పింఛన్ కోసం వెళుతూ పరలోకాలకు..
● కారు ఢీకొని మహిళ మృతి
● కుమారుడికి తీవ్ర గాయాలు
ముదిగుబ్బ: పింఛన్ తీసుకోవడానికి వేరే గ్రామానికి వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో రామలక్ష్మమ్మ (72) అనే మహిళ మృతి చెందింది. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు... ముదిగుబ్బ మండలం ఈదులపల్లికి చెందిన రామలక్ష్మమ్మ పుట్టినిల్లు ధర్మవరం మండలం బిల్వంపల్లి. గతంలో ఆమె కుటుంబమంతా బిల్వంపల్లిలోనే నివాసం ఉండేది. ఆమెకు వితంతు పింఛన్ ఆ ఊరిలోనే వచ్చేది. తర్వాత కొంతకాలానికి ఈదులపల్లికి తిరిగొచ్చారు. పింఛన్ మాత్రం బిల్వంపల్లిలోనే ఉండిపోయింది. దీంతో ఆమె సోమవారం పింఛన్ తీసుకోవడానికి ఒకరోజు ముందుగానే ఆదివారం కుమారుడు ఓబుళపతితో కలసి ద్విచక్ర వాహనంపై బిల్వంపల్లికి బయలుదేరింది. మార్గమధ్యంలోని రాళ్ల అనంతపురం వద్ద రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో రామలక్ష్మమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. తీవ్రంగా గాయపడిన ఓబుళపతిని బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా..వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి పింఛన్ ఇచ్చేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పలువురు చర్చించుకోవడం కనిపించింది.
ప్రశాంతంగా
యూపీఎస్‌సీ పరీక్ష
అనంతపురం అర్బన్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) ఆధ్వర్యంలో ఏపీఎఫ్‌సీ, ఈఓ, ఏఓ పోస్టులకు సోమవారం నిర్వహించిన కంబైన్డ్ రిక్రూట్‌మెంట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల హాజరు 43.70 శాతం నమోదైంది. మొత్తం 1,263 మంది అభ్యర్థులకు గానూ 552 మంది హాజరవ్వగా 711 మంది గైర్హాజరయ్యారు. పరీక్షను డీఆర్‌ఓ మలోల, యూపీఎస్‌సీ అసిస్టెంట్ కంట్రోలర్ అనిల్‌కుమార్ పర్యవేక్షించారు.


