
భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వీడియోలు పోస్టు చేశారంటూ ఆరోపణ
పోలీసులకు ఫిర్యాదు చేసిన డిప్యూటీ ఈఈ గోవిందరాజులు
హైందవ ధర్మ పరిరక్షణే లక్ష్యంగా ఉద్యమిస్తా
నాపై ఎన్ని కేసులైనా పెట్టుకోండి
జైలుకు పంపినా భయపడను
టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి
తిరుపతి క్రైమ్,తిరుపతి మంగళం: టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర రెడ్డిపై తిరుపతి అలిపిరి పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం రాత్రి అక్రమ కేసు నమోదు చేశారు. హిందూ మత మనోభావాలు దెబ్బతీయడానికి, టీటీడీని కించపరచడానికి, ప్రజల్లో అల్లర్లు రేపడానికి దు్రష్పచార వీడియోలు పోస్ట్ చేశారంటూ ఆయనపై టీటీడీ డిప్యూటీ ఇంజనీర్ గోవిందరాజులు అలిపిరి పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు 196(1)(ఎ), 197(1), 299, 352, 353(3), 356(2), రెడ్ విత్ 356(1) బిఎంఎస్ చట్టం కింద భూమనపై కేసు నమోదు చేశారు.
తిరుపతి అలిపిరి బస్టాండు సమీపంలో చెత్త, మద్యం సీసాలు, మూత్ర విసర్జన జరిగే ప్రదేశాల్లో వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని వదిలిపెట్టినట్లుగా భూమన కరుణాకరరెడ్డి చూపించారని గోవిందరాజులు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి వీడియోలు వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయ్యాయన్నారు. రాయల్ చెరువుకు చెందిన దివంగత పట్టా కన్నాచారి సుమారు 20 ఏళ్ల క్రితం ఈ శిల్పాన్ని పూర్తిచేయకుండా వదిలేశారని తెలిపారు.
ఆ సమయంలో చాలా రాళ్లతో పాటు శనీశ్వర విగ్రహాన్ని భూదేవి కాంప్లెక్స్ వెనుకవైపు ఉన్న ఖాళీ స్థలంలో పడేశారన్నారు. ఈ విగ్రహానికి, టీటీడీకి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరిచి రాజకీయ లబ్ధి కోసమే భూమన ఈ చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు.
శనీశ్వరుడికి శంఖు, చక్రాలు ఉంటాయా?
భూమన మండిపాటు
రాజకీయాల కంటే హిందూ ధర్మ పరిరక్షణే లక్ష్యంగా పోరాడుతానని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతిలో మంగళవారం రాత్రి ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. అలిపిరి పాదాలచెంత మహావిష్ణువు విగ్రహాన్ని మద్యం బాటిళ్ల మధ్య పడేశారని చూపించి ప్రశ్నిస్తే టీటీడీ అధికారులు తనపై కేసులు పెట్టడం వారి నీచత్వానికి నిదర్శనమని మండిపడ్డారు.
టీటీడీలో జరుగుతున్న తప్పిదాలు, అపచారాలు, ఘోరాలను సరిదిద్దుకోవాల్సిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తనపై కేసులు పెట్టించడం దుర్మార్గమన్నారు. మహావిష్ణువు విగ్రహానికి అపచారం జరిగిందని చూపితే అసలు ఆ విగ్రహం మహావిష్ణువుదే కాదు.. శనీశ్వర స్వామిదని చెప్పడం ఏంటని మండిపడ్డారు. శనీశ్వరస్వామి విగ్రహానికి శంఖు, చక్రాలు ఉంటాయా అని నిలదీశారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా, జైలుకు పంపినా భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.