
ఇప్పటికే లక్ష్యానికి దూరంగా పంటల సాగు
అదునుకు విత్తనం... యూరియా అందక అగచాట్లు
పెట్టుబడికి రుణాలు దొరక్క పడరాని పాట్లు
దేశవ్యాప్తంగా ఖరీఫ్ సాగులో అట్టడుగున ఏపీ
జాతీయ స్థాయిలో 97.93 శాతం విస్తీర్ణంలో పంటలు
తెలంగాణలో 93.7 శాతం దాటిన తొలకరి సాగు
ఏపీలో నిర్దేశిత లక్ష్యంలో 64 శాతం కూడా దాటని వైనం
లక్ష్యం 86 లక్షల ఎకరాలు... సాగు 55 లక్షల ఎకరాల్లోనే
10 జిల్లాల్లో నేటికీ 15–50 శాతం విస్తీర్ణంలోనే పంటలు
రాయల సీమలో వేరుశనగకు దాటిపోయిన అదును
14.30 లక్షల ఎకరాలకు 4.20 లక్షల ఎకరాల్లోనే పంట
ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ఊసెత్తని ప్రభుత్వం
ఇప్పటికే కనీస మద్దతు ధర లేక ఉల్లి రైతుకు నష్టాలు.. దిగుమతి సుంకం ఎత్తివేతతో పత్తికి ధర దక్కడం కష్టమే
ఇతర పంటలకూ మద్దతు ధర వచ్చే అవకాశాల్లేక రైతుల గగ్గోలు.. నెల్లూరులో కొనుగోలు కేంద్రాల కోసం రోడ్డెక్కిన ధాన్యం రైతులు
సమయానికి వర్షాలు లేవు...
అదునుకు విత్తనమూ దొరకలేదు... పెట్టుబడికి ప్రభుత్వం పైసా సాయం అందించలేదు... అయినా పుడమి తల్లిని నమ్ముకుని... పుట్టెడు కష్టాలను దాటుకుని... అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పంటలు సాగు చేస్తున్నారు
రాష్ట్ర రైతులు..!
ఇంటిల్లిపాది రెక్కలు ముక్కలు చేసుకుంటూ... ఆరుగాలం శ్రమిస్తున్న అన్నదాతలకు టీడీపీ కూటమి ప్రభుత్వం నుంచి కనీస తోడ్పాటు కరువైంది..! ప్రతికూల వాతావరణ పరిస్థితులకు ఎదురొడ్డి ఖరీఫ్ సాగు చేస్తున్న రైతులకు ‘నేనున్నాను’ అనే భరోసా కల్పించలేకపోతోంది..! డిమాండ్‌కు సరిపడా యూరియా ఇతర ఎరువులు సరఫరా చేయడంలో సర్కారు చేతులెత్తేసింది..! ఫలితంగా బ్లాక్ మార్కెట్‌లో ఎక్కువ ధరకు కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
ముందే మురిపించిన వరుణుడు... ఖరీఫ్ సీజన్ మొదలయ్యాక మబ్బుల చాటుకు వెళ్లిపోయాడు... దాదాపు రెండు నెలల పాటు మొహం చాటేశాడు...! ఇప్పుడేమో 20 రోజులుగా అధిక వర్షాల ప్రభావంతో పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా తిప్పలు పడుతున్నారు. ఇంతటి తీవ్ర ఒడిదుడుకుల మధ్య అన్నదాతలను... ఆదిలోనే పతనమైన ఉల్లి ధరలు కలవరపెడుతున్నాయి. పండించిన పంటలకు మద్దతు ధర కల్పించలేని దుస్థితిలో ఉన్న రాష్ట్ర సర్కారు తీరు ఆందోళనకు గురిచేస్తోంది.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖరీఫ్ పంటలు పండిస్తున్న రైతుల పరిస్థితి దినదిన గండంగా మారింది. ప్రభుత్వ నిర్వాకంతో మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతోంది. గత ఏడాది మాదిరిగానే అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు అన్నదాతల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మొదట్లో వర్షాభావం నెలకొన్నా, ఆశాభావంతో పెట్టుబడులకు అప్పులు తెచ్చి మరీ పంటలు వేసిన రైతులు ఇప్పుడు యూరియా, ఇతర ఎరువులు దొరక్క అగచాట్లు పడుతున్నారు. మరీ ముఖ్యంగా డిమాండ్‌కు తగ్గట్లు యూరియా అందడం లేదు. ఇదిగో వచ్చేస్తోంది.. అదిగో వచ్చేస్తోంది అంటూ కబుర్లతో కాలక్షేపమే తప్ప ప్రభుత్వం అదునుకు అందించలేకపోతోంది.
అన్నదాత సుఖీభవ అరకొర
ఎన్నికల్లో ఇచ్చిన హామీని తుంగలో తొక్కి అన్నదాత సుఖీభవ కింద అరకొరగా పెట్టుబడి సాయం చేసింది కూటమి ప్రభుత్వం. పెట్టుబడికి అవసరమైన రుణాలను కూడా పూర్తిస్థాయిలో ఇవ్వలేదు.ఖరీఫ్‌లో రూ.3.06 లక్షల కోట్ల రుణ లక్ష్యం కాగా సీజన్ ప్రారంభమై మూడు నెలలు గడిచిన తర్వాత కూడా రూ.94 వేల కోట్లకు మించి ఇవ్వని దుస్థితి నెలకొంది. కౌలు రైతుల పరిస్థితి మరీ ఘోరం. రూ.8 వేల కోట్ల రుణ లక్ష్యం కాగా రూ.985 కోట్లకు మించి ఇవ్వలేదు. అదికూడా జేఎల్‌జీ గ్రూపులకు మాత్రమే ఇచ్చారు.
ఎరువులనూ మేస్తున్న పచ్చముఠాలు!
వ్యవసాయం కోసం సరఫరా చేస్తున్న యూరియాను క్షేత్ర స్థాయిలో టీడీపీ నేతలు నిస్సిగ్గుగా పక్కదారి పట్టిస్తున్నారు. అయినా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 5.75 లక్షల టన్నుల ఎరువులుండగా, ఇందులో యూరియా 1.15 లక్షల టన్నులు, డీఏపీ 80 వేల టన్నులే కావడం గమనార్హం. ఇక రాష్ట్రానికి కేటాయించే ఎరువుల్లో 70–80 శాతం వ్యాపారులకు సరఫరా చేస్తున్నారు. వాళ్లు ఇష్టమొచ్చినట్టు ఎమ్మార్పీకి మించి వసూలు చేస్తూ రైతులను నిలువునా దోచుకుంటున్నారు. రైతు సేవా కేంద్రాలు కాదు కదా కనీసం సహకార సంఘాల్లో కూడా ఎరువులు దొరకని పరిస్థితి నెలకొంది.
జాడలేని ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక
ఖరీఫ్‌లో రాయితీయేతర (నాన్ సబ్సిడీ) విత్తనాల పంపిణీని అటకెక్కించిన కూటమి ప్రభుత్వం కనీసం సబ్సిడీ విత్తనాన్ని కూడా పూర్తిగా సరఫరా చేయలేక చేతులెత్తేసింది. ఈ సీజన్‌కు 6.32 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనం అవసరం. కానీ, దాదాపు 1.10 లక్షల క్వింటాళ్ల మేర కోత పెట్టారు. 5.22 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తన కేటాయింపులు జరపగా, 4 లక్షల క్వింటాళ్లను నిల్వ చేసి, 3.50 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని పంపిణీ చేశారు. ఇండెంట్ ప్రకారం... 3 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనం అవసరం కాగా, లక్ష క్వింటాళ్లకు పైగా కోతపెట్టి 1.80 లక్షల క్వింటాళ్లనే అందజేశారు. 2.27 లక్షల క్వింటాళ్లకు 1.60 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాన్ని పొజిషన్ చేయగా, 1.35 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని మాత్రమే అందించారు.
⇒ వర్షాభావ పరిస్థితులతో వేరుశనగ సాగవని రాయలసీమ జిల్లాల్లో కనీసం ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అమలు చేయాలన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి లేకుండా పోయింది. లక్షలాది ఎకరాలు సాగుకు దూరంగా బీడువారి పోతున్నా సీఎం చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష చేసిన పాపాన పోలేదు.
