
టీడీపీ కూటమి సర్కారు వచ్చాక 2,191 ఎంఎస్‌ఎంఈ యూనిట్లు మూత
పార్లమెంటు సాక్షిగా కేంద్ర ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ వెల్లడి
ఏ ఏడాది రాయితీలు ఆ ఏడాదే చెల్లిస్తామన్న మాటలు ఒట్టిదే
ముడి సరుకుల ధరలతోపాటు ప్రభుత్వ విద్యుత్ చార్జీల పోటు
ప్రభుత్వ తీరుతో దాదాపు 30 వేల మంది ఉపాధి కోల్పోయినట్లు అంచనా
కోవిడ్ సమయంలో ఎంఎస్‌ఎంఈలు మూతపడకుండా రీస్టార్ట్ ప్యాకేజీతో ఆదుకున్న వైఎస్ జగన్ ప్రభుత్వం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలు తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. టీడీపీ కూటమి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఇవి తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. ఫలితంగా.. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ యూనిట్లు ఇప్పుడు తెగ మూతపడుతున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖే సాక్షాత్తు పార్లమెంటులో ఇటీవలే వెల్లడించింది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఈ ఏడాది జూలై 28 వరకు మొత్తం 2,191 ఎంఎస్‌ఎంఈ యూనిట్లు మూతపడినట్లు తెలిపింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 1,401 యూనిట్లు ఈ ఆరి్థక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లోనే 790కి పైగా యూనిట్లు మూతపడ్డాయంటే రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధంచేసుకోవచ్చు. ఎంఎస్‌ఎంఈలు ఇలా మూతపడుతుండటంతో సుమారుగా 30,000 మంది ఉపాధి కోల్పోయినట్లు అంచనా.
షాక్ కొడుతున్న విద్యుత్ బిల్లులు..
టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి రాగానే బిల్లుల రూపంలో ఎంఎస్‌ఎంఈలకు గట్టిగా కరెంట్ షాక్ ఇచ్చింది. ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఏపీలోని ఎంఎస్‌ఎంఈలపై విద్యుత్ బిల్లుల భారం విపరీతంగా పెరిగిపోయింది. అలాగే, పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వకపోవడం, మానవ వనరుల కొరత, ముడి సరుకుల ధరలు పెరుగుదల, ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వంటివి వీటిని వెంటాడుతున్నాయి.
విజయవాడ కేంద్రంగా పనిచేసే ఒక ఎంఎస్‌ఎంఈకి సగటున యూనిట్ ఛార్జీ రూ.13.55 పడితే అదే తమిళనాడులో సగటున యూనిట్ ధర 7–8లుగా ఉంది. అంటే యూనిట్‌కు దాదాపు రూ.6 అదనం. ఈ స్థాయిలో విద్యుత్ బిల్లులు బాదితే ఇతర రాష్ట్రాలతో ఎలా పోటీపడాలని ఆ సంస్థ ప్రతినిధి వాపోయారు.
ప్రోత్సాహకాల ఊసేలేదు..
ఇక అధికారంలోకి వచ్చిన వెంటనే ఏ ఏడాది ప్రోత్సాహకాలు ఆ ఏడాదే ఇచ్చేస్తాం.. ఇందుకోసం ప్రత్యేకంగా కార్పస్ ఫండ్ పెడుతున్నామన్న చంద్రబాబు, ఇతర కూటమి నేతల మాటలు నీటిమూటలయ్యాయి. సుమారు రూ.10,000 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాల్లో కనీసం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ఇవి ఇవ్వకపోగా వీటిని అడగడానికి వెళ్లిన పారిశ్రామిక ప్రతినిధులను అధికారులు పీ–4 దత్తత అంటూ వేధిస్తున్నారని వారు వాపోతున్నారు.
పరిశ్రమ నడపడానికి, జీతాలివ్వడానికి మా దగ్గర డబ్బుల్లేవని చెబుతున్నా.. ఆ సంగతి తర్వాత చూద్దాంలే ముందు రెండొందల బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటన చేయమనడంతో చేసేదిలేక మొక్కుబడిగా ప్రకటన చేసి వచ్చేసినట్లు మరో పారిశ్రామిక ప్రతినిధి చెప్పారు. దీన్నిబట్టి రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్ధంచేసుకోవచ్చు. ఇంకోపక్క ఎంఎస్‌ఎంఈల ఉత్పత్తులను ప్రభుత్వ శాఖలు కూడా కొనుగోలు చేయకపోవడం, ప్రభుత్వ అసమర్థ విధానాలతో ప్రజల్లో కొనుగోలు శక్తిపడిపోవడంతో ఈ ప్రభావం ఎంఎస్‌ఎంఈ యూనిట్లపై ప్రత్యక్షంగా పడుతోంది.
కోవిడ్ వంటి సంక్షోభం వచ్చినా ఏ ఒక్క పరిశ్రమ మూతపడకూడదన్న ఉద్దేశంతో గత వైఎస్ జగన్ ప్రభుత్వం రీస్టార్ట్ ప్యాకేజీతో ఆదుకుంది. కానీ, ఇప్పుడు ఈ ప్రభుత్వం మా ప్రోత్సాహకాలు మాకివ్వండని అడిగితే బ్యాంకు నుంచి రూ.5 వేల కోట్ల అప్పు తీసుకుంటున్నాం.. రాగానే ఇస్తామని చెప్పి ఆరునెలలు దాటినా చిల్లిగవ్వ ఇవ్వలేదని పారిశ్రామికవేత్తలు మండిపడుతున్నారు.
సకాలంలో ప్రోత్సాహకాలు విడుదల చేయాలి..
రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈలు అనేక గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం, అధిక విద్యుత్ ఛార్జీలు, ప్రభుత్వ శాఖల కొనుగోళ్లు లేకపోవడం, టెక్నాలజీ అప్‌గ్రెడేషన్ లేకపోవడం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈలను ఆదుకోవడానికి తమిళనాడు తరహా విధానం అమలుచేయాలంటూ ఇప్పటికే ప్రభుత్తానికి ఒక నివేదిక ఇచ్చాం. సకాలంలో ప్రోత్సాహకాలు విడుదలచేసి మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. – వి. మురళీకృష్ణ, ప్రెసిడెంట్, ఫ్యాఫ్సియా