
పతనమవుతున్న పూల ధరలు
కిలో రూ.10–12కి మించి పలకని వైనం
పండగ సీజన్‌లోనూ అదే దుస్థితి – వర్షాలతో దిగుబడీ అంతంతే.!
పెట్టుబడులు కూడా రాక రైతులు విలవిల
సాక్షి, అమరావతి: రాయలసీమ జిల్లాల్లో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ధర లేక ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తూనే ఉంది. అరటి, చినీ, టమాటా ధరలు కర్షకుల ఆశలు విరిచేస్తున్నాయి. తాజాగా బంతి పూల ధరలూ పతనం కావడం రైతులను మరింతగా కుంగదీస్తోంది. దీంతో ఏం చేయాలో పాలుపోక అప్పుల ఉబిలో కూరుకకుపోయి సీమ రైతులు గగ్గోలు పెడుతున్నారు.
పూల ఉత్పత్తి అంతా.. సీమ నుంచే..
రాష్ట్రంలో అన్ని పూలు కలిపి ఉత్పత్తి 10.88 లక్షల టన్నులు కాగా, ఒక్క రాయలసీమలోనే 7 లక్షల టన్నుల (64.39శాతం)కు పైగా ఉత్పత్తి అవుతుంది. బంతిపూల ఉత్పత్తిలోనూ రాయలసీమదే అగ్రస్థానం. ఏటా 1.12 లక్షల టన్నుల బంతిపూలు రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుండగా, ఒక్క రాయలసీమ జిల్లాల్లోనే 77 వేల టన్నులు ఉత్పత్తి అవుతాయి. బంతిపూల సాగు, ఉత్పత్తిలో టాప్–10 జిల్లాల్లో 8 జిల్లాలు రాయలసీమలోనే ఉన్నాయి. సాగులో వైఎస్సార్ కడప జిల్లా మొదటి స్థానంలో ఉండగా, ఉత్పత్తి పరంగా చిత్తూరు జిల్లా అగ్రస్థానంలో ఉంటుంది.
ఎకరాకు రూ.లక్షా 25వేలు పెట్టుబడి
సాధారణంగా ఎకరాకు రూ.16–18 వేల వరకూ బంతి మొక్కలు నాటతారు.. ఒక్కొక్క మొక్క ధర రూ.2–2.5కు తక్కువ ఉండదు. ఎకరాకు కేవలం మొక్కలకే రూ.40 వేలు ఖర్చు అవుతుంది. ఇక కోయడానికి కిలోకు రూ.6–7 చొప్పున ఖర్చు చేస్తారు. ఇతర ఖర్చులన్నీ కలుపుకుంటే ఎకరాకు పెట్టుబడి రూ.లక్షా 25వేల వరకు అవుతుందని కర్షకులు చెబుతున్నారు. సాధారణంగా దిగుబడి ఎకరాకు ఐదు టన్నుల వరకు వస్తుంది. అయితే ఈ ఏడాది వర్షాల వల్ల దిగుబడి మూడు టన్నులే వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
దసరా ఆరంభ సీజన్‌లోనూ ధర లేక
సాధారణంగా పండగ సీజన్‌లో బంతిపూలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దసరా పండగ సీజన్‌లో అయితే నవరాత్రుల తొమ్మిది రోజులూ ఆలయాల్లో అమ్మవారిని అలంకరించేందుకు బంతిపూలను ఎక్కువగా వాడతారు. దీంతో దసరా సీజన్ ప్రారంభమవుతుందంటే ఏటా బంతిపూలకు ఎక్కడ లేని డిమాండ్ వస్తుంది. రైతులు కూడా ఈ సీజన్ కోసం ఎదురు చూస్తుంటారు. పండగ సీజన్‌కు దిగుబడి వచ్చేలా సాగు చేస్తారు.
ఈ సీజన్‌లోనే మంచి ధర పలుకుతుందని, నాలుగు డబ్బులు వెనకేసువచ్చని ఆశతో ఉంటారు. అలాంటిది ఈ ఏడాది దసరా సీజన్ ప్రారంభమయ్యే తరుణంలో బంతి పూల ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. కిలో రూ.10–12కు మించి కొనే పరిస్థితి లేకుండా పోయింది. వినాయకచవితి పండగ రోజుల్లో రెండు రోజులు మాత్రమే కిలో రూ.50–60 ధర లభించగా, ఆ తర్వాత ధరలు పతనమవుతూ వచ్చాయి. కనీసం కిలోకు రూ.35–40 వస్తే కానీ రైతులకు పెట్టుబడులు దక్కవు. ప్రస్తుత ధరలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
గత ప్రభుత్వంలో రికార్డు స్థాయిలో ధర
వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో బంతిపూల ధరలు రికార్డుస్థాయిలో పలికాయి. కిలో రూ.80–120 మధ్య ధర లభించింది. 2019–24 మధ్యలో ఒక్క బంతిపూలే కాదు. రాష్ట్రంలో సాగయ్యే అన్ని రకాల పూలకు ఏటా గిట్టుబాటు ధరలు లభించడంతో రైతులు మంచి లాభాలనే ఆర్జించారు.
సంక్షోభంలో సీమ రైతులు
కూటమి ప్రభుత్వం వచి్చనప్పటి నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా పండ్లు, కూరగాయలతోపాటు పూల ధరల పతనంతో సీమ రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నారు. ఇప్పటికే ఉల్లి, అరటి, చినీ, టమాటా ధరలు పతనమైపోయాయి. తాజాగా ఈ బాటలో బంతిపూల రైతులు చేరారు.వరుసగా ధరల పతనంతో సీమలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.
ఇప్పటికే రాయలసీమలోని అన్నమయ్య జిల్లాలో 19శాతం చిత్తూరు 24శాతం, వైఎస్సార్ కడప 35శాతం, సత్య సాయి జిల్లాలో 42శాతం నామమాత్రపు విస్తీర్ణంలో ఖరీఫ్ పంటలు సాగయ్యాయి. ఇక్కడ ఎక్కువగా సాగయ్యే వేరుశనగ పూర్తిగా తగ్గిపోయింది. సాగు జరిగిన చోట కూడా వేరుశనగ, మినుము పంటలు దెబ్బతిన్నాయి. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ప్రకటించడంలో ప్రభుత్వం విఫలమైంది. – ఎంవీఎస్ నాగిరెడ్డి, మాజీ వైస్ చైర్మన్, ఏపీ వ్యవసాయ మిషన్