కళాశాలల్లాగే అన్ని ఫీజులు కలిపి రూ.1.70 లక్షలు ఉంటుందనుకున్నాం. కానీ, ఈ అన్నాగౌరీ కాలేజీలో ఫస్ట్ ఇయర్ కిట్ రూ.1.10 లక్షలు పెట్టి తీసుకోవాలన్నారు. మా వద్ద కిట్ ఉంది కనుక మాకు అది అవసరం లేదు. స్పోర్ట్స్, కల్చర్ ఫీజు కింద రూ.55 వేలు చెల్లించాలన్నారు. హాస్టల్‌లో విధిగా ఉండాలన్నారు. హాస్టల్ రూమ్ ఫీజు రూ.1.10 లక్షలు, ఏసీ అయితే రూ.1.90 లక్షలతో పాటు, ఎక్కడాలేని విధంగా విద్యుత్ చార్జీలకు మరో రూ.40 వేలు కట్టాలన్నారు. ఎమినిటీస్ రూ.20 వేలు అంటున్నారు. ఇలా మొత్తం ఫీజు రూ.5.36 లక్షలు. – లత, నంద్యాల
రూ.5 లక్షలు కడితే అది కన్వినర్ కోటా ఎలా అవుతుంది?..
రూ.నాలుగు నుంచి ఐదు లక్షల వరకు కడితే అది కన్వీనర్ కోటా ఎలా అవుతుంది? మా పాపకు కన్వినర్ కోటా కింద సీటొచి్చంది. గాయత్రి కళాశాలలో రూ.1.50 లక్షలు ఫీజు అయితే ఇక్కడ దాదాపు రూ.5 లక్షలు వరకు చెబుతున్నారు. ఇంత ఎక్కువ ఏమిటి సార్.. అని అడిగితే కమిటీ నిర్ణయం తీసుకుంది.. ఇష్టం ఉంటే చేరండి లేదంటే వెళ్లిపొండి అంటున్నారు. – ప్రియ, అనంతపురం