ఆర్బీకేలతో ‘సహకారం’ | CM Jagan High level review on activities of Co-operative Department | Sakshi
Sakshi News home page

ఆర్బీకేలతో ‘సహకారం’

Feb 25 2022 3:08 AM | Updated on Feb 25 2022 6:47 PM

CM Jagan High level review on activities of Co-operative Department - Sakshi

సహకార బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను మరింతగా బలోపేతం చేయడానికి ఆర్బీకే వ్యవస్థను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. ఇందుకు ఆర్బీకేల్లో ఉన్న కియోస్క్‌లను సద్వినియోగం చేసుకోవాలి. రైతులకు సంబంధించిన డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేసేలా కియోస్క్‌ల్లో మార్పులు చేయాలి. అటు ఖాతాదారులు, ఇటు బ్యాంకులకు మేలు జరిగేలా పటిష్టమైన ఎస్‌ఓపీలు రూపొందించాలి.    
 – సీఎం వైఎస్‌ జగన్‌ 

సాక్షి, అమరావతి: ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్‌)ను ఆర్బీకేలతో అనుసంధానం చేయడం ద్వారా రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేలా ప్రొఫెషనల్‌గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రతి మండలంలో పీఏసీఎస్‌లను మ్యాపింగ్‌ చేసి, వాటి పరిధిలోకి ఏయే ఆర్బీకేలు వస్తాయో నిర్ణయించాలని చెప్పారు. తద్వారా బ్యాంకింగ్‌ కార్యకలాపాలు ఆర్బీకేల ద్వారా సాగుతాయని, రైతులకు రుణ సదుపాయం మరింత అందుబాటులోకి వస్తుందన్నారు. రాష్ట్రంలో సహకార శాఖ కార్యకలాపాలకు సంబంధించి జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల పనితీరు, వాటి బ్రాంచ్‌లు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పనితీరుపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే ఆర్బీకేల్లో ఉన్న బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లు రైతులకు, బ్యాంకులకు మధ్య అనుసంధాన కర్తగా వ్యవహరించాలన్నారు. అంతిమంగా ఆర్బీకేలు, ఆర్బీకేల్లోని బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లు.. రైతులకు, బ్యాంకులకు మధ్య ప్రతినిధులుగా వ్యవహరిస్తారని చెప్పారు. ఈ వ్యవస్థ ఎలా ఉండాలన్న దానిపై అధికారులు బ్యాంకింగ్‌ నిపుణులతో మాట్లాడి స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని ఆదేశించారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. 

పోటీకి తగ్గట్టుగా తీర్చిదిద్దాలి 
► బ్యాంకింగ్‌ రంగంలో పోటీని ఎదుర్కొనేలా జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (డీసీసీబీలు), ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను మరింత బలోపేతం చేయాలి. పోటీని తట్టుకునేందుకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో రుణాలు ఇవ్వాలి. 
► నాణ్యమైన రుణ సదుపాయం ఉంటే బ్యాంకులు బాగా వృద్ధి చెందుతాయి. మంచి ఎస్‌ఓపీ (స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌)లను పాటించేలా చూడటంతో పాటు డీసీసీబీలు లాభాల బాట పట్టేలా చర్యలు తీసుకోవాలి. డీసీసీబీలు పటిష్టంగా ఉంటేనే రైతులకు, ప్రజలకు మేలు జరుగుతుంది. 

సహకార బ్యాంకులను కాపాడుకోవాలి 
► సహకార బ్యాంకులు మన బ్యాంకులు. వాటిని మనం కాపాడుకోవాలి. తద్వారా తక్కువ వడ్డీలకు రుణాలు వస్తాయి. దీనివల్ల ప్రజలకు, రైతులకు మేలు జరుగుతుంది. ఎంత వీలైతే అంత తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వండి. బంగారంపై రుణాలు ఇచ్చి మిగిలిన బ్యాంకులు వ్యాపార పరంగా లబ్ధి పొందుతున్నాయి. ఈ రుణాలపై కచ్చితమైన భద్రత ఉన్నందున వాటికి మేలు చేకూరుతోంది. ఇలాంటి అవకాశాలను సహకార బ్యాంకులూ సద్వినియోగం చేసుకోవాలి. వాణిజ్య బ్యాంకులు, ఇతర బ్యాంకుల కన్నా తక్కువ వడ్డీకే బంగారంపై రుణాలిలిచ్చి ఖాతాదారులను తమ వైపునకు తిప్పుకోవచ్చు. తద్వారా అటు ఖాతాదారులకు, ఇటు సహకార బ్యాంకులకు మేలు జరుగుతుంది.

ప్రతి రైతుకూ మేలు జరగాలి 
► జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, సొసైటీల్లో చక్కటి యాజమాన్య విధానాలను తీసుకురావాలి. అంతిమంగా ప్రతి ఎకరా సాగు చేస్తున్న ప్రతి రైతుకూ మేలు జరగాలి. ఈ లక్ష్యం దిశగా సొసైటీలను నడిపించాలి. ఈ మేరకు ప్రతిపాదనలను మరింత మెరుగ్గా తయారు చేసి నాకు (సీఎంకు) నివేదించాలి. 
► వ్యవసాయ సలహా మండళ్ల సమావేశాల్లో బ్యాంకింగ్‌ రంగంపై రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులు, సలహాలు, సూచనలు కూడా స్వీకరించి వాటిపై తగిన విధంగా చర్యలు తీసుకోవాలి. సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఏపీ అగ్రికల్చ ర్‌ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీయస్‌ నాగిరెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి వై మధుసూధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ఖాతాదారులకు విశ్వాసం కలిగించాలి 
► వ్యవసాయ రంగంలో ఆర్బీకేల్లాంటి విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు ఈ రంగంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే వాటిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. రుణాల మంజూరులో  రాజీ వద్దు. రాజకీయాలకు చోటు ఉండకూడదు.  
► అవినీతికి, సిఫార్సులకు తావు లేకుండా జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల కార్యకలాపాలు సాగాలి. నిబంధనలు పాటిస్తున్నారా? లేదా? అన్నది చాలా ముఖ్యం. పాలనలో సమర్థతతో పాటు, అవినీతి రహిత, నాణ్యమైన సేవలు అందితేనే ప్రజలకు మేలు జరుగుతుంది. లేదంటే ప్రజలకు నష్టం వాటిల్లుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement