బడి బస్సు భద్రమేనా..?
అనంతపురం సిటీ: ఇటీవల కర్నూలు సమీపంలో రహదారిపైనే కావేరి బస్సు దగ్ధమై పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల బస్సుల కండీషన్లపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల బస్సులను తనిఖీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా జిల్లాలో రవాణా శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలకు సంబంధించి 680 వాహనాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో అత్యధిక శాతం వాహనాలకు భద్రతాపరమైన లోపాలు ఉన్నాయని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. నర్సరీ నుంచి డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ చదివే విద్యార్థులను తరలించే వాహనాల్లో ప్రమాదం జరిగితే భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెబుతున్నారు.వాహనాల్లో ఫైర్ అలారం, డిటెక్షన్ సిస్టం, అత్యవసర ద్వారాలు, స్పీడ్ గవర్నర్లు, అగ్ని ప్రమాదాలు జరిగితే నివారించే పరికరాలు పని చేయకపోవడం వంటి లోపాలు ఉన్నట్లు తెలుస్తోంది.
రంగంలోకి రవాణా శాఖ అధికారులు..
జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలకు చెందిన వాహనాల కండీషన్లను పరిశీలించేందుకు రవాణా శాఖ అధికారులు రంగంలోకి దిగారు. రెండు రోజుల క్రితం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అనంతపురం, తాడిపత్రి, గుంతకల్లు, కళ్యాణదుర్గం రవాణా శాఖ ప్రాంతీయ కార్యాలయాల పరిధిలో మొత్తం 71 వాహనాలను తనిఖీ చేశారు. అత్యవసర ద్వారం, స్పీడ్ గవర్నర్, అగ్నిమాపక పరికరాలు లేకపోవడం, ఉన్న వాటిలో సక్రమంగా పని చేయకపోవడాన్ని గుర్తించారు. 60 బస్సుల నిర్వాహకులకు నోటీసులు జారీ చేయడం గమనార్హం. మిగిలిన వాహనాలను కూడా తనిఖీ చేయాలని అధికారులు నిర్ణయించారు. నిబంధనలు అతిక్రమించిన వాహనాలను అవసరమైతే సీజ్ చేయనున్నట్లు చెబుతున్నారు.
కావేరి బస్సు ఘటన నేపథ్యంలో
అధికారుల స్పెషల్ డ్రైవ్
60 బస్సుల నిర్వాహకులకు నోటీసులు


