‘ఉపాధి’ కల్పనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’ కల్పనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

Dec 3 2025 7:33 AM | Updated on Dec 3 2025 7:33 AM

‘ఉపాధ

‘ఉపాధి’ కల్పనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

కూడేరు: ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు పనులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తే అటువంటి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) పీడీ సలీం బాషా సిబ్బందిని హెచ్చరించారు. మంగళవారం ఆయన చోళసముద్రం, కూడేరు, ఇప్పేరు గ్రామాల్లో ఉపాధి హామీ ద్వారా చేపడుతున్న నీటి కుంట, పశువుల షెడ్‌, కుడికాలువలో చెట్ల తొలగింపు, పూడిక తీత పనులను తనిఖీ చేశారు. పనులను నిబంధనల మేరకు నాణ్యతగా చేస్తే కేటాయింపు మేరకు దినకూలీ వర్తింపజేస్తామని కూలీలకు తెలియజేశారు. ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామ సభలు నిర్వహించి కూలీలకు ఏయే పనులు కల్పించడానికి అందుబాటులో ఉన్నాయో వివరించాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీఓ పోలేరయ్య, ఈసీ రాజేష్‌, టీఏలు కోమల అనిల్‌ కుమార్‌, ఆయా పంచాయతీల ఫీల్డ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

బెళుగుప్ప: మండలంలోని రామసాగరం, అంకంపల్లి గ్రామాల్లో ఉపాధి హామీకింద చేపట్టిన గోకులం షెడ్లు, పల్లె వనం పనులను డ్వామా పీడీ సలీం బాషా మంగళవారం పరిశీలించారు. పల్లె వనం మొక్కలను పూర్తిస్థాయిలో సంరక్షించాలని మండల అదికారులకు పీడీ సూచించారు. ఏపీఓ మురళీకృష్ణ, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ వన్నూరస్వామి, పంచాయతీ సెక్రటరీ వెంకటేశులు పాల్గొన్నారు.

బీటీపీ ఆయకట్టుకు

15 నుంచి సాగు నీరు

గుమ్మఘట్ట: భైరవానితిప్ప ప్రాజెక్టు ద్వారా ఈ నెల 15 నుంచి ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయనున్నట్లు జలవనరుల శాఖ రాయదుర్గం, కళ్యాణదుర్గం డీఈఈలు గీతాలక్ష్మి, దామోదర తెలిపారు. బైరవానితిప్ప గ్రామంలోని ఇన్‌స్పెక్షన్‌ బంగ్లా ఆవరణలో ఆయకట్టు రైతులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. కుడి కాలువ కింద 6బీ తూము నుంచి చివరి ఆయకట్టు వరకు 1,940 ఎకరాలకు, ఎడమ కాలువ కింద ఒకటో తూము నుంచి 9వ తూము వరకు 3,162 ఎకరాలకు సాగునీటిని విడుదల చేయనున్నట్లు వారు తెలిపారు. ఆయకట్టు రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జలవనరుల శాఖ ఈఈ సురేంద్రనాథ్‌రెడ్డి, ఎంపీపీ భవాని, గుమ్మఘట్ట, బ్రహ్మసముద్రం తహసీల్దార్లు రజాక్‌వలి, సుమతి, సాగునీటి సంఘం చైర్మన్‌ నాగరాజు, వైస్‌ చైర్మన్‌ సుబాన్‌, ఏఈఈ హరీష్‌, రైతులు పాల్గొన్నారు.

ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్ట్‌

రెండున్నర కిలోల గంజాయి స్వాధీనం

గుంతకల్లు టౌన్‌: పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని వన్‌టౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రెండున్నర కిలోల గంజాయితో పాటు రూ.11 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ మనోహర్‌ మంగళవారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు. పట్టణంలోని ఇరానీ కాలనీకి చెందిన యాసర్‌ అలీ, షేక్‌ మొహమ్మద్‌ ఈజీ మనీకి అలవాటు పడి ఆరు నెలలుగా గంజాయి విక్రయిస్తున్నారు. మహారాష్ట్రలోని థానే జిల్లా కోసాటౌన్‌ మురముర ప్రాంతం నుంచి రూ.25 వేలకు గంజాయి కొనుగోలు చేశారు. ఆ గంజాయిని చిన్న ప్యాకెట్లుగా తయారుచేసి వాటిని అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అందిన సమాచారం మేరకు పట్టణంలోని రైల్వే ఆస్పత్రి వెనుక పాడుబడిన రైల్వేక్వార్టర్స్‌ వద్ద యాసర్‌ అలీ, షేక్‌ మొహమ్మద్‌ను అరెస్ట్‌ చేసి, వీరి నుంచి రెండున్నర కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. వీరిని కోర్టులో హాజరుపరిచామన్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు విక్రేతలను త్వరలో పట్టుకుంటామని చెప్పారు. సమావేశంలో ఎస్‌ఐ కొండయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

‘ఉపాధి’ కల్పనలో  నిర్లక్ష్యం వహిస్తే చర్యలు 1
1/2

‘ఉపాధి’ కల్పనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

‘ఉపాధి’ కల్పనలో  నిర్లక్ష్యం వహిస్తే చర్యలు 2
2/2

‘ఉపాధి’ కల్పనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement