మాల్యంలో మాతా శిశు మరణం
● గర్భంలోనే శిశువు మృతి
● సిజేరియన్ సమయంలో తల్లి మృత్యువాత
● శోకసంద్రంలో కుటుంబ సభ్యులు
కణేకల్లు: రాయదుర్గం నియోజకవర్గంలో మాతాశిశు మరణం కలకలం రేపింది. ఏడు నెలల శిశువు గర్భంలోనే మృతి చెందగా.. సిజేరియన్ చేసి బయటకు తీసే క్రమంలో అధిక రక్తస్రావమై తల్లి మరణించింది. వివరాలిలా ఉన్నాయి. కణేకల్లు మండలం మాల్యం గ్రామానికి చెందిన హరిజన గంగమ్మ (26), హరిజన సురేష్ దంపతులు. వీరికి ఏడాదిన్నర వయసుగల కుమారుడు ఉన్నాడు. గంగమ్మ రెండోసారి గర్భం దాల్చింది. ఇటీవల డీ హీరేహాళ్ మండలం కల్యం గ్రామంలోని పుట్టింటికెళ్లింది. నెలవారీ వైద్య పరీక్షల్లో హైరిస్క్ గర్భవతిగా గుర్తించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భంతో ఉంది. సోమవారం ఉదయం తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న గంగమ్మను భర్త వచ్చి హుటాహుటిన కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించి.. కడుపులో బిడ్డ అడ్డం తిరిగినట్లు గుర్తించి మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళ్లాలని సూచించారు. వెంటనే అంబులెన్స్ ద్వారా అనంతపురం సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ మరోమారు వైద్య పరీక్షలు చేసి.. కడుపులో శిశువు మృతి చెందినట్లు గుర్తించారు. సిజేరియన్ చేసి శిశువును బయటకు తీయాలని కుటుంబ సభ్యులకు చెప్పారు. సరే తల్లినైనా కాపాడండని కుటుంబ సభ్యులు కోరారు. అనంతరం వైద్యులు సిజేరియన్ చేస్తుండగా... అధిక రక్తస్రావమై గంగమ్మ కూడా ప్రాణాలు కోల్పోయింది.
అమ్మా.. అమ్మా...
గంగమ్మ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు మాల్యం తీసుకొచ్చారు. అమ్మ చనిపోయిన విషయం పసికందుకు తెలియలేదు. ఎందుకని అమ్మ లేవలేదని అక్కడే ఉండిపోయాడు. ఎంతకూ లేవలేదని ‘అమ్మా.. అమ్మా..’ అంటూ ఏడవడం మొదలు పెట్టాడు. గుక్కపట్టి ఏడుస్తూనే ఉన్న కుమారుడిని చూసి అక్కడున్నవారు కంటతడి పెట్టారు. దేవుడు ఎంత నిర్దయుడు.. పసికందుకు తల్లిని లేకుండా చేశాడు అంటూ నిట్టూర్చారు.
అమ్మ పలకలేదని ఏడుస్తున్న చిన్నారి (ఇన్‌సెట్) గంగమ్మ
మాల్యంలో మాతా శిశు మరణం