⇒ 20 రోజులుగా కురుస్తున్న అధిక వర్షాలకు తోడు కృష్ణ, గోదావరికి పోటెత్తిన వరదతో లక్షలాది ఎకరాలు ముంపు బారిన పడ్డాయి. ప్రాథమిక అంచనా ప్రకారమే 2 లక్షల ఎకరాల్లో పంటలు మునిగాయి. ఇలాంటి సందర్భాల్లో 80 శాతం సబ్సిడీపై శాస్త్రవేత్తల సూచన మేరకు ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించిన విత్తనాలను పంపిణీ చేయాలి. కానీ, ఆ ఆలోచన కూడా చేయడం లేదు.
ఇలాగైతే అనగనగా వేరుశనగనే..
రాయలసీమ జిల్లాల్లో మాత్రమే సాగయ్యే వేరుశనగ లక్ష్యం మాట దేవుడెరుగు... సాధారణ విస్తీర్ణంలో నాలుగో వంతు కూడా సాగవని దుస్థితి నెలకొంది. వేరుశనగ సాధారణ విస్తీర్ణం 12.97 లక్షల ఎకరాలు కాగా, ఈ ఏడాది 14.30 లక్షల ఎకరాలు లక్ష్యంగా నిర్దేశించారు. సాగైంది 4.20 లక్షల ఎకరాలు మాత్రమే. అంటే సాధారణ విస్తీర్ణంలో 34 శాతం. నిర్దేశించిన లక్ష్యంలో 29.37 శాతం దాటలేదు. ఈ పంటకు అదును దాటిపోయింది. జాతీయ స్థాయిలో 1.13 కోట్ల ఎకరాల సాగు అంచనా కాగా, ఏపీ మినహా మిగిలిన రాష్ట్రాల్లో లక్ష్యానికి మించడం గమనార్హం.
మళ్లీ వలసలే గతి...
⇒ హెక్టార్‌లో వేరుశనగ సాగు జరిగితే కనీసం 75–100 పనిదినాలు లభిస్తాయి. నూనె గింజల సాగు తగ్గిన ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుంటే దాదాపు 5 లక్షలకు పైగా పనిదినాలు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. దీంతో ఈ ప్రాంత రైతులు, రైతు కూలీలు మళ్లీ వలస బాట పట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు వేరుశనగ, మినుము కొంత అనావృష్టి, కొంత అతివృష్టితో దెబ్బతిన్నాయి. దిగుబడులు కూడా సగానికి పడిపోతాయని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఆ మేరకు రాష్ట్రానికి సంబంధించిన జాతీయ స్థూల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.
⇒ ఖరీఫ్ సాగులో గడిచిన సమయం 12 వారాలు
⇒ జాతీయ స్థాయిలో అన్ని పంటల సాగు అంచనా 27.42 కోట్ల ఎకరాలు
⇒ఇంకా మిగిలిన వ్యవధి 4 వారాలు
⇒ పంటలు సాగైన విస్తీర్ణం 26.85 కోట్ల ఎకరాలు(దాదాపు 97.93 శాతం)
⇒గత ఏడాదితో పోలిస్తే పెరిగిన సాగు విస్తీర్ణం: 88.5 లక్షల ఎకరాలు
⇒తెలంగాణలో సాగు అంచనా: 1.32 కోట్ల ఎకరాలుఇప్పటికే సాగైన విస్తీర్ణం 1.24 కోట్ల ఎకరాలు (సుమారు 94 శాతం):
⇒ ఏపీలో సాధారణ సాగు విస్తీర్ణం 77.87 లక్షల ఎకరాలు
⇒ ఈ ఖరీఫ్ సాగు లక్ష్యం: 86.32 లక్షల ఎకరాలు
⇒ ఇప్పటివరకు సాగైన విస్తీర్ణం 55 లక్షల ఎకరాలు (సాధారణ విస్తీర్ణంతో పోల్చుకుంటే 71% నిర్దేశించిన లక్ష్యంలో 64% మించి సాగవని పరిస్థితి)
⇒నేటికీ 1550 శాతం మధ్యే పంటలు సాగైన జిల్లాలు: 10
ప్రధాన పంటల తీరు ఇలా (లక్షల ఎకరాల్లో..)
రాష్ట్రంలో వరి సాధారణ సాగు విస్తీర్ణం: 36.37
ఈ ఏడాది సాగు లక్ష్యం: 38.87
ఇప్పటికి సాగైనది: 29.97 (వరి జాతీయ స్థాయిలో 104.26 శాతం సాగైతే.. ఏపీలో 72% కూడా లేదు)వరితో సహా ఇతర ఆహార
ధాన్యాల సాగు విస్తీర్ణం: 50 లక్షల ఎకరాలు
సాగు లక్ష్యం: 54.32 లక్షల ఎకరాలు
ఇప్పటివరకు సాగైన విస్తీర్ణం: 40 లక్షల ఎకరాలునూనె గింజల సాధారణ సాగు విస్తీర్ణం 13.87 లక్షల ఎకరాలు
ఈ ఏడాది లక్ష్యం: 16.65 లక్షల ఎకరాలు సాగైనది కేవలం 5.20 లక్షల ఎకరాలు మాత్రమే పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 13.20 లక్షల ఎకరాలు నిర్దేశించిన సాగు లక్ష్యం
14 లక్షల ఎకరాలుఇప్పటివరకు సాగైనది 9.67 లక్షల ఎకరాలు
వరుసగా అతివృష్టి.. అనావృష్టి
ఆగస్టు 30 నాటికి కురవాల్సిన వర్షపాతం 415.11 మి.మీ. కురిసినది 394.46 మి.మీ. లోటు 4.97 శాతం. కానీ 8 జిల్లాల్లో సాధారణం కంటే
20 శాతం అధికంగా, మిగిలిన జిల్లాల్లో 19 శాతం తక్కువగా నమోదైంది.
⇒ సాధారణ విస్తీర్ణం వరకు చూసుకున్నా రాయలసీమలోని అనంతపురంలో 64, శ్రీ సత్యసాయిలో 37, వైఎస్సార్ కడపలో 24, చిత్తూరులో 19, అన్నమయ్యలో 15 శాతం మేర పంటలు సాగయ్యాయి. ప్రకాశంలో 31, అనకాపల్లిలో 39, పల్నాడు, విశాఖలో 51, బాపట్లలో 56 శాతం మేర పంటలు సాగయ్యాయి.
⇒ రాయలసీమ జిల్లాల వరకు చూస్తే సాధారణ విస్తీర్ణం 28.18 లక్షల ఎకరాలు కాగా, సాగైంది 8.77 లక్షల ఎకరాలే. కర్నూలు, నంద్యాలలో కాస్త మెరుగైన వర్షపాతం నమోదు కావడంతో ఈ మాత్రమైనా సాగైంది.
మద్దతు ధర కోసం ఆదిలోనే అగచాట్లు
⇒ రాష్ట్రంలో గత 2024–25 సీజన్‌లో ధాన్యంతో సహా ఏ ఒక్క పంటకూ మద్దతు ధర దక్కలేదు. కనీసం ఈ దిశగా అయినా కూటమి ప్రభుత్వం ప్రయత్నించలేదు. కొనే నాథుడు లేకుండాపోయారు.
⇒ మిరప, పొగాకు, కోకో, మామిడి తదితర ప్రధాన పంటలు సాగు చేసిన రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. పెద్దఎత్తున ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మిరపతో పాటు తోతాపురి మామిడికి మద్దతు ధర విషయంలో ప్రభుత్వ పెద్దలు ఆడిన దొంగ నాటకాలను చూసి రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
⇒ ఈ సీజన్‌లో అయినా పంటలకు మద్దతు ధర దక్కుతుందన్న నమ్మకం అన్నదాతల్లో కలగడం లేదు. ఆదిలోనే పతనమైన ధరలతో ఉల్లి రైతులు తీవ్ర నష్టాలను చూవిచూస్తున్నారు. దిగుమతి సుంకం ఎత్తివేతతో పత్తికి కనీస మద్దతు ధర దక్కే అవకాశాల్లేవనే కథనాలు భయపెడుతున్నాయి.
⇒ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనేవారు లేక రైతులు గగ్గోలు పెడుతున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం రోడ్డెక్కి ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. ధాన్యం సహా సాగైన పంట ఉత్పత్తులు మార్కెట్‌కు వచ్చే సమయానికి కనీస మద్దతు ధరలు దక్కుతాయో లేదో అనే ఆందోళన రైతుల్లో నెలకొంది.