
ఊపందుకున్న నార్ల పెంపకం
బొమ్మనహాళ్: తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) పరిధిలోని ఆయకట్టు భూముల్లో ముందస్తు నార్ల పెంపకం ఊపందుకుంది. ఈ నెల 10 తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీకి నీటి విడుదలపై ఇప్పటికే టీబీ బోర్డు అధికారులు స్పష్టత ఇవ్వడంతో జిల్లాలో మిరప, వరి పైర్లకు డిమాండ్ పెరిగింది. దీంతో హెచ్చెల్సీ పరిధిలో బోరు బావుల కింద నార్ల పెంపకం చేపట్టారు. బొమ్మనహాళ్, కణేకల్లు, డి.హీరేహాళ్‌తో పాటు కర్ణాటకలోని బళ్లారి జిల్లా పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు దేవగిరి క్రాస్, దేవగిరి, బెంచికొట్టాలు, కణేకల్లు క్రాస్, ఉంతకల్లు గ్రామాల్లో నర్సరీలు, పొలాల్లో బోర్ల కింద ముందస్తుగా మిరప నార్లు పోసేందుకు పోటీ పడుతున్నారు.
పెరుగుతున్న నార్ల ధరలు
మార్కెట్‌లో రైతుల డిమాండ్‌ను ఆసరాగా చేసుకున్న కొందరు వ్యాపారులు విత్తన ధరలను అమాంతం పెంచి విక్రయాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం వివిధ కంపెనీలకు చెందిన మిరప విత్తనాలు డిమాండ్‌ను బట్టి కిలో రూ.25 వేల నుంచి రూ. లక్ష వరకు ధర పలుకుతున్నాయి. బ్యాడిగ మిరప విత్తనాల కోసం రైతులు కర్ణాటకలోని బ్యాడిగ పట్టణానికి వెళ్లి కిలో రూ. 900 చొప్పున మిరప కాయలను కొనుగోలు చేసి విత్తనాలను సిద్ధం చేసుకుంటున్నారు. మరికొందరు రైతులు విడపనకల్లు మండలం వేల్పుమడుగు, ఆర్ కొట్టాల గ్రామాల్లో రైతుల వద్ద నుంచి బ్యాడిగ, డీలెక్స్, డబ్బీ కాయలను స్ధానికంగానే కిలో రూ. 700 నుంచి రూ. 900 వరకు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. బొమ్మనహాళ్, కనేకల్లు మండలాల్లో హెచ్చెల్సీ కింద వరి పంట సాగు ఎక్కువగా ఉన్నందున వరి నార్లకు భారీగా డిమాండ్ నెలకొంది. బీపీటీ సోనా, ఎన్‌ఎల్‌ఆర్, ఆర్‌ఎన్‌ఆర్ రకాలకు చెందిన వరి పంటను ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు కర్ణాటకలోని కంప్లి వద్ద ఉన్న వసికేరి క్యాంపు నుంచి వరి విత్తనాలను తీసుకొస్తున్నారు. ప్రస్తుతం 30 కిలోల విత్తనం రూ. 1,450 ధర పలుకుతోంది. ఇక స్ధానికంగా రైతులు పండించిన బీపీటీ సోనా 70 కిలోల విత్తనమైతే రూ.3,200, ఎల్‌ఎల్‌ఆర్ రూ.3,800, ఆర్‌ఎన్‌ఆర్ రూ.3,800 వరకు ధర పలుకుతున్నాయి. పత్తి విత్తనాలు కూడా 450 గ్రాములు రూ. 900 నుంచి రూ. వెయ్యి వరకు విక్రయిస్తున్నారు. మొక్కజొన్న విత్తనాలు నాలుగు కిలోలు రూ.1,600 నుంచి రూ. 1,800 వరకు అమ్ముడు పోతోంది. ప్రభుత్వం రైతులకు ఇచ్చే రాయితీ విత్తనాలు కూడా సక్రమంగా పంపిణీ కాక పోవడంతో రైతులు బహిరంగ మార్కెట్‌కు వెళ్లి విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్‌లో క్వింటా వేరుశనగ విత్తన కాయలు రూ.6,800 వరకు ధర పలుకుతోంది.
సెంటు స్ధలం అద్దె రూ.700
బోర్లు లేని రైతులు బోరుబావులు ఉన్న రైతుల వద్ద ముందస్తుగా నార్లు పెంచుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సెంటు స్థలం, నీటికి రూ.700 అద్దె చెల్లిస్తున్నారు. ముందస్తుగా వరి నార్లు పెంచుకుటే రైతులకు 40 రోజుల నీరు ఆదా అవుతుంది. హెచ్చెల్సీకి నీరు అందగానే వరి, మిరప నార్లు వేసుకునేందుకు ఉపయోగపడుతుంది.
మిరప, వరి నార్లకు పెరిగిన డిమాండ్
10న హెచ్చెల్సీకి నీటి విడుదల
రైతులు జాగ్రత్త వహించాలి
విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో రైతులు చాలా జాగ్రత్త వహించాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన డీలర్లు వద్దనే విత్తనాలు కొనుగోలు చేయడంతో పాటు అందుకు తగిన రసీదును తీసుకోవాలి. కర్ణాటకలో విత్తనాలు కొనుగోలు చేసే రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలి.
– సాయికుమార్, వ్యవసాయాధికారి,
బొమ్మనహాళ్

ఊపందుకున్న నార్ల పెంపకం