వైభవంగా హనుమాన్ శోభాయాత్ర
గుంతకల్లు: హనుమన్ శోభయాత్ర వైభవంగా జరిగింది. హనుమాన్ మాలధారులు 40 రోజుల దీక్ష అనంతరం మంగళవారం ఇరుముడి సమర్పణ చేపట్టారు. తొలుత మండల పరిధిలోని ఎన్.తిమ్మాపురం సమీపంలోని ఆంజనేయస్వామి దేవాలయం వద్ద నుంచి ర్యాలీగా గుంతకల్లులోని బళ్లారి గేట్ సమీపంలోని అభయాంజనేయస్వామి విగ్రహం వద్దకు చేరుకున్నారు. అనంతరం అక్కడ నెట్టికంటి ఆంజనేయస్వామి ఉత్సవ విగ్రహాన్ని రథంపై కొలువుదీర్చారు. బెంగళూరు నుంచి తెప్పించిన వివిధ రకాల పుష్పాలతో ఉత్సవ విగ్రహంతో పాటు రథాన్ని ముస్తాబు చేశారు. అనంతరం శోభాయాత్రను పుర ప్రముఖలు ప్రారంభించారు. వాయిద్య కళాకారులు, కోలాటం ఆడే కళాకారుల ప్రదర్శనల నడుమ శోభాయాత్ర బీరప్పగుడి సర్కిల్, ప్రధాన రహదారి, సత్యనారాయణపేట మీదుగా కసాపురం వరకు సాగింది. జై శ్రీరామ్, జై నెట్టికంటి ఆంజనేయస్వామి నినాదాలతో పురవీధులు మార్మోగాయి. దారి పొడవునా మాలధారులకు అన్నప్రసాదాలను భక్తులు అందజేశారు. ఆలయ ప్రాంగణం చేరుకున్న అనంతరం మాలధారులు ఇరుముడి సమర్పించారు. బుధవారం మాలధారుల నడుమ అత్యంత వైభవంగా హనుమద్‌వత్రం నిర్వహించడానికి ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శోభాయాత్రలో ఆర్డీఓ శ్రీనివాస్, ఆలయ ఈఓ విజయరాజు, ఆలయ కమిటీ చైర్మన్ సుగుణమ్మ, అర్చకులు, నెట్టికంటి మాలధారులు తదితరులు పాల్గొన్నారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.


