
నెట్టికంటుడి సన్నిధిలో కలెక్టర్ దంపతులు
గుంతకల్లు రూరల్: కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామిని కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాన్ని అందజేశారు. అనంతరం తనను కలసిన ఆలయ ఔట్‌సోర్సింగ్ సిబ్బంది సమస్యలను కలెక్టర్ ఆలకించి, త్వరలోనే ఇళ్ల స్థలాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ దంపతులు సమీపంలోని లక్ష్మీనారాయణస్వామి ఆలయాన్ని సందర్శించారు.
పీర్ల ఉత్సవంలో అపశ్రుతి
గుంతకల్లు: స్థానిక తాటాకులగేరిలో ఆదివారం జరిగిన పీర్ల ఉత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. పీరును ఎత్తుకున్న ఖయ్యూం (48) గుండెపోటుతో మృతిచెందాడు. ఫక్కీరప్ప కాలనీలో నివాసముంటున్న ఆయన గత 20 ఏళ్లుగా పీర్ల స్వాములను ఎత్తుకునేవాడు. ఈ క్రమంలో పెద్ద సరిగెత్తులో భాగంగా ఆదివారం వేకువజామున పీర్లు అగ్నిగుండ ప్రవేశం ఉత్సవాన్ని వేడుకగా చేపట్టారు. పీరును ఎత్తుకున్న ఖయ్యూం.. కాసేపటికే ఛాతీలో నొప్పిగా ఉందంటూ ఇతరులకు అప్పగించి, జెండా కట్ట వద్ద కూర్చొని నీళ్లు తాగిన వెంటనే కుప్పకూలిపోయాడు. వెంటనే సహచరులు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతిచెందినట్లు నిర్ధారించారు. గుండెపోటు కారణంగానే ఆయన మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు.
ఎమ్మెల్యే శ్రావణికి భంగపాటు
బుక్కరాయసముద్రం: టీడీపీ మండల కన్వీనర్ ఎంపిక విషయంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి వర్గీయులకు భంగపాటు తప్పలేదు. బీకేఎస్ మండల కేంద్రంలోని దేవరకొండ వద్ద ఆదివారం కన్వీనర్ ఎంపిక విషయంపై టీడీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎన్నికల పరిశీలకుడు మల్లికార్జున, ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి, ఆలం నరసానాయుడు హాజరయ్యారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి గైర్హాజరయ్యారు. టీడీపీ కన్వీనర్ పదవి కోసం బీకేఎస్ మాజీ సర్పంచ్ లక్ష్మినారాయణ, ఎమ్మెల్యే వర్గీయుడైన ఈశ్వరయ్య మధ్య పోటీ నెలకొంది. అయితే సమావేశంలో 90 శాతం మంది లక్ష్మినారాయణకు మద్దతు తెలిపారు. ఆయన్ను కన్వీనర్‌గా ఎంపిక చేయకపోతే పార్టీకి స్వచ్ఛందంగా రాజీనామాలు చేస్తామంటూ ఆడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే శ్రావణికి చుక్కెదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది.