పరిహారం ఎంచక్కా.. నిషేధం పక్కా..

Enforce a fishing ban like never before - Sakshi

ఎన్నడూ లేని విధంగా చేపల వేట నిషేధం అమలు

స్వచ్ఛందంగా పాటిస్తున్న మత్స్యకారులు

సరైన సమయంలో ‘భృతి’ ఇవ్వడమే కారణం

పిఠాపురం: ఆకలితో ఉన్నవారికి గంజి నీళ్లు పోసినా పరమాన్నంలా స్వీకరిస్తారు. అలాంటిది పరమాన్నమే పెడితే.. ఇక వారి ఆనందానికి అవధులే ఉండవు. మత్స్యకారుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా అదే చేసింది. అవసరానికి ఆదుకుంది. సముద్రంలో చేపల వేట నిషేధం అమలవుతున్న సమయంలోనే.. మత్స్యకారులను కష్టాల సంద్రం నుంచి ఒడ్డుకు చేర్చేందుకు సకాలంలో భృతి పంపిణీ చేసింది. దీంతో, గతంలో పస్తులుండలేక నిషేధాన్ని ఉల్లఘించిన మత్స్యకారులే.. ఇప్పుడు స్వచ్ఛందంగా చేపల వేట నిషేధం పక్కాగా పాటిస్తున్నారు.

పస్తుల వేళ పట్టించుకోని గత ప్రభుత్వం
మత్స్యసంపద వృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14  వరకు 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటను నిషేధం అమలు చేస్తున్నాయి. వేట నిలిచిన సమయంలో మత్స్యకార కుటుంబాలు పూట గడవక ఆకలితో అలమటించేవి. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వేట నిషేధ సమయంలో కొంత పరిహారం ప్రకటించేవారు. కానీ పస్తులుంటున్న సమయంలో ఇచ్చేవారు కాదు. గత ప్రభుత్వ హయాంలో నిషేధం పూర్తయిన తరువాత ఎప్పటికో పరిహారం.. అది కూడా కేవలం రూ.4 వేలు ఇచ్చేవారు. పరిహారం సకాలంలో అందక, ఇచ్చినది చాలక.. పూట గడిచే దారి లేక మత్స్యకారులు అధికారుల కళ్లుగప్పి చేపల వేట సాగించేవారు. దీంతో నిషేధం నీరుగారేది.

ప్రస్తుతం ఇలా..
ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా కాకినాడలో నిర్వహించిన మత్స్యకారుల సమ్మేళనంలో నాటి విపక్ష నేత, నేటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వేట నిషేధ భృతిని రూ.10 వేలకు పెంచి, సకాలంలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దీనిని గత ఏడాది నుంచే అమలు చేస్తున్నారు. వేట నిషేధం అమలు ప్రారంభమైన వారం రోజుల్లోనే ఎటువంటి అవినీతికీ తావు లేకుండా, పార్టీలకు అతీతంగా ఈ వేట నిషేధ భృతి అందిస్తున్నారు. ఈ ఏడాది పరిహారం ఇప్పటికే మత్స్యకారుల ఖాతాలకు జమ చేశారు. దీంతో తమ కష్టాలు గట్టెక్కాయని మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ పోషణకు ఆర్థిక సహాయం సకాలంలో అందడంతో మత్స్యకారులు స్వచ్ఛందంగా వేట నిషేధం అమలు చేస్తున్నారు.

పక్కాగా నిషేధం అమలు
మత్స్యకారులు చేపల వేట నిషేధాన్ని స్వచ్ఛందంగా పాటిస్తున్నారు. దీంతో నిషేధం పక్కాగా అమలవుతోంది. గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది చేపల అక్రమ వేట లేదు. గతంలో మత్స్యశాఖతో పాటు పోలీసు, మెరైన్‌ అధికారులు దాడులు చేయాల్సి వచ్చేది. ఎక్కువ మంది నిషేధాన్ని ఉల్లంఘించి చేపల వేట సాగించే వారు. వారిపై కేసులు నమోదు చేసే వాళ్లం. ఇప్పుడా పరిస్థితి లేదు. ఎవరూ వేటకు వెళ్లడం లేదు. దీంతో అధికారులు దాడులు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. పరిహారం సక్రమంగా, సకాలంలో అందడమే దీనికి కారణంగా చెప్పవచ్చు.
– పి.వెంకట సత్యనారాయణ, జాయింట్‌ డైరెక్టర్, మత్స్యశాఖ, కాకినాడ

పరిహారం అంటే ఇలా ఇవ్వాలి
వేట నిలిపివేయండనేవారు. మా జీవనోపాధి ఆగిపోయేది. తిండి లేక అలమటించే వాళ్లం. అది కూడా రూ.4 వేల పరిహారం ఇస్తామనే వారు. అది కూడా నెలలు గడిచినా ఇచ్చేవారు కాదు. నిషేధ కాలం పూర్తయినా పరిహారం అందేది కాదు. దీంతో అప్పుల పాలయ్యేవాళ్లం. ఇప్పుడలా కాదు. వేట నిషేధం మొదలయిన వెంటనే పరిహారం ఇచ్చేశారు. నేతల సిఫారసులు లేవు. అవినీతి అసలే లేదు. పార్టీలని ఎక్కడా చూడలేదు. అందరికీ సక్రమంగా అందింది. ఇలా సకాలంలో పరిహారం ఇస్తే ఇక మేం ఎందుకు తప్పు చేస్తాం? ఎంతో ఆనందంగా మా బతుకులు బతుకుతున్నాం. పరిహారం అంటే ఇలా ఇవ్వాలి. అంతే కానీ ఎప్పుడో ఇచ్చేది పరిహారం ఎలా అవుతుంది?
– బెనుగు శ్రీను, మత్స్యకారుడు, కోనపాపపేట

అవసరానికి ఆదుకుంటున్నారు
ఇస్తానన్న పరిహారం సరైన సమయానికి ఇచ్చేస్తున్నారు. అవసరానికి ఆదుకుంటే పక్కదారులు పట్టాల్సిన అవసరం ఏముంటుంది. అందుకే ఎవరూ చేపల వేట నిషేధాన్ని కాదని వేటకు వెళ్లడం లేదు. గతంలో తక్కువ వచ్చేది. ఇప్పుడు సరిపడినంత పరిహారం ఇస్తున్నారు. దీంతో ఇబ్బందులు లేకుండా రెండు నెలలూ గడుస్తున్నాయి. మా కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించి, ఆదుకోవడంతో ఇంటిల్లిపాదీ ఆనందంగా ఉంటున్నాం. గతంలో పరిహారం సక్రమంగా అందక దొంగచాటుగా చేపల వేటకు వెళ్లే వారు. 
– కుప్పిరి స్వామి, మత్స్యకారుడు, కోనపాపపేట 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top