అపార్‌కు ఆటంకాలు
అనంతపురం సిటీ: ఆధార్ తరహాలో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే ప్రతి విద్యార్థికి 12 అంకెల గుర్తింపు సంఖ్యను జారీ చేసేలా కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్రక్రియకు నాంది పలికింది. నూతన విద్యా విధానం అమలులో భాగంగా దేశ వ్యాప్తంగా ప్రత్యేకించి విద్యార్థుల కోసమే అపార్ (ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమీ అకౌంట్ రిజిస్ట్రీ)ని తీసుకొచ్చింది. ఈ ప్రక్రియ అన్ని పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహించాలని ఆదేశించింది. అయితే ‘అపార్’ మొదట్లో కొంత వరకు జోరుగా సాగినా ఇప్పుడు ముందుకు సాగడం లేదు. పిల్లలను పాఠశాలల్లో చేర్చే సమయంలో నమోదు చేసిన వివరాలు, ఆధార్‌లోని వివరాలకు ఏమాత్రమూ పొంతన కుదరడం లేదని తెలుస్తోంది. దీంతో చిక్కులు తలెత్తుతున్నాయి. ప్రధానంగా ఇంటి పేరు, పుట్టిన తేదీల్లో చాలా తేడా ఉండడంతో వీటిని సరి చేయడం ప్రధాన సమస్యగా మారింది.
ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు..
పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లించడానికి అపార్ గుర్తింపు సంఖ్య అనివార్యం. అది ఉంటేనే ఫీజు చెల్లించేందుకు వీలు కలుగుతుందని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. ఈ సంవత్సరం జిల్లాలో పది పరీక్షలు రాసే విద్యార్థులు 1,74,837 మంది ఉన్నారు. 83.84 శాతం అపార్ నమోదు పూర్తయిందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. మిగిలిన వారి పరిస్థితిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఇక జిల్లా వ్యాప్తంగా ఇంటర్ కళాశాలలు 141 ఉండగా, మొత్తం 50,934 మంది విద్యార్థులకు గాను 24,213 మంది మాత్రమే అపార్ నమోదు చేయించుకున్నారు. మిగిలిన 26,721 మంది పిల్లల వివరాలు నమోదు కాకపోవడం గమనార్హం.
ఆధార్‌లో తప్పులతో మందకొడిగా ప్రక్రియ
వేల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ కాని వైనం
‘అపార్’ ఉంటేనే పరీక్ష ఫీజు చెల్లింపునకు అవకాశం
ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు
వంద శాతం పూర్తి చేస్తాం
విద్యార్థులకు అపార్ చాలా కీలకం కానుంది. వంద శాతం ఈ ప్రక్రియను పూర్తి చేస్తాం. ఇందుకు సంబంధించి ఎంఈఓలు, అన్ని పాఠశాలల హెడ్మాస్టర్లకు, ఉపాధ్యాయులకు తగిన ఆదేశాలు ఇచ్చాం.
– కడప ప్రసాద్‌బాబు, డీఈఓ
సమస్యలను అధిగమిస్తాం
ఆధార్ కార్డుల్లోని వివరాలతో పాఠశాలల్లో నమోదైన వివరాలు సరిపోలడం లేదు. అందుకే ఆలస్యమవుతోంది. సమస్యను అధిగమించి త్వరలోనే లక్ష్యం మేరకు అపార్ నమోదును పూర్తి చేయాలని అన్ని కళాశాల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీ చేశాం.
– కదిరి వెంకటరమణ నాయక్, ఆర్‌ఐఓ


