
నంద్యాల జిల్లా అవుకులో సోలార్ కంపెనీ సేకరిస్తున్న వ్యవసాయ భూములు
రైతులపై ‘సోలార్’ పిడుగు
నంద్యాల జిల్లా అవుకు మండలంలో శరవేగంగా 1,252 ఎకరాల సేకరణ
సాక్షి ప్రతినిధి కర్నూలు: ‘‘మీ భూములు బ్యాంకుల్లో తనఖా పెట్టి మేం లోన్లు తీసుకుంటాం. మీ పొలాలతో మేం వ్యాపారం చేసుకుంటాం..!’’ అంటూ నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం అవుకు మండలంలో సోలార్ విద్యుత్తు ప్లాంటు ఏర్పాటు పేరుతో రైతులను బెదిరించి సారవంతమైన భూములను గుంజుకుంటున్నారు. లీజు ముసుగులో 30 ఏళ్ల పాటు పంట భూములను తీసుకుని శాశ్వతంగా సొంతం చేసుకునే కుట్రలకు తెర తీశారు.
లీజు చెల్లింపులకు సంబంధించి మధ్యలో ఏ సమస్య తలెత్తినా ప్రభుత్వ పూచీకత్తు ఉండదని.. రైతులే స్వయంగా ఢిల్లీకి వెళ్లి పరిష్కరించుకోవాల్సి ఉంటుందని ఒప్పదంలో నిబంధన విధించారు. మంత్రి బీసీ జనార్దనరెడ్డి కనుసన్నల్లో నయానా భయాన సాగుతున్న ఈ భూముల సేకరణతో అన్నదాతలు హడలెత్తిపోతున్నారు. తాతల కాలం నుంచి తమకు బువ్వ పెడుతున్న భూములను అప్పగించి కూలీలుగా మారలేమని ఆక్రోశిస్తున్నారు.
గడువు ముగిసినా.. కంపెనీ కనికరిస్తేనే!
అవుకు మండలంలో ‘హీరో’ సోలార్ కంపెనీ 1,252 ఎకరాల భూమిని సేకరిస్తుండగా లీజు రిజిస్ట్రేషన్లు శరవేగంగా జరుగుతున్నాయి. 29 ఏళ్ల 11 నెలల పాటు లీజు అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. గడువు ముగిసిన తర్వాత లీజు పొడిగించాలని కంపెనీ భావిస్తే రైతులు కచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. వ్యవసాయం చేసుకుంటా.. పిల్లల పెళ్లి, ఇంటి ఖర్చుల కోసం పొలం విక్రయిస్తామంటే కుదరదు.
ఇదే పొలాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి కంపెనీ రుణాలు తీసుకుంటుంది. ఇక లీజు చెల్లించకపోవడం, రెండేళ్లకోసారి పెంచకపోవడం లాంటి ఎలాంటి సమస్యలు తలెత్తినా ఆర్బిట్రేషన్ కోసం రైతులు ఢిల్లీకి వెళ్లాల్సిందే. నంద్యాల, విజయవాడకు వెళ్తామంటే కుదరదు. అంటే భవిష్యత్తులో సమస్యలు ఉత్పన్నమైతే రైతులు పరిష్కరించుకోలేని విధంగా చేసే కుట్ర ఇది!!
శాశ్వతంగా దూరం చేసే కుట్ర..
నంద్యాల జిల్లా అవుకు మండలంలో హీరో సోలార్ ప్యూచర్ ఎనర్జీస్ కంపెనీ 300 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంటు ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం అవుకు, సింగనపల్లె పరిధిలో 1,252 ఎకరాలను ‘క్లీన్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రైవేటు లిమిటెడ్’ పేరుతో లీజుకు తీసుకుంటున్నారు. అగ్రిమెంట్ నిబంధనలు పరిశీలిస్తే రైతులు తమ అవసరాల కోసం పొలం విక్రయించకుండానే శాశ్వతంగా భూములను దూరం చేసే కుట్ర జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.
