మిరపకు విల్డ్ తెగులు
● ఎండిపోతున్న పంట
● మందులు వాడిని అదుపు కాని వైనం
ఉరవకొండ: కీలక దశలో విల్డ్ తెగులు ఆశించడంతో మిరప పంట ఎండిపోతోంది. ఎన్ని మందులు వాడిని తెగులు అదుపులోకి రావడం లేదు. చేసేదిలేక రైతులు పంటను తొలగిస్తున్నారు. హెచ్చెల్సీ, జీబీసీ, హంద్రీ–నీవా కాలువ కింద, బోర్ల సౌకర్యం ఉన్న భూముల్లో 30 వేల ఎకరాల్లో వాణిజ్య పంటగా మిరప వేశారు. ఇందులో అత్యధికంగా ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు, బెళుగుప్ప, కణేకల్లు మండలాల్లో సాగు చేశారు. ఎకరాకు రూ.1.20 లక్షల దాకా పెట్టుబడి పెట్టి మిరపను సాగు చేశారు. ప్రస్తుతం కాయ, పూత దశలో విల్డ్ తెగులు ఆశించడంతో పంట ఒక్కసారిగా ఎండిపోతోంది. మొదట వేర్లకు సోకి కుళ్లిపోవడం ప్రారంభమవుతోంది. ఒక్క మొక్కకు ఈ వైరస్ సోకి రోజుల వ్యవధిలోనే వ్యాప్తి చెంది ఎక్కడికక్కడే మొక్కలు ఎండిపోతున్నాయి. ఎన్ని మందులు పిచికారీ చేసినా ఫలితం లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు.
పంటను దున్నేసిన రైతులు
మండల పరిధిలోని ఇంద్రావతి, మోపిడి గ్రామాల్లో పలువురు రైతులు 30 ఎకరాల్లో సాగు చేసిన మిర్చి పంట విల్డ్ తెగులు సోకి ఎండిపోతుండటంతో ఏం చేయాలో తెలియక రైతులు ట్రాక్టర్‌తో దున్నేశారు. లక్షలాది రూపాయల పెట్టుబడులు పెట్టి ఎంతో జాగ్రత్తగా పంట సాగు చేస్తే విల్డ్ తెగులు ఇలా నాశనం చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రబుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇంద్రావతి వద్ద ట్రాక్టర్‌తో పంటను దున్నేస్తున్న రైతు
వాతావరణంలో మార్పులతోనే..
వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఉదయం మంచు ప్రభావం ఎక్కవగా ఉండటం వల్ల మిర్చికి తెగుళ్లు ఆశించాయి. రైతులు యాజమాన్య పద్ధతులు పాటిస్తే తెగుళ్లు నివారించవచ్చు. మూడు గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ ఒక లీటరు నీటితో కలిపి మొక్కల మొదల్లో పిచికారీ చేయాలి. నత్రజని ఎరువులు తగ్గించుకుంటే మంచిది. కొమ్మ ఎండు, కాయ కుళ్లుకు ఒక ఎంఎల్ ప్రొపికోనజోల్ 0.5 ఎంఎల్ డైఫోన్కోనజోల్ ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
– యామిని, హార్టికల్చర్ అధికారి,
ఉరవకొండ
గత్యంతరం లేక దున్నేశా..
నేను ఐదు ఎకరాల విస్తీర్ణంలో 5531 తేజ రకం మిర్చి సాగు చేశాను. మందుల పిచికారి, ఎరువులు, ఇతరత్రా ఖర్చులన్నీ కలిపి ఎకరాకు రూ1.20 లక్షల దాకా పెట్టుబడి పెట్టాను. పంట కీలక దశకు చేరుకున్నా విల్డ్ తెగులు సోకింది. కళ్లెదుటే పంట ఎండిపోతోంది. నివారణ చర్యలు చేపట్టినా తెగులు అదుపులోకి రాలేదు. గత్యంతరం లేక ట్రాక్టర్‌తో పంటంతా దున్నేశాను.
– నరసింహులు, మోపిడి
మిరపకు విల్డ్ తెగులు


