పశువైద్యానికి కష్టకాలం
జిల్లాలోని పశు వైద్యశాలల్లో మూగజీవాలకు సరైన వైద్యం అందడం లేదు. డాక్టర్ల కొరత, ఉన్నచోట సరైన సమయానికి విధులకు హాజరు కాకపోవడం, సీజనల్ వ్యాధులకు మందులు లేకపోవడంతో జిల్లాలో పశువులకు వైద్యం కరువైంది.
అనంతపురం అగ్రికల్చర్: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పశువైద్యం గాలిలో దీపమైంది. ప్రతి మూడు నెలలకోసారి పశువైద్యశాలలకు అవసరమైన మందులు, వైద్య సామగ్రి సరఫరా చేయాల్సి ఉన్నా.. ఏడాదికి కనీసం రెండు సార్లు కూడా చేయడం లేదు. అదిగో ఇదిగో అంటూ నెలల తరబడి నెట్టుకొస్తున్నారు. డాక్టర్లు, ఏడీలు ఆన్‌లైన్‌లో పెడుతున్న ఇండెంట్ చివరకు పత్తా లేకుండా పోతోంది. ఇప్పటికే చాలా ఆసుపత్రుల్లో మందులు లేని పరిస్థితి. ఏదైనా జబ్బు బారిన పడిన పశువులు, జీవాలను పశు వైద్యశాలకు తీసుకెళ్తే డాక్టర్లు పరీక్షించి ప్రైవేట్‌లో మందులు తీసుకురావాలని చెబుతుండడంతో పెంపకందారులు అవాక్కవుతున్నారు.
ప్రబలుతున్న ప్రాణాంతక వ్యాధులు..
పశువైద్యాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో తమపై అదనపు భారం పెరిగి పోతోందని రైతులు, కాపర్లు వాపోతున్నారు. ఇప్పటికే సీజనల్ వ్యాధులు, అంటు వ్యాధులు, లంపీస్కిన్, అంత్రాక్స్ లాంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలి వైద్యానికి ఇబ్బంది పడుతున్నామంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అత్యవసర మందులు లేక ప్రాథమిక వైద్యానికి కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆర్‌ఎస్‌కేలను పూర్తిగా విస్మరించడంతో గ్రామాల్లో ప్రథమ చికిత్సకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ఆర్‌బీకేల్లో సైతం అత్యవసర మందులు అందుబాటులో పెట్టారని, ఇపుడు ఆర్‌ఎస్‌కేల్లో ఎక్కడేగాని కనీసం మందు బిళ్ల కూడా కనిపించడం లేదని పశుపోషకులు అంటున్నారు.
తీవ్రంగా మందుల కొరత..
జిల్లా వ్యాప్తంగా పట్టణ, ఏరియా పశువైద్యశాలలు (వెటర్నరీ హాస్పిటల్స్–వీహెచ్‌లు) 15 ఉండగా, మండల, మేజర్ పంచాయతీ ప్రాంతాల్లో వెటర్నరీ డిస్పెన్సరీలు (వీడీ) స్థాయి ఆసుపత్రులు 56, గ్రామ స్థాయి పశుచికిత్సా కేంద్రాలు (రూరల్ లైవ్‌స్టాక్ యూనిట్స్–ఆర్‌ఎల్‌యూ) 14 ఉన్నాయి. ఇవి కాకుండా 122 గోపాలమిత్ర కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటన్నింటిలోనూ మందుల కొరత తీవ్రంగా నెలకొంది. ప్రథమ చికిత్స చేయడానికి కూడా చాలా ఆస్పత్రుల్లో అత్యవసర మందులు లేవు. గొంతువాపు, చొప్ప వాపు, చిటుకు రోగం, ఆంత్రాక్స్, ఈసుడు రోగం, బొబ్బరోగం, కొక్కెర తెగులు, మశూచి, రేబీస్, పారుడు రోగం, నట్టల మందు, గోట్‌ఫాక్స్, నీలినాలుక వ్యాధి, గాలికుంటురోగం, ముద్దచర్మవ్యాధి, బాతుపారుడు, బాతు ప్లేగు, జూనోటిక్ సమస్యలు, తదితర ప్రాణాంతక, ప్రమాదకరమైన వ్యాధుల నివారణ టీకాలు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో లేవంటున్నారు.
అరకొర సరఫరాతో నెలకొన్న
మందుల కొరత
ఆర్‌ఎస్‌కేల్లో ప్రథమ చికిత్సకూ ఇబ్బంది
పశువైద్యానికి కష్టకాలం
పశువైద్యానికి కష్టకాలం


