
ఇతరులకు చెబుతాం.. ఆచరించం!
అనంతపురం అర్బన్: జిల్లా యంత్రాంగంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న రెవెన్యూ శాఖ తన సొంత ఉద్యోగుల నుంచే విమర్శలు మూటగట్టుకుంటోంది. మా ‘రూటే’ వేరయా అంటూ ఉద్యోగులు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇతరులకు చెబుతాం.. మేం ఆచరించం అన్నట్లుగా ఇక్కడ పరిస్థితి తయారైంది. పదోన్నతుల కల్పన.. మండలాల్లో ఇన్‌చార్జ్ పాలన.. బదిలీలు.. చివరికి వాహనాలు, పాత సామగ్రి వేలం విషయంలో ఇతర శాఖలకు ఇచ్చిన ఆదేశాలు ఈ శాఖలో మాత్రం అమలు కావనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.
పదోన్నతులేవీ...?
‘ఉద్యోగులకు పదోన్నతులు సకాలంలో కల్పించాలి.. విమర్శలకు తావివ్వకుండా ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి’ అని ఇతర శాఖలకు రెవెన్యూ ఉన్నతాధికారులు ఆదేశాలిస్తారు. తమ శాఖలో ఆ ఆదేశాలు అమలవుతున్నాయో లేదో మాత్రం పట్టించుకోరు. ఇక్కడి ఉద్యోగులకు పదోన్నతులు ఎండమావిగా మారాయి. వివిధ కేటగిరీలకు సంబంధించి పదోన్నతుల ప్రక్రియ నిర్వహణలో ఏడాదిగా జాప్యం జరుగుతోంది. పదోన్నతి ఎప్పుడు కల్పిస్తారోనని ఉద్యోగులు చకోరపక్షుల్లా ఎదురు చూస్తున్నారు.
ఇంకా ఇన్‌చార్జ్ పాలనే..
‘‘ఏ శాఖలోనూ ఇన్‌చార్జ్ పాలన ఉండకూడదు... రెగ్యులర్ అధికారిని నియమించాలని ఉన్నతాధికారులకు లేఖలు రాయండి’’ అంటూ ఇతర ప్రభుత్వ శాఖలకు ఆదేశాలిస్తున్న రెవెన్యూ ఉన్నతాధికారులు తమ శాఖలో మాత్రం ఇన్‌చార్జ్ పాలనకు స్వస్తి చెప్పడం లేదు. జిల్లావ్యాప్తంగా దాదాపు ఐదారు మండలాలకు తహసీల్దార్లను నియమించకుండా ఇన్‌చార్జ్‌లతోనే నెట్టుకొస్తుండడమే దీనికి నిదర్శనం. స్వయంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని కూడేరు మండలానికి తహసీల్దారును నియమించకుండా ఇన్‌చార్జ్‌తోనే కాలం నెట్టుకొస్తున్నారంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
బదిలీ బంతాట..
‘బదిలీల ప్రక్రియ విమర్శలకు, వివాదాలకు తావివ్వకుండా పారదర్శకంగా నిర్వహించాలి’ అని ఇతర శాఖలకు రెవెన్యూ ఉన్నతాధికారులు ఆదేశాలిస్తారు. కానీ, అదే శాఖలో నిర్వహించే బదిలీల ప్రక్రియలో పారదర్శకతను గాలికొదిలారు. ఇటీవల తహసీల్దార్ల బదిలీలు, పోస్టింగ్ విషయంలో ఈ విషయం స్పష్టమైంది. విమర్శలకు తావిచ్చేలా ప్రక్రియ నిర్వహించారు. ఒకసారి ఇచ్చిన స్థానాలను మార్పు చేస్తూ మరో ఉత్తర్వు... దాన్ని మార్పు చేస్తూ ఇంకో ఉత్తర్వు... ఇలా బంతిలా తహసీల్దార్లను బదిలీలతో ఆడుకున్నారు.
సామగ్రి తుప్పుపట్టిపోవాల్సిందేనా
అనంతపురంలోని కలెక్టర్ కార్యాలయం వెనుక దాదాపు 12 పాత వాహనాలు మూలనపడ్డాయి. కండీషన్‌లో ఉన్నవాటిని కూడా పడేయడంతో ఇప్పుడు ఎందుకూ పనిరాకుండా తయారయ్యాయి. కొత్త సామగ్రి రావడంతో పాత బీరువాలు, ఇనుప ర్యాక్‌లు తదితర వస్తువులు కార్యాలయ ఆవరణలో పడేశారు. అవి ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చివరికి గుజరీకి కూడా పనికిరాకుండా పోతున్నాయి. మీ శాఖల పరిధిలో పాత వాహనాలు, సామగ్రిని బహి రంగ వేలం వేయండి అంటూ ఇతర శాఖలకు గడువులు విధిస్తున్న రెవెన్యూ అధికారులు తమ దగ్గర ఉన్న సామగ్రిని పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
రెవెన్యూ ‘రూటే’ వేరు
పదోన్నతుల కల్పనలో ఏడాదిగా జాప్యం
మండలాల్లో ఇంకా ఇన్‌చార్జ్‌ల పాలనే
బదిలీల్లో కానరాని పారదర్శకత
కొండెక్కిన వాహనాలు, పాత సామగ్రి వేలం