రెడ్ బుక్ అండతో అధికమైన అకృత్యాలు
అనంతపురం: రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలులోకి తేవడంతో అకృత్యాలు అధికమయ్యాయని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ధ్వజమెత్తారు. అనంతపురంలోని తన నివాసంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక తాడిపత్రిలో ఆటవిక పాలన సాగుతోందన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు పెచ్చుమీరాయని తెలిపారు. స్టేషన్‌కు వెళ్లి కేసులు నమోదు చేస్తే.. నిందితులు తిరిగి కౌంటర్ కేసులు పెడుతూ వైఎస్సార్‌సీపీ నాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. శాంతిభద్రతలు ప్రశ్నార్థకంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ రెడ్‌బుక్ రాజకీయాలు ఆపి.. ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని హితవు పలికారు. స్వార్థ రాజకీయాల కోసం జేసీ ప్రభాకర్‌రెడ్డి గొడవలు సృష్టిస్తున్నారని, పోలీసుల ద్వారా అక్రమ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసులు, అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించకపోతే తగిన మూల్యం తప్పదని హెచ్చరించారు.
దందాలో జేసీ ప్రభాకర్‌రెడ్డికి వాటాలు
తాడిపత్రిలో విచ్చలవిడిగా గంజాయి, మట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, మహిళలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదని పెద్దారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తాడిపత్రి శివారులో ఎర్ర కాలువను ఆక్రమించి ప్లాట్లు వేస్తున్నారని, వంకలు పూడ్చి, ప్లాట్లు వేసి అమ్మకాలు సాగిస్తున్నారని, పెద్ద కాలువలను పూడ్చి చిన్న డ్రెయినేజీలుగా మార్చేశారని తెలిపారు. భారీ వర్షం వస్తే పలు కాలనీలు నీట మునిగిపోతాయన్నారు. తాడిపత్రి దందా వ్యవహారాల్లో జేసీ ప్రభాకర్‌రెడ్డికి వాటాలు అందుతున్నాయని ఆరోపించారు. తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. వంకలు, వాగుల్లో లే అవుట్లు వేయకుండా, ఇప్పటికే ఉన్న ఆక్రమణలు తొలగించాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తామన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ఎస్పీకి లేఖ రాసినట్లు వివరించారు. కలెక్టర్, ఎస్పీ తక్షణమే స్పందించి తాడిపత్రి ప్రజలకు భరోసా కల్పించాలని కోరారు. గంజాయి విక్రేతలు, మట్కా బీటరు, పేకాట నిర్వాహకులు ఎవర్ని అడిగినా తాము ఎమ్మెల్యేకు వారం వారం చందాలు ఇస్తున్నామంటున్నారన్నారు. ఈ అక్రమ నిర్మాణాలపై ఎమ్మెల్యే అస్మిత్‌రెడ్డి, ఎమ్మెల్యే తండ్రి జేసీ ప్రభాకర్‌రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడే కాదు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసలు రాజకీయ నాయకుడే కాదని, చంద్రబాబు వద్ద నెల మామూళ్లు తీసుకోవడం తప్ప ఆయనకేం తెలుసని మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఎద్దేవా చేశారు. మహిళలపై దారుణాలు జరుగుతున్నా ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. రాయల సీమలో ఫ్యాక్షన్ తగ్గింది కానీ.. రెడ్‌బుక్ రాజ్యాంగంతో అరాచకాలు, అకృత్యాలు పెరిగిపోయాయన్నారు.
తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు పెచ్చుమీరాయి
స్వార్థ రాజకీయాలు కోసం జేసీ ప్రభాకర్‌రెడ్డి గొడవలు సృష్టిస్తున్నారు
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దా రెడ్డి ధ్వజం


