రెండు రోజులు వర్షాలు
అనంతపురం అగ్రికల్చర్: దిత్వా తుపాను ప్రభావంతో రాగల రెండు రోజులు ఉమ్మడి జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వాతావరణశాఖ విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు రాయలసీమ జిల్లాలకు వర్షసూచన ఉందన్నారు. అందులో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమ, మంగళవారం మంచి వర్షపాతం నమోదు కావొచ్చన్నారు. ఆదివారం రాత్రికే చాలా ప్రాంతాల్లో వర్షం కురవొచ్చన్నారు. సోమవారం కొన్ని ప్రాంతాల్లో 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. జడివాన, తేలికపాటి వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. మంగళవారం మోస్తరు వర్షపాతం నమోదు కావొచ్చన్నారు.
నేడు కలెక్టరేట్‌లో
పరిష్కార వేదిక
అనంతపురం అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్న పరిష్కార వేదికలో ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో సమర్పించాలన్నారు. అర్జీతో పాటు ఆధార్, ఫోన్ నంబర్లు తప్పనిసరిగా అందించాలన్నారు. సమస్యపై గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దానికి సంబంధించి రసీదు తీసుకురావాలన్నారు. అర్జీ పరిష్కార స్థితిని కాల్‌సెంటర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ప్రజలు తమ అర్జీలను పరిష్కార వేదిక ద్వారానే కాకుండా mee kosam.ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లోనూ సమర్పించవచ్చని తెలియజేశారు.
రేషన్ సక్రమంగా పంపిణీ చేయకుంటే చర్యలు
● జేసీ శివ్ నారాయణ్ శర్మ
అనంతపురం అర్బన్: కార్డుదారులకు రేషన్ సక్రమంగా పంపిణీ చేయని డీలర్లపై చర్యలు తీసుకుంటా మని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ స్పష్టం చేశారు. సోమవారం నుంచి ఈనెల 15వ తేదీ వరకు రోజూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు బియ్యం, సరుకులు కచ్చితంగా పంపిణీ చేసేలా చూడాలని సీఎస్‌డీటీలను ఆదేశించారు. సరుకుల పంపిణీ విషయంలో ఏవైనా సమస్యలుంటే కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్ 85002 92992కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
లక్ష్మీనరసింహస్వామి
బ్రహ్మోత్సవాలు ప్రారంభం
మడకశిరరూరల్: భక్తరపల్లి లక్ష్మీనరసింహస్వామి, జిల్లెడుగుంట ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. స్వామి వార్లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం విశ్వక్సేన, రక్షా బంధన, అంకురార్పణ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం స్వామివార్లకు ధ్వజారోహణ, అంకురార్పణ, హోమంతో పాటు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాల సమర్పణ తదితర కార్యక్రమాలు ఉంటాయని దేవదాయశాఖ అధికారులు తెలిపారు.
రెండు రోజులు వర్షాలు
రెండు రోజులు వర్షాలు
రెండు రోజులు వర్షాలు