⇒ ఇవీ నిబంధనలు..
⇒ రైతులు తమ భూమిని 29 ఏళ్ల 11 నెలలు లీజుకు ఇస్తున్నట్లు ఏటీఎల్ (అగ్రిమెంట్ లీజు) సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ చేయాలి.
⇒ లీజు గడువు ముగిసిన తర్వాత కంపెనీ లీజు పొడిగించుకోవాలని భావిస్తే రైతులకు ఇష్టం లేకపోయినా కచ్చితంగా ఒప్పుకుని తీరాల్సిందే.
⇒ లీజుకింద ఏడాదికి రూ.40 వేలు ఇస్తారు. రెండేళ్లకోసారి ఐదు శాతం పెరుగుతుంది.
⇒ భవిష్యత్తులో ఏదైనా సమస్యలు వస్తే ఆర్బిట్రేషన్ కోసం రైతులు ఢిల్లీకి వెళ్లాల్సిందే.
⇒ భూమిని కంపెనీ థర్డ్ పార్టీకి (మరొకరికి) లీజుకు ఇవ్వవచ్చు.
రైతన్నల పొలాలకు దారేది?
రాయలసీమలో సోలార్ విద్యుదుత్పత్తి కోసం కంపెనీలు ఇప్పటి వరకూ బీడు భూములను కొనుగోలు చేస్తున్నాయి. అయితే ఇప్పుడు లీజు పేరుతో వ్యవసాయ భూములను హస్తగతం చేసుకుంటున్నారు. సోలార్ కంపెనీ ఏర్పాటుతో మొత్తం భూములను చదును చేస్తారు. దీంతో సాగునీటి కాలువలు, పొలాల హద్దులు చెరిగిపోతాయి. కంపెనీ చుట్టుపక్కల పొలాలకు సాగునీటి వనరులు ఉండవు. దారులు కూడా మూసుకుపోతాయి. ఎవరైనా రైతు తన పొలం ఇచ్చేందుకు నిరాకరించి వ్యవసాయం చేసుకోవాలని ప్రయత్నిస్తే ఆ పొలానికి దారి లేకుండా చేస్తున్నారు.
‘చుట్టూ సోలార్ కోసం అందరూ పొలాలిస్తుంటే మీరొక్కరే ఎలా వ్యవసాయం చేస్తారు? దారి, నీళ్లు లేకుండా పొలంలోకి ఎలా వెళతారు..?’ అని కంపెనీ ప్రతినిధులు, మంత్రి బీసీ జనార్దనరెడ్డి అనుచరులు బెదిరిస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. మంత్రికి, కంపెనీకి వ్యతిరేకంగా నోరు విప్పేందుకు జంకుతున్నారు. భూములు లేకుంటే స్థానిక గొర్రెల కాపరులు మేత కోసం అల్లాడాల్సిందే. లెవలింగ్ పేరుతో పొలం గట్లను చదును చూస్తే రైతులకు దారి ఉండదు.

కంపెనీ చేతుల్లోకి..
వ్యవసాయ భూములను పరిశ్రమల కోసం లీజుకు ఇస్తే వ్యవసాయేతర భూమి కిందకు మారుతుంది. అప్పుడు రైతులు ఆస్తి పన్ను, ఆదాయపు పన్ను చెల్లించాలి. ఈ విషయాలను రైతులకు వివరించకుండా కంపెనీ దాగుడు మూతలు ఆడుతోంది. రైతుల నుంచి లీజుకు తీసుకున్న భూములనే బ్యాంకులో తనఖా పెట్టి రుణాలు తీసుకోవాలని హీరో కంపెనీ భావిస్తోంది. ఒకవేళ నష్టాలొచ్చి దివాళా తీస్తే ఆ రుణాలను ఎవరు చెల్లించాలి? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఆర్బిట్రేషన్ కోసం రైతులు ఢిల్లీకి వెళ్లగలరా? ఇక లీజు తర్వాత ఆ భూములు సాగు యోగ్యత కోల్పోతాయి. అందులోని సోలార్ మెటీరియల్ ఎవరు తొలగించాలి? ఎక్కడ పడేయాలి? ఆ ఖర్చు సంగతేమిటి? అనే వివరాలేవీ ఎంవోయూలో లేవు. రైతులకు దీనిపై అవగాహన కల్పించడం లేదు. లీజు ముగిసిందని రైతులు తమ పిల్లల పెళ్లిళ్లు, ఇతర అవసరాల కోసం పొలం విక్రయించుకోవాలంటే కుదరదు. కంపెనీ లీజు పొడిగించాలనుకుంటే రైతు ఒప్పుకుని తీరాల్సిందే! అంటే రైతుకు 30 ఏళ్ల తర్వాత కూడా తన భూమిపై హక్కు ఉండదని స్పష్టమవుతోంది.
సాగు భూముల్లో సోలార్..!
సోలార్ ప్లాంటు ఏర్పాటు చేస్తున్న ప్రాంతానికి సమీపంలో అవుకు రిజర్వాయర్ ఉంది. ఎస్‌ఆర్‌బీసీ 13వ బ్లాక్ నుంచి పొలాలకు నీరు అందుతుంది. ఇక్కడ మిరప, మొక్కజొన్న, జొన్న, వరి, ఉద్యాన పంటలు సాగు చేస్తారు. మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే పొలాలకు రిజర్వాయర్ నుంచి పూర్తిగా సాగునీటి వసతి కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లీజు అగ్రిమెంట్‌లో లొసుగులపై రైతుల తరఫున కంపెనీని ప్రశ్నించాలని సూచిస్తున్నారు.
అలా కాకుండా కంపెనీకి వత్తాసు పలుకుతూ రైతులకు మంత్రి అన్యాయం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో అవుకు, శింగనపల్లె రైతులను మంత్రి అనుచరుడు ఉగ్రనరసింహారెడ్డి బుజ్జగిస్తుండగా శింగనపల్లెలో భూములు ఉన్న చెన్నంపల్లె రైతులతో బిజ్జం పార్థసారథిరెడ్డి సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 600 ఎకరాలకు సంబంధించి రైతులతో సంప్రదింపులు పూర్తయ్యాయి. 80 ఎకరాలకు లీజు అగ్రిమెంట్లు పూర్తయ్యాయి. భూములను బలవంతంగా లాక్కుంటున్నారని రైతులు వాపోతున్నారు.
భూములు మావి.. లోన్లు మీకా?: కోట శంకర్‌రెడ్డి, రైతు శింగనపల్లె
లీజుకు తీసుకున్న మా భూములు బ్యాంకులో తాకట్టు పెట్టి లోన్ తీసుకుని ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తారట. 30 ఏళ్ల లీజు అంటే సగం జీవితం అయిపోతుంది. మా పిల్లలకు భూములు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. మా పొలాలు లీజుకు ఇవ్వాలంటూ ఒత్తిడి తెస్తున్నారు.
భూములిచ్చి కూలికి వెళ్లాలా?
సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తామని హీరో కంపెనీ మా ఊరిలో భూములు లీజుకు తీసుకుంటోంది. నాకు 2.20 ఎకరాలు ఉంది. పొలం అడిగితే ఇవ్వబోమని చెప్పా. తాతల కాలం నుంచి వ్యవసాయం చేస్తూ రైతుగా బతుకుతున్నాం. భూములిచ్చి కూలి పనికి వెళ్లాలా? సోలార్ ప్లాంటుతో భూములు చదును చేస్తే మా పొలాలకు నీళ్లు ఎలా? దారి ఎలా? రైతులను బాధ పెట్టొద్దు.
– లోకిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రైతు, శింగనపల్లె